Retired Hurt vs Retired Out: రిటైర్డ్ ఔట్, రిటైర్డ్ హర్ట్ తేడా ఏంటంటే?
ABN , Publish Date - Jan 16 , 2026 | 12:21 PM
ప్రస్తుతం జరుగుతున్న మహిళల ప్రీమియర్ లీగ్(WPL) 2026 ఎడిషన్‌లో రెండు రోజుల వ్యవధిలో ఇద్దర్లు బ్యాటర్లు రిటైర్డ్ ఔట్‌గా వెనుదిరిగారు. గుజరాత్ జెయింట్స్ తరఫున అరంగేట్రం చేసిన ఆయుశ్ సోని, యూపీ వారియర్స్ ప్లేయర్ హర్లీన్ డియోల్ గంటల వ్యవధిలో రిటైర్డ్ ఔట్‌గా పెవిలియన్‌కు చేరారు. అసలు ఈ రిటైర్డ్ ఔట్ అంటే ఏమిటంటే..
క్రికెట్‌లో రిటైర్డ్ హర్ట్ అనే పదం ఎక్కువగా వినిపిస్తుంటుంది. చాలామందికి దీని గురించి బాగా తెలుసు. అయితే చాలా తక్కువ సందర్భాల్లో రిటైర్డ్ ఔట్ అనే పదం వినిపిస్తుంది. ప్రస్తుతం జరుగుతున్న మహిళల ఐపీఎల్ (WPL) 2026 ఎడిషన్‌లో రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు బ్యాటర్లు రిటైర్డ్ ఔట్‌గా వెనుదిరిగారు. గుజరాత్ జెయింట్స్ తరఫున అరంగేట్రం చేసిన ఆయుశ్ సోని, యూపీ వారియర్జ్ ప్లేయర్ హర్లీన్ డియోల్ గంటల వ్యవధిలో రిటైర్డ్ ఔట్‌గా పెవిలియన్‌కు చేరారు. ఈ నేపథ్యంలో చాలా మందిలో రిటైర్డ్ ఔట్, రిటైర్డ్ హర్ట్(Retired Hurt vs Retired Out) .. రెండు ఒకటేనా? వేర్వేరా? అనే సందేహం వ్యక్తమవుతోంది. మరీ.. ఈ రెండింటి మధ్య తేడా ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
రిటైర్డ్ హర్ట్:
సాధారణంగా ఎవరైనా ఆటగాడు గాయం లేదా అనారోగ్యానికి గురైతే రిటైర్డ్ హర్ట్ లేదా రిటైర్డ్ నాటౌట్‌గా పెవిలియన్‌కు చేరతారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యర్థి కెప్టెన్ అనుమతిస్తే, ఆ ఆటగాడు తిరిగి బ్యాటింగ్ కొనసాగించవచ్చు. అతడు కోలుకుంటే.. జట్టు అవసరాన్ని బట్టి మళ్లీ బ్యాటింగ్‌కి వచ్చి.. తిరిగి ఇన్నింగ్స్‌ను కంటిన్యూ చేయొచ్చు.
రిటైర్డ్ ఔట్:
రిటైర్డ్ ఔట్ అనేది రిటైర్డ్ హర్ట్‌కి పూర్తిగా భిన్నమైనది. ఒక్కసారి ఆటగాడు ఈ కారణంగా క్రీజ్ వదిలితే తిరిగి బ్యాటింగ్‌కు దిగటానికి వీలుండదు. ఇది వ్యూహాత్మక నిర్ణయం. పొట్టి ఫార్మాట్లో కీలక సమయాల్లో బ్యాటర్లు నిదానంగా ఆడుతున్నప్పుడు రిటైర్డ్ ఔట్ అస్త్రాన్ని ప్రయోగిస్తుంటారని క్రీడా నిపుణులు చెబుతుంటారు. రిటైర్డ్ ఔట్ ద్వారా బ్యాటర్ స్వచ్ఛందంగా క్రీజును వదిలి వెళ్లిపోతాడు. ఒక రకంగా చెప్పాలంటే.. తాను ఔట్ అని సదరు బ్యాటర్ ప్రకటించినట్లే.
ఎవరైనా బ్యాటర్ పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతుంటే ఈ ఆప్షన్ వినియోగించి అతన్ని తప్పించి మరొకరికి ఛాన్స్ ఇవ్వవచ్చు. మహిళల ఐపీఎల్(WPL 2026)లో రిటైర్డ్ ఔటైన తొలి ప్లేయర్‌గా ఆయుశ్ సోని నిలిచింది. అయితే ఐపీఎల్‌లో ఈ తరహాలో ఔటైన తొలి ఆటగాడిగా రవిచంద్రన్ అశ్విన్(Ashwin retired out IPL) రికార్డుల్లోకెక్కాడు.
చాలా మంది ప్లేయర్లు రిటైర్డ్ హర్ట్ అవుతుంటారు. కానీ అతి తక్కువ సందర్భాల్లో మాత్రమే రిటైర్డ్ ఔట్ అనేది జరుగుతుంది. అంతర్జాతీయ క్రికెట్‌లో సైతం రిటైర్డ్ ఔట్( Retired Out) ఘటనలు జరిగాయి. అంతర్జాతీయ క్రికెట్‌లోనూ పలువురు ఆటగాళ్లు ఈ తరహాలో ఔటయ్యారు. 2021లో శ్రీలంక ఆటగాళ్లు మర్వన్ ఆటపట్టు, మహేళ జయవర్ధనే రిటైర్డ్ ఔట్ అయ్యారు. వీరిద్దరూ టెస్ట్ ఫార్మాట్‌లో, అదీ ఒకే మ్యాచ్‌లో (బంగ్లాదేశ్‌పై) రిటైర్డ్ ఔట్ కావడం విశేషం. అంతర్జాతీయ టీ20ల్లో రిటైర్డ్ ఔటైన తొలి ప్లేయర్ గా టోబ్‌గే(భూటాన్) అయితే.. టీ20 ప్రపంచకప్‌లో ఈ తరహా ఔటైన తొలి ఆటగాడిగా నికోలాస్ డావిన్(నమీబియా) రికార్డుల్లోకెక్కాడు.
ఇవి కూడా చదవండి:
బుమ్రా కుమారుడి సూపర్ బౌలింగ్.. వీడియో వైరల్
దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లో సంచలనం.. మరో హ్యాట్రిక్ నమోదు