వరుసగా మూడో పతకం.. ఆసియా క్రీడల్లో రోషిబినా దేవికి రజతం..
ABN , Publish Date - Sep 24 , 2026 | 10:28 AM
భారత వుషు క్రీడాకారిణి రోషిబినా దేవి ఆసియా క్రీడల్లో మరోసారి సత్తా చాటింది. చివరి నిమిషంలో జట్టులో చోటు దక్కించుకున్న రోషిబినా దేవి రజతంతో మెరిసింది. జపాన్‌లోని ఐచి-నాగోయా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో మహిళల 60 కిలోల సాండా విభాగంలో ఆమె రజతం పతకం సాధించింది.
ఇంటర్నెట్ డెస్క్: భారత వుషు క్రీడాకారిణి రోషిబినా దేవి ఆసియా క్రీడల్లో మరోసారి సత్తా చాటింది. చివరి నిమిషంలో జట్టులో చోటు దక్కించుకున్న రోషిబినా దేవి రజతంతో మెరిసింది. జపాన్‌లోని ఐచి-నాగోయా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో మహిళల 60 కిలోల సాండా విభాగంలో ఆమె రజతం పతకం సాధించింది. ఫైనల్లో చైనాకు చెందిన జాంగ్ షియావోయు చేతిలో 0-2 తేడాతో ఓడిపోయింది. రెండు రౌండ్లలోనూ చైనా క్రీడాకారిణి ఆధిపత్యం ప్రదర్శించింది (Roshibina Devi silver medal).
రోషిబినా దేవికి ఆసియా క్రీడల్లో ఇది వరుసగా మూడో పతకం. 2018 జకార్తా ఆసియా క్రీడల్లో ఆమె కాంస్య పతకం సాధించింది. 2023 హాంగ్‌జౌ క్రీడల్లో 60 కిలోల సాండా విభాగంలో రజతం గెలిచింది. ఇప్పుడు 2026 ఐచి-నాగోయా క్రీడల్లోనూ రజతం దక్కించుకుంది. దీంతో వరుసగా మూడు ఆసియా క్రీడల్లో పతకాలు సాధించిన తొలి భారత వుషు క్రీడాకారిణిగా రోషిబినా నిలిచింది. అయితే ఈసారి ఆసియా క్రీడల ప్రయాణం రోషిబినాకు అంత సులభంగా సాగలేదు. మహిళల 60 కిలోల విభాగానికి జరిగిన ట్రయల్స్‌లో రోషిబినాను దివ్యాంశి చౌదరి ఓడించి భారత జట్టులో స్థానం సంపాదించింది (Asian Games 2026).
ఆ తర్వాత దివ్యాంశికి గాయం కావడంతో ఆమె స్థానంలో రోషిబినాను జట్టులోకి తీసుకున్నారు (Wushu India). వైద్య పరీక్షల్లో దివ్యాంశికి తీవ్ర స్థాయి ఏసీఎల్ గాయం ఉన్నట్లు తేలడంతో ఆమెను జట్టు నుంచి తప్పించి రోషిబినాను ఎంపిక చేశారు. ఇలా చివరి నిమిషంలో జట్టులోకి వచ్చిన రోషిబినా ప్రీ-క్వార్టర్ ఫైనల్లో బంగ్లాదేశ్‌కు చెందిన షికా ఖాతూన్‌ను, క్వార్టర్ ఫైనల్లో మకావుకు చెందిన చు మాన్ సిన్‌ను, సెమీఫైనల్లో ఇండోనేషియాకు చెందిన థానియాను ఓడించి ఫైనల్‌కు చేరుకుంది. ఫైనల్లో ఓటమి పాలై రజతంతో సరిపెట్టుకుంది.
ఇవి కూడా చదవండి..
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..
అమెరికాలో ల్యాండ్ అయిన జిన్‌పింగ్.. స్వయంగా స్వాగతం పలికిన ట్రంప్..