Share News

ఐసీసీ ట్రోఫీ గెలవాలంటే భారత్‌ను ఓడించాల్సిందే: వెస్టిండీస్ కోచ్

ABN , Publish Date - Sep 25 , 2026 | 08:34 PM

వెస్టిండీస్ కోచ్ డారెన్ సామీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐసీసీ టోర్నీలు గెలవాలంటే బలమైన భారత్‌ను ఓడించడం తప్పనిసరి అని అభిప్రాయపడ్డాడు.

ఐసీసీ ట్రోఫీ గెలవాలంటే భారత్‌ను ఓడించాల్సిందే: వెస్టిండీస్ కోచ్
Darren Sammy

ఇంటర్నెట్ డెస్క్: వెస్టిండీస్ జట్టు భారత పర్యటనకు వచ్చింది. ఇక్కడ మూడు వన్డేలు, 5 టీ20లు ఆడనుంది. ఆదివారం భారత్‌తో వన్డే సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో వెస్టిండీస్ కోచ్ డారెన్ సామీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐసీసీ టోర్నీలు గెలవాలంటే బలమైన భారత్‌ను ఓడించడం తప్పనిసరి అని అభిప్రాయపడ్డాడు. స్వదేశంలో టీమిండియాను ఎదుర్కోవడం తమ సత్తాను పరీక్షించుకునేందుకు గొప్ప అవకాశమని వెల్లడించాడు.


భారత్‌లో విండీస్ వన్డే సిరీస్ గెలిచి దాదాపు 24 ఏళ్లు గడిచాయని డారెన్ సామీ గుర్తు చేశాడు. ‘భారత్‌లో సిరీస్‌ గెలిచి 24 ఏళ్లు అవుతోంది. కాబట్టి ఈసారి సిరీస్‌ గెలిచేందుకు మాకు ఇది గొప్ప అవకాశం. వన్డేల్లో ప్రస్తుతం మనం ఎక్కడ ఉన్నామో తెలుసుకోవడానికి, మనల్ని మనం పరీక్షించుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. భారత జట్టుపై మంచి ప్రదర్శన చేసి సిరీస్‌ గెలవడానికి ప్రయత్నిస్తాం. 24 ఏళ్లుగా సాధించలేనిది ఇప్పుడు సాధించాలనుకుంటున్నాం’ అని డారెన్ సామీ చెప్పాడు.


భారత్‌ను ఓడించాల్సిందే..

2027 వన్డే ప్రపంచకప్‌లో నేరుగా అర్హత సాధించలేకపోయిన వెస్టిండీస్‌.. ప్రస్తుతం క్వాలిఫయర్స్‌కు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో భారత్‌తో సిరీస్‌ను ప్రపంచకప్‌ సన్నాహాల్లో కీలకంగా చూస్తోంది. ‘ఐసీసీ ఈవెంట్‌ను గెలవాలంటే, ముఖ్యంగా వైట్‌బాల్‌ క్రికెట్‌లో బలమైన భారత్‌ను ఓడించాల్సిందే. ఇప్పుడు వాళ్ల సొంత గడ్డపై, వాళ్ల పరిస్థితుల్లోనే ఆడుతున్నాం. ఇక్కడ బాగా ఆడి గెలిస్తే ప్రపంచ స్థాయిలో మనం ఎంత పోటీ ఇవ్వగలమో తెలుస్తుంది. ఫిబ్రవరిలో జరిగే క్వాలిఫయర్స్‌కు ముందు జట్టును మరింత మెరుగుపరచడమే మా ప్రధాన లక్ష్యం. దక్షిణాఫ్రికా వేదికగా జరిగే ప్రపంచకప్‌కు టికెట్‌ సాధించేలా జట్టును సిద్ధం చేయాలి.


‘ప్రస్తుతం మేం బరిలోకి దిగే జట్టులో నాణ్యమైన ప్లేయర్లే ఉన్నారు. ఒకరిద్దరి పైనే ఆధారపడే పరిస్థితుల్లో లేము. 19 ఏళ్ల కుర్రాడు విటెల్‌ మా జట్టుకు దొరికిన ఆణిముత్యం. అతడిలో ఉన్న ప్రతిభను గుర్తించే న్యూజిలాండ్‌తోనే అరంగేట్రం చేయించాం. వెస్టిండీస్‌ జట్టులో రిస్ట్‌ స్పిన్నర్‌ ఉండాలని నేను ఎన్నో ఏళ్లుగా చెబుతున్నాను. విటెల్‌ వచ్చిన వెంటనే బౌలింగ్‌ విభాగంపై ప్రభావం చూపించాడు. అయితే అతడు ఇంకా చాలా నేర్చుకోవాల్సి ఉంది. ప్రత్యేక శిక్షణ ఇచ్చి అతడి అభివృద్ధిని కొనసాగిస్తాం. నికితా మిల్లర్‌, రవి రాంపాల్‌తో కలిసి అతడు బాగా పనిచేస్తున్నాడు. అతడి పురోగతిపై మేం సంతోషంగా ఉన్నాం’ అని సామీ తెలిపాడు.


ఇవి కూడా చదవండి:

ఆసియా క్రీడలు: సత్తా చాటిన గుల్వీర్ సింగ్.. భారత్‌కు రజతం

ఆసియా గేమ్స్‌లో సాత్విక్-చిరాగ్ అనూహ్య ఓటమి.. తప్పెక్కడ జరిగిందంటే?

Updated Date - Sep 25 , 2026 | 08:34 PM