Share News

Otniel Baartman: దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లో సంచలనం.. మరో హ్యాట్రిక్ నమోదు

ABN , Publish Date - Jan 16 , 2026 | 10:44 AM

దక్షిణాప్రికా టీ20 లీగ్ సంచలనాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ లీగ్‌లో ఇప్పటికే లుంగి ఎంగిడి తొలి హ్యాట్రిక్ నమోదు చేయగా.. తాజాగా రెండో హ్యాట్రిక్ కూడా నమోదైంది. 2025-26 ఎడిషన్‌లో భాగంగా నిన్న (గురువారం) ప్రిటోరియా క్యాపిటల్స్‌, పార్ల్‌ రాయల్స్‌ మధ్య మ్యాచ్ జరిగింది.

Otniel Baartman: దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లో సంచలనం.. మరో హ్యాట్రిక్ నమోదు
Otniel Baartman

స్పోర్ట్స్ డెస్క్: సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో సంచలనాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే లుంగి ఎంగిడి తొలి హ్యాట్రిక్ నమోదు చేయగా.. తాజాగా రెండో హ్యాట్రిక్ కూడా నమోదైంది. 2025-26 ఎడిషన్‌లో భాగంగా నిన్న (గురువారం) ప్రిటోరియా క్యాపిటల్స్‌, పార్ల్‌ రాయల్స్‌ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో పార్ల్ రాయల్స్ బౌలర్‌ ఓట్నీల్‌ బార్ట్‌మన్‌(Otniel Baartman) హ్యాట్రిక్‌ వికెట్లు తీశాడు. బార్ట్‌మన్‌ హ్యాట్రిక్‌ సహా ఐదు వికెట్లు తీసి రాయల్స్‌ విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇదే ఎడిషన్‌లో కొన్ని రోజుల క్రితం ప్రిటోరియా క్యాపిటల్స్‌ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న స్టార్ బౌలర్ లుంగి ఎంగిడి తొలి హ్యాట్రిక్‌ నమోదు చేశాడు.


ప్రిటోరియా క్యాపిటల్స్‌, పార్ల్‌ రాయల్స్‌ మ్యాచ్(Paarl Royals vs Pretoria Capitals) విషయానికి వస్తే..తొలుత బ్యాటింగ్‌ చేసిన క్యాపిటల్స్‌.. బార్ట్‌మన్‌(5 వికెట్లు)ధాటికి 19.1 ఓవర్లలో 127 పరుగులకే కుప్పకూలింది. హర్డస్‌ విల్యోన్‌, సికందర్‌ రజా తలో రెండు వికెట్లు సాధించగా.. ఫోర్టుయిన్‌ ఒక వికెట్‌ తీశాడు. ప్రిటోరియా బ్యాటర్లు షాయ్‌ హోప్‌ (25), డెవాల్డ్‌ బ్రెవిస్‌ (21), షెర్ఫాన్‌ రూథర్‌ఫోర్డ్‌ (29), ఆండ్రీ రసెల్‌ (15) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు.


జోర్డన్‌ కాక్స్‌, లిజాడ్‌ విలియమ్స్‌, లుంగి ఎంగిడి ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరారు. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని రాయల్స్‌(Paarl Royals win) 15.1 ఓవర్లలో ఛేదించింది. రూబిన్‌ హెర్మన్‌ (46) తృటిలో అర్ధ సెంచరీ చేజార్చుకున్నాడు. డాన్‌ లారెన్స్‌ (41), డేవిడ్‌ మిల్లర్‌(28*) రాయల్స్ విజయంలో తమ వంతు పాత్ర పోషించారు. ప్రిటోరియా బౌలర్లలో లిజాడ్‌ విలియమ్స్‌ 2, ఎంగిడి, పీటర్స్‌ తలో వికెట్‌ తీశారు.


ఇవి కూడా చదవండి:

బుమ్రా కుమారుడి సూపర్ బౌలింగ్.. వీడియో వైరల్

కెనడా జట్టు కెప్టెన్‌గా భారత సంతతి వ్యక్తి

Updated Date - Jan 16 , 2026 | 11:08 AM