Share News

శాండ్‌పేపర్ వివాదం.. ఖవాజా చెప్పినవన్నీ వందశాతం నిజం: డేవిడ్ వార్నర్

ABN , Publish Date - Nov 09 , 2026 | 03:40 PM

2018లో క్రికెట్ ప్రపంచాన్ని కుదిపేసిన బాల్ ట్యాంపరింగ్(శాండ్‌పేపర్ గేట్) వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ వ్యవహారంపై ఇటీవలే ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఉస్మాన్ ఖవాజా చేసిన వ్యాఖ్యలకు మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ మద్దతిచ్చాడు.

శాండ్‌పేపర్ వివాదం.. ఖవాజా చెప్పినవన్నీ వందశాతం నిజం: డేవిడ్ వార్నర్
David Warner

ఇంటర్నెట్ డెస్క్: 2018లో క్రికెట్ ప్రపంచాన్ని కుదిపేసిన బాల్ ట్యాంపరింగ్(శాండ్‌పేపర్ గేట్) వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ వ్యవహారంపై ఇటీవలే ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఉస్మాన్ ఖవాజా చేసిన వ్యాఖ్యలకు మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ మద్దతిచ్చాడు. శాండ్‌పేపర్ వాడుతున్నట్లు కేవలం ముగ్గురికే(స్మిత్, వార్నర్, బాన్‌క్రాఫ్ట్) తెలుసన్న క్రికెట్ ఆస్ట్రేలియా వాదన అబద్ధమని, ఆ సిరీస్‌లోని ఆసీస్ జట్టు మొత్తానికి ఆ విషయం తెలుసని ఖవాజా తన ఆత్మకథ పుసక్తంలో ప్రస్తావించాడు. ఖవాజా చెప్పిన మాటలన్నీ వందశాతం నిజమని తాజాగా వార్నర్ వెల్లడించాడు. ఎనిమిదేళ్లుగా ఆ విషయాల గురించి మాట్లాడలేదని, ఎప్పటికైనా నిజాలు బయటకు రావాల్సిందేనని స్పష్టం చేశాడు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ వీడియోను విడుదల చేశాడు.


‘ఈ బాల్ ట్యాంపరింగ్ విషయం గురించి నేను మాట్లాడి ఎనిమిదేళ్లు అవుతోంది. ఉస్మాన్ ఖవాజాకు నా పూర్తి మద్దతు ఉంది. అతడు చెప్పిన ప్రతి విషయం 100 శాతం నిజం. అసలు నిజం ఎప్పటికైనా బయట పడుతుంది. ప్రజలు తెలుసుకోవాలనుకున్న విషయాలను ఖవాజా బయటపెట్టాడు. ఎనిమిదేళ్ల తర్వాత ఇప్పుడే ఎందుకు ఆ వివాదంపై మాట్లాడుతున్నాడని కొందరు ప్రశ్నిస్తున్నారు. తన పుస్తకం అమ్ముకోవడానికే ఖవాజా ఇదంతా చేస్తున్నాడని అంటున్నారు. కానీ ఇది ఉస్మాన్ కథ. అతడు నమ్మిన విషయాలను బయటపెట్టాడు’ అని వార్నర్ వెల్లడించాడు.


దర్యాప్తు తీరుపై వార్నర్ అసంతృప్తి..

2018 బాల్ ట్యాంపరింగ్ ఘటనపై జరిగిన విచారణ తీరును కూడా వార్నర్ తప్పుబట్టాడు. ‘అప్పట్లో జరిగిన విచారణ ప్రక్రియ చాలా హడావుడిగా, లోపభూయిష్టంగా సాగింది. కామెరాన్ బాన్‌క్రాఫ్ట్ పక్కనే ఉస్మాన్ ఖవాజా కూర్చున్నాడు. అయినా అతడిని విచారించలేదు. ఇది సమగ్ర దర్యాప్తు ఎలా అవుతుంది? మేము ఎవరిపైనా నిందలు వేయడానికి, పాత గాయాలను మళ్లీ రేపడానికి ప్రయత్నించడం లేదు. ఈ వ్యవహారంలో జవాబుదారీతనం, పారదర్శకత ఉండాలి. అసలు నిజాలు పూర్తిగా బయటకు రావాలి. ఎనిమిదేళ్లలో ఈ వ్యవహారంపై మీడియాలో ఎన్నో ప్రకటనలు వచ్చాయి. ఇటీవల నా కూతుళ్లతో ఈ విషయం గురించి మాట్లాడాల్సి వచ్చింది. ముఖ్యంగా నా 12 ఏళ్ల కూతురు ఐవీ ఎన్నో ప్రశ్నలు అడిగింది. అప్పట్లో మమ్మల్ని ఎందుకు అలా పట్టుకున్నారు? మేమెందుకు ఏడ్చాం? అని అడిగింది. వాటన్నింటికీ నిజాయతీగా సమాధానం చెప్పడం చాలా కష్టంగా అనిపించింది. ఆ సమయంలో మా కుటుంబాలు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాయి’ అని వార్నర్ భావోద్వేగానికి గురయ్యాడు.


ఇవీ చదవండి:

కోహ్లీ ఔటై గిల్‌ను కాపాడాడు.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన గావస్కర్!

ఇజ్రాయెల్‌లో నెతన్యాహుకు షాక్.. ఐసెన్‌కాట్‌కు ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం

Updated Date - Nov 09 , 2026 | 04:09 PM