ఎంఐతో ట్రేడ్ డీల్.. పంజాబ్‌కు చిక్కులు తప్పవు: భారత మాజీ క్రికెటర్
ABN , Publish Date - Nov 09 , 2026 | 05:45 PM
ఐపీఎల్ 2027కి ముందు ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య ట్రేడ్ డీల్ దాదాపు ఖాయమైనట్లే. అయితే ఈ డీల్‌తో ఏ జట్టుకు ఎక్కువ ప్రయోజనం కలుగుతుందన్న చర్చ మొదలైంది. ఇదే విషయంపై భారత మాజీ క్రికెటర్ అభినవ్ ముకుంద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2027కి ముందు ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య ట్రేడ్ డీల్ దాదాపు ఖాయమైనట్లే. స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య పంజాబ్‌కు వస్తుండగా, అర్ష్‌దీప్ సింగ్ ముంబైలో చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ డీల్‌తో ఏ జట్టుకు ఎక్కువ ప్రయోజనం కలుగుతుందన్న చర్చ మొదలైంది. ఇదే విషయంపై భారత మాజీ క్రికెటర్ అభినవ్ ముకుంద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ ట్రేడ్ ముంబైకి అద్భుతంగా కలిసొస్తుందని, పంజాబ్‌కు మాత్రం కొన్ని ప్రశ్నలు ఎదురవుతాయని అభిప్రాయపడ్డాడు.
‘ఐపీఎల్ మెగా వేలం సమయంలో పంజాబ్ కింగ్స్ అర్ష్‌దీప్ సింగ్, శ్రేయస్ అయ్యర్, యుజ్వేంద్ర చాహల్ వంటి ముగ్గురు కీలక ఆటగాళ్లపై భారీగా పెట్టుబడి పెట్టింది. ఆ కోర్ టీమ్‌పై నమ్మకం లేకపోతే, మరింత బలమైన జట్టును నిర్మించాలనుకుంటే ఆల్‌రౌండర్ అవసరం అనే ప్రశ్న వస్తుంది. ముంబై ఇండియన్స్‌కు మాత్రం ఇది గొప్ప డీల్. కానీ పంజాబ్ కింగ్స్ విషయంలో కొన్ని సందేహాలున్నాయి. హార్దిక్ పంజాబ్‌కు వస్తే కేవలం ఆల్‌రౌండర్‌గానే ఆడతాడా? శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో అతడి పాత్ర ఎలా ఉంటుంది? జట్టులో ఆటగాళ్ల మధ్య సమీకరణాలు ఎలా మారతాయి? ఇవన్నీ ఆలోచించాల్సిన విషయాలు. మరోవైపు పంజాబ్ జట్టుకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా ఉన్నాడు. కెప్టెన్సీ విషయంలో శ్రేయస్‌తో ఇప్పటికే చర్చలు జరిగాయా? ఇలాంటి విషయాలన్నీ తెరవెనుక జరిగే చర్చలపై ఆధారపడి ఉంటాయి’ అని అభినవ్ పేర్కొన్నాడు.
సూర్యాంశ్‌పై ప్రభావం?
‘హార్దిక్ పంజాబ్ జట్టులోకి వస్తే యువ ఆల్‌రౌండర్ సూర్యాంశ్ షెడ్గే భవిష్యత్తుపైనా ప్రభావం పడే అవకాశం ఉంది. సూర్యాంశ్ ఈ పరిణామాన్ని ఎలా తీసుకుంటాడో తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంది. అతడు ప్రస్తుతం భారత్-ఎ తరఫున ఆల్‌రౌండర్‌గా ఆడుతున్నాడు. భవిష్యత్తులో నితీశ్ రెడ్డి, శివమ్ దూబే తర్వాత భారత జట్టులో అవకాశాలు అందుకునే ఆటగాళ్లలో ఒకడిగా అతడిని చూస్తున్నారు. అలాంటి సమయంలో హార్దిక్ జట్టులోకి వస్తే తనకు గతంలో లభించినన్ని అవకాశాలు వస్తాయా? అనే ఆలోచన అతడికి రావచ్చు’ అని అభివన్ విశ్లేషించాడు.
బుమ్రా-అర్ష్‌దీప్ జోడీతో ముంబైకి బలం!
ఈ ట్రేడ్ జరిగితే ముంబై ఇండియన్స్‌కు మాత్రం కొత్త బంతితో అద్భుతమైన పేస్ కాంబినేషన్ అందుబాటులోకి వస్తుంది. ఇప్పటికే జస్ప్రీత్ బుమ్రా రూపంలో ప్రపంచస్థాయి బౌలర్ ఉన్న ముంబైకి అర్ష్‌దీప్ తోడైతే పవర్‌ప్లేలో ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా హార్దిక్ పాండ్యపై పెట్టుకున్న ప్రయోగానికి ముగింపు పలికి జట్టును కొత్తగా నిర్మించుకునే అవకాశం ముంబైకి లభిస్తుంది. మొత్తానికి ఈ ట్రేడ్ అధికారికంగా ఖరారైతే ఐపీఎల్‌లో ముంబై, పంజాబ్ జట్ల బలాబలాలు గణనీయంగా మారనున్నాయి.
ఇవి కూడా చదవండి:
శాండ్‌పేపర్ వివాదం.. ఖవాజా చెప్పినవన్నీ వందశాతం నిజం: డేవిడ్ వార్నర్
కోహ్లీతో మాట్లాడాలంటే కోచ్‌లే భయపడతారు: ర్యాన్‌టెన్ డస్కటే