Share News

ఐదోరోజు 5

ABN , Publish Date - Sep 25 , 2026 | 06:03 AM

ఆసియా క్రీడల్లో ఐదో రోజు గురువారం భారత్‌ పతక వేటలో మురిపించింది. ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ అథ్లెట్లు బరిలోకి దిగిన తొలి రోజే పతకాల వేట మొదలు పెట్టేశారు. అంచనాలకు తగ్గట్టుగానే...

ఐదోరోజు 5

  • 4 X 400 మీ. మిక్స్‌డ్‌ రిలేలో రజతం జూసీమాకు 10,000 మీ. కాంస్యం

  • ఉషులో రోషిబినాకు రజతం జూమిక్స్‌డ్‌ స్కీట్‌, రోయింగ్‌లోనూ కంచుమోత

నగోయ: ఆసియా క్రీడల్లో ఐదో రోజు గురువారం భారత్‌ పతక వేటలో మురిపించింది. ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ అథ్లెట్లు బరిలోకి దిగిన తొలి రోజే పతకాల వేట మొదలు పెట్టేశారు. అంచనాలకు తగ్గట్టుగానే మిక్స్‌డ్‌ 4గీ400మీ.లో భారత బృందం రజతం సాధించగా.. మహిళల 10వేల మీ. ఫైనల్లో సీమా కుమారి కాంస్యం అందించింది. తద్వారా ఈ విభాగంలో భారత్‌ 16 ఏళ్ల ఎదురుచూపులకు తెరదించింది. ఇక స్వర్ణంపై గురి పెట్టిన ఉషు క్రీడాకారిణి రోషిబినా ఫైనల్లో ఓడి వరుసగా రెండోసారి రజతంతో సరిపెట్టుకుంది. అలాగే స్కీట్‌ షూటింగ్‌లో మరో కాంస్యం దక్కగా.. పురుషుల రోయింగ్‌ డబుల్‌ స్కల్స్‌లో భారత్‌ తొలిసారి కాంస్యం దక్కించుకుంది. మొత్తంగా పోటీల ఐదో రోజును భారత అథ్లెట్లు 2 రజతాలు, 3 కాంస్యాలతో ముగించారు. ఇదిలావుండగా పురుషులు, మహిళల కబడ్డీ జట్లు సెమీ్‌సకు చేరడంతో కనీసం కాంస్య పతకాలు ఖరారైనట్టే..

గురువారం పోటీల ఆఖరున భారత్‌ 4 X 400మీ. రిలేలో రజతంతో సంతృప్తికరంగా ముగించింది. పూవమ్మ రాజు, విశాల్‌ తెన్నరసు, విథ్యా రామ్‌రాజ్‌, మను టీఎ్‌సలతో కూడిన బృందం 3:14.46 సెకన్ల టైమింగ్‌తో రెండో స్థానంలో నిలిచి రజతం అందుకుంది. 2023 హాంగ్జౌ క్రీడల్లోనూ వీరు రజతం సాధించారు. గేమ్స్‌ రికార్డు టైమింగ్‌ (3:12.87)తో బహ్రెయిన్‌ స్వర్ణం గెలిచింది.


16 ఏళ్ల తర్వాత..

మహిళల 10,000మీ. రిలే పోటీల్లో సీమా కుమారి (32:50.05) మూడో స్థానంలో నిలిచి కాంస్యం అందుకుంది. ఈ ఈవెంట్‌లో భారత్‌కు 16 ఏళ్ల తర్వాత లభించిన మెడల్‌ ఇది. అంతేకాకుండా ఇప్పటివరకు మహిళల 10,000మీ. రిలేలో మన దేశానికి కేవలం మూడు పతకాలు మాత్రమే లభించాయి.

ఆషా...తృటిలో

మహిళల ట్రిపుల్‌ జంప్‌లో ఆషా ఇలంగో నాలుగో స్థానంలో నిలిచి త్రుటిలో కాంస్యం కోల్పోయింది. ఆషా, చైనా జంపర్‌ యి లి అత్యుత్తమంగా 13.83 మీటర్లు దూకి సమంగా నిలిచారు. కానీ, రెండో ప్రయత్నంలో చైనా అథ్లెట్‌ మెరుగైన ప్రదర్శన చేయడంతో.. ఆషాకు నిరాశే ఎదురైంది. అనిమేష్‌ కుజూర్‌, గురీందర్‌ వీర్‌ సింగ్‌ పురుషుల 100 మీ. సెమీ్‌సకు అర్హత సాధించారు.

రోషిబినా రెండోసారి..

వివాదాస్పద రీతిలో చివరి నిమిషంలో ఆసియాడ్‌ బరిలోకి దిగిన ఉషు క్రీడాకారిణి రోషిబినా సత్తా చాటుకుంది. స్వర్ణంపై కన్నేసిన తను మహిళల 60 కేజీల సాండా ఫైనల్లో 0-2 తేడాతో జాంగ్‌ జియోయు (చైనా) చేతిలో ఓడింది. దీంతో వరుసగా రెండోసారి రజతంతో సంతృప్తి పడాల్సివచ్చింది. ఆమె 2018 క్రీడల్లో కాంస్యం అందుకుంది.

15-sports.jpg

డబుల్‌ స్కల్స్‌లో తొలిసారి..

ఆసియా గేమ్స్‌ రోయింగ్‌ ఈవెంట్‌లో సత్నామ్‌ సింగ్‌-సల్మాన్‌ ఖాన్‌ ద్వయం చరిత్ర సృష్టించింది. పురుషుల డబుల్‌ స్కల్స్‌ ఈవెంట్‌లో మొదటిసారిగా భారత్‌ ఖాతాలో పతకం చేరింది. సత్నామ్‌ సింగ్‌-సల్మాన్‌ ఖాన్‌ (6:13.25) మూడో స్థానంలో నిలిచి కాంస్యం అందుకున్నారు. అయితే 1500మీ. వరకు భారత జోడీ రెండో స్థానంలోనే కొనసాగినా.. చివరి 500మీ.లలో వెనుకబడింది.


మిక్స్‌డ్‌ టీమ్‌ స్కీట్‌లో..

షూటింగ్‌లో భారత్‌ ఖాతాలో మరో పతకం జత చేరింది. మిక్స్‌డ్‌ టీమ్‌ స్కీట్‌ ఈవెంట్‌ ఫైనల్లో అనంత్‌ జీత్‌ సింగ్‌/పరినాజ్‌ ధలీవాలా జోడీ 44 స్కోరుతో మూడో స్థానంలో నిలిచి కాంస్యం అందుకుంది. దీంతో షూటింగ్‌లో మన పతకాల సంఖ్య ఎనిమిదికి చేరింది.

పతకాల పట్టిక

దేశం స్వ ర కాం మొ

1 చైనా 80 30 20 130

2 జపాన్‌ 20 34 37 91

3 ద. కొరియా 10 12 28 50

4 కజకిస్థాన్‌ 8 8 9 25

5 ఉజ్బెకిస్థాన్‌ 6 12 8 26

15 భారత్‌ 1 7 9 17

గమనిక- స్వ: స్వర్ణం; ర: రజతం కాం: కాంస్యం; మొ: మొత్తం

ఈ వార్తలనూ చదవండి:

వరుసగా మూడో పతకం.. ఆసియా క్రీడల్లో రోషిబినా దేవికి రజతం..

అప్పుడు మల్లి.. ఇప్పుడు మీరా!

Updated Date - Sep 25 , 2026 | 06:04 AM