Share News

ఆసియా క్రీడలు: పోల్ వాల్ట్‌లో కాంస్యం.. చరిత్ర సృష్టించిన భరణిక

ABN , Publish Date - Sep 25 , 2026 | 07:30 PM

ఆసియా క్రీడల్లో మహిళల పోల్ వాల్ట్ ఈవెంట్‌లో భారత అథ్లెట్ భరణికా ఇలంగోవన్ చరిత్ర సృష్టించింది. 4.15 మీటర్ల ఎత్తును అధిగమించి కాంస్య పతకం సాధించింది.

ఆసియా క్రీడలు: పోల్ వాల్ట్‌లో కాంస్యం.. చరిత్ర సృష్టించిన భరణిక
Bharanika Elangovan, Manpreet Kaur

ఇంటర్నెట్ డెస్క్: ఆసియా క్రీడల్లో భారత అథ్లెటిక్స్‌కు మరో చారిత్రక పతకం దక్కింది. మహిళల పోల్ వాల్ట్ ఈవెంట్‌లో భరణికా ఇలంగోవన్ చరిత్ర సృష్టించింది. 4.15 మీటర్ల ఎత్తును అధిగమించి కాంస్య పతకం సాధించింది. ఆసియా క్రీడల్లో పోల్ వాల్ట్‌లో పతకం గెలిచిన తొలి భారత మహిళగా భరిణికా రికార్డు సృష్టించింది.


29ఏళ్ల భరిణికాతో పాటు కజకిస్థాన్‌కు చెందిన పోలినా ఇవనోవా కూడా 4.15 మీటర్ల ఎత్తును అధిగమించి కాంస్యం అందుకుంది. ఇద్దరూ 4.25 మీటర్ల ఎత్తును దాటడంతో విఫలమవడంతో సంయుక్తంగా మూడో స్థానం దక్కింది. ఆతిథ్య దేశం జపాన్‌కు చెందిన మిసాకి మోరోటా 4.55 మీటర్ల వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శనతో స్వర్ణ పతకం సాధించగా.. చైనాకు చెందిన చుంగే నియు 4.50 మీటర్లతో రజతం గెలుచుకుంది.


జాతీయ రికార్డులు బద్దలు..

2026 మార్చిలో భువనేశ్వర్‌లో జరిగిన జాతీయ ఇండోర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో 4.22 మీటర్ల ఎత్తును అధిగమించి భరిణికా జాతీయ రికార్డు నెలకొల్పింది. మేలో జరిగిన ఇండియన్ ఇండోర్ ఓపెన్ కంబైన్డ్ ఈవెంట్స్ అండ్ పోల్‌ వాల్ట్ పోటీల్లో 4.23 మీటర్లతో తన రికార్డును తానే మెరుగుపరుచుకుంది. మార్చిలో బెంగళూరులో జరిగిన ఇండియన్ ఓపెన్ జంప్స్ పోటీల్లో 4.10 మీటర్ల ఆసియా క్రీడల అర్హత మార్కును అధిగమించి స్వర్ణం సాధించింది. అనంతరం 65వ నేషనల్ ఇంటర్‌-స్టేట్ సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో 4.20 మీటర్లతో పోల్‌వాల్ట్ టైటిల్ దక్కించుకుంది.


మన్‌ప్రీత్ కౌర్‌కు కాంస్యం..

మహిళల షాట్‌పుట్ ఫైనల్‌లో భారత అథ్లెట్ మన్‌ప్రీత్ కౌర్ 17.17 మీట్లరు విసిరి కాంస్య పతకం నెగ్గింది. ఇటీవలే గ్లాస్గో వేదికగా జరిగిన కామన్‌వెల్త్ గేమ్స్‌లో ఆమె త్రుటిలో పతకం కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆ నిరాశ నుంచి తేరుకుని గట్టి కమ్‌బ్యాక్ ఇచ్చింది. అయితే మన్‌ప్రీత్‌కు ఆసియా క్రీడల్లో ఇదే తొలి పతకం కావడం విశేషం. చైనాకు చెందిన సాంగ్ జియా యువాన్ 19.40 మీటర్లతో స్వర్ణ పతకం సాధించగా.. మరో అథ్లెట్ జాంగ్ లిన్రు 18.14 మీటర్లతో రజతం దక్కించుకుంది.


ఇవి కూడా చదవండి:

ఆసియా క్రీడలు: సత్తా చాటిన గుల్వీర్ సింగ్.. భారత్‌కు రజతం

ఆసియా గేమ్స్‌లో సాత్విక్-చిరాగ్ అనూహ్య ఓటమి.. తప్పెక్కడ జరిగిందంటే?

Updated Date - Sep 25 , 2026 | 07:44 PM