Share News

ICC-BCB: ఐసీసీ అధికారికి వీసా నిరాకరించిన బంగ్లాదేశ్.!

ABN , Publish Date - Jan 17 , 2026 | 02:30 PM

భారత్-బంగ్లాదేశ్ దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ వివాదానికి ఐసీసీ తెరదించే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా ఇద్దరు ఐసీసీ అధికారులు ఢాకా వెళ్లాల్సి ఉంది. ఈ నేపథ్యంలో భారత్‌కు చెందిన ఓ అధికారికి బంగ్లాదేశ్ వీసా నిరాకరించింది.

ICC-BCB: ఐసీసీ అధికారికి వీసా నిరాకరించిన బంగ్లాదేశ్.!
ICC-BCB

ఇంటర్నెట్ డెస్క్: భారత్-బంగ్లాదేశ్‌ల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. బంగ్లా ఆటగాడు ముస్తాఫిజుర్ రెహమాన్‌ను ఐపీఎల్ నుంచి రిలీజ్ చేయడంతో వివాదం రాజుకుంది. ఈ పరిణామం తర్వాత టీ20 ప్రపంచ కప్‌లో పాల్గొనడానికి భారత్‌కు రాబోమని, శ్రీలంకకు మ్యాచ్ వేదికలు మార్చాలంటూ బంగ్లా క్రికెట్ బోర్డు ఐసీసీ మెయిల్ చేసింది. ఈ వివాదానికి ఐసీసీ తెరదించే ప్రయత్నం చేస్తోంది. అయితే.. ఇందులో భాగంగా ఇద్దరు ఐసీసీ అధికారులు ఢాకా వెళ్లాల్సి ఉంది. ఈ నేపథ్యంలో భారత్‌కు చెందిన ఓ అధికారికి బంగ్లాదేశ్ వీసా నిరాకరించింది. దీంతో ఐసీసీ హెడ్ ఆఫ్ యాంటీ కరప్షన్ అండ్ సెక్యూరిటీ అధికారి ఆండ్రూ ఎఫ్గ్రేవ్ ఒక్కరే శనివారం ఢాకాకు వెళ్లినట్టు తెలుస్తోంది.


వీసా నిరాకరణ విషయంపై ఐసీసీ(ICC) అధికారికంగా స్పందించలేదు. సమస్యా పరిష్కారానికి ఐసీసీ చొరవ చూపుతుంటే.. బంగ్లాదేశ్ ఇలా ప్రవర్తించడంతో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్.. కాస్త అసంతృప్తికి గురైనట్లు తెలుస్తోంది. టీ20 వరల్డ్ కప్ మరో మూడు వారాల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఐసీసీ బంగ్లాదేశ్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటికిప్పుడు వేదికల మార్పు దాదాపు అసాధ్యం కాబట్టి.. షెడ్యూల్ ప్రకారమే మ్యాచ్‌లు ఆడేందుకు బంగ్లాదేశ్‌ను ఒప్పించే ప్రయత్నం చేయనున్నట్లు సమాచారం. బీసీబీ(BCB) అధికారులతో నేరుగా సమావేశమైన తర్వాత.. ఐసీసీ తుది నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశముంది.


ఐసీసీ టీ20 ప్రపంచ కప్‌ 2026 ఫిబ్రవరి 7న ప్రారంభం కానుంది. షెడ్యూల్‌ ప్రకారం.. బంగ్లాదేశ్ గ్రూప్‌ స్టేజిలో తన మ్యాచ్‌లను కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా ఫిబ్రవరి 7న వెస్టిండీస్‌‌తో, 9న ఇటలీతో, 14న ఇంగ్లాండ్‌తో, 17న ముంబైలోని వాంఖడే స్టేడియంలో నేపాల్‌తో ఆడాల్సి ఉంది.


ఇవి కూడా చదవండి:

రిటైర్డ్ ఔట్, రిటైర్డ్ హర్ట్ తేడా ఏంటంటే?

బుమ్రా కుమారుడి సూపర్ బౌలింగ్.. వీడియో వైరల్

Updated Date - Jan 17 , 2026 | 03:53 PM