Share News

కోహ్లీ ఔటై గిల్‌ను కాపాడాడు.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన గావస్కర్!

ABN , Publish Date - Nov 09 , 2026 | 12:51 PM

న్యూజిలాండ్ తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ 74 పరుగుల వద్ద ఔటైన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా టీమిండియా దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

కోహ్లీ ఔటై గిల్‌ను కాపాడాడు.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన గావస్కర్!
Virat Kohli

స్పోర్ట్స్ డెస్క్‌: భారత్, న్యూజిలాండ్ మధ్య ఐదు మ్యాచ్‍ల వన్డే సిరీస్ జరుగుతోంది. ఇప్పటికే తొలి రెండు మ్యాచుల్లో గెలిచిన భారత్ 2-0 తేడాతో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తొలి వన్డేలో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ (74) అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ సెంచరీ చేస్తాడని అంతా భావించారు. కానీ, 74 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద విరాట్ పెవిలియన్ చేరాడు. తాజాగా కోహ్లీ ఇన్నింగ్స్‌పై క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ విరాట్ సెంచరీకి చేరువగా ఉండుంటే టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్‌ గిల్ అయోమయ పరిస్థితికి గురయ్యేవాడని తెలిపారు. కోహ్లీ ఔట్ కావడంతో ఆ ప్రమాదం తప్పిందని గావస్కర్ (Sunil Gavaskar)పేర్కొన్నారు.


'విరాట్ 100 సెంచరీల మార్క్‌ను చేరుకోకూడదని ఏ ఒక్క భారత అభిమానీ కోరుకోడు. అతడు రికార్డు సాధిస్తే చూడాలని అందరం భావిస్తాం. పలు సందర్భాల్లో జట్టులోని సహచరులు పరుగులు చేయకుండా త్యాగం చేస్తుంటారు. సహచర బ్యాటర్ల సాయంతో కోహ్లీ (Virat Kohli) సెంచరీ చేస్తే.. ఆ ఘనత అతడిది మాత్రమే కాదు.. భారత క్రికెట్ అభిమానులకూ దక్కుతుంది’ అని గావస్కర్ వెల్లడించారు.


'విరాట్ కోహ్లీ 80లోపే ఔటయ్యాడు. ఒకవేళ అతడు 90ల్లో ఉన్నప్పుడు.. తాము పరుగులను చేయాలా? వద్దా? అనే అయోమయ పరిస్థితిని గిల్ లేదా శ్రేయస్‌కు ఎదుర్కోవాల్సి వచ్చేది. ఒకవేళ వారిద్దరిలో ఎవరో ఒకరు వేగంగా ఆడితే అభిమానుల నుంచి సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదురయ్యేవి. కోహ్లీ సెంచరీని అడ్డుకున్నారంటూ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేసేవారు. ఈ క్రమంలోనే కోహ్లీ ఔటై.. వారిద్దరి సందిగ్ధతతో పాటు ఫ్యాన్స్‌ రియాక్షన్‌ను తప్పించాడు. ఒక స్టార్ ఆటగాడు జట్టు విజయావకాశాలను ప్రభావితం చేయకుండా వ్యక్తిగత మైలురాయిని చేరుకోవడం అతడితో పాటు జట్టుకు కూడా మంచిదే’ అని గావస్కర్ అభిప్రాయపడ్డారు.


మొదటి వన్డేలో తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్ 40.2 ఓవర్లలో 183 పరుగులకు ఆలౌటైంది. వర్షం కారణంగా భారత్‌కు 34 ఓవర్లలో 143 పరుగులను లక్ష్యాన్ని అంపైర్లు నిర్దేశించారు. టీమిండియా 22.4 ఓవర్లలోనే 5 వికెట్లను కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. విరాట్ కోహ్లీ (51 బంతులు, 74 పరుగులు)తోపాటు కెప్టెన్ గిల్ (37), శ్రేయస్‌ అయ్యర్ (15) రాణించారు.


ఇవీ చదవండి:

'2029లో బీజేపీ ఓటమి ఖాయం'.. అభిజీత్‌ దీప్కే జోస్యం

ఇజ్రాయెల్‌లో నెతన్యాహుకు షాక్.. ఐసెన్‌కాట్‌కు ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం

‘పనులను అడ్డుకుంటే ఊరుకోం’.. కరీంనగర్ డంప్ యార్డ్ సమస్యపై బండి సంజయ్ వార్నింగ్

Updated Date - Nov 09 , 2026 | 01:37 PM