కోహ్లీతో మాట్లాడాలంటే కోచ్‌లే భయపడతారు: ర్యాన్‌టెన్ డస్కటే
ABN , Publish Date - Nov 09 , 2026 | 02:48 PM
భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై మాజీ అసిస్టెంట్ కోచ్ ర్యాన్టోన్ డస్కటే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీకి సలహాలు ఇవ్వాలంటే కోచ్‌లే ఇబ్బందిపడేవారని తెలిపాడు.
ఇంటర్నెట్ డెస్క్: భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై మాజీ అసిస్టెంట్ కోచ్ ర్యాన్టోన్ డస్కటే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఒకానొక దశలో కోహ్లీ ఫామ్‌లేమితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఒకే తరహాలో పదే పదే ఔటై పెవిలియన్ చేరేవాడు. కోచింగ్ సిబ్బంది ఏం చేస్తున్నారనే విమర్శలు కూడా వచ్చాయి. ఇదే విషయంపై ర్యాన్ టెన్ స్పందించాడు. కోహ్లీకి సలహాలు ఇవ్వాలంటే కోచ్‌లే ఇబ్బందిపడేవారని తెలిపాడు. స్టార్డమ్ కలిగిన ఆటగాడితో ఎలాంటి ఘర్షణలకు తావులేకుండా తాను చర్చించిన విషయాన్ని డస్కటే వెల్లడించాడు.
‘ఎవరైనా ఒక స్టార్ ప్లేయర్ పరుగులు చేసేందుకు ఇబ్బంది పడుతుంటే జోక్యం చేసుకునేందుకు చాలా మంది కోచ్‌లు భయపడతారనేది నా అభిప్రాయం. అనవసరంగా తన విషయంలో జోక్యం చేసుకుంటున్నారని ఆటగాడు భావిస్తాడేమోనని ఆందోళన చెందుతారు. అయితే ఆటగాడికి ఉపయోగపడే సూచన ఇవ్వాలా? లేక అతడిని మరింత గందరగోళానికి గురిచేయాలా? అనే విషయంలో సమతుల్యత అవసరం. గతంలో ఆస్ట్రేలియాలో కోహ్లీ ఒకే తరహాలో ఔటవుతుండటం నేను గమనించాను. నాలుగో టెస్టు సమయంలో అతడితో ఈ విషయం మాట్లాడాలని అనుకున్నా. అయితే ఎలా చెప్పాలి? ఎప్పుడు చెప్పాలి? అన్నదానిపై చాలా ఆలోచించాను. చివరకు వర్షం కారణంగా ఆటకు విరామం వచ్చిన సమయంలో అతడితో మాట్లాడాను. కోహ్లీ చాలా అద్భుతంగా స్పందించాడు. తన షాట్ ఎంపిక వెనుక ఉన్న కారణాలను వివరించాడు. తాను ఎందుకు ఆ విధంగా డ్రైవ్ చేయాలనుకుంటున్నాడో చెప్పాడు. అతడి అభిప్రాయాన్ని అర్థం చేసుకున్న తర్వాత దానికి అనుగుణంగా కొన్ని మార్పుల గురించి చర్చించగలిగాం. ఆ సమయంలో తనతో మాట్లాడటానికి ఎవరో ఒకరు ఉండాలని అతడు నిజంగా కోరుకున్నాడు.
కోహ్లీ లాంటి ఆటగాడి దగ్గరకు వెళ్లి అతడి లోపాలను ప్రస్తావించడం కోచ్‌కు కాస్త ఇబ్బందే. ఎందుకంటే అనవసరమైన సమయంలో సాంకేతిక అంశాలను ప్రస్తావిస్తే ఆటగాడి ఆత్మవిశ్వాసం దెబ్బతినొచ్చు. ముఖ్యంగా తర్వాత మిచెల్ స్టార్క్ లాంటి బౌలర్‌ను ఎదుర్కోవాల్సి ఉన్నప్పుడు బ్యాటర్ మనసులో కొత్త సందేహాలు సృష్టించకూడదు. అందుకే సరైన సమయం, సరైన మాటలు చాలా ముఖ్యం. కోహ్లీకి ఎక్కువగా కోచింగ్ అవసరం లేదు. అయినప్పటికీ ఒకే తరహాలో ఔటవుతుండటంతో ఆ విషయాన్ని అతడి దృష్టికి తీసుకెళ్లాలనుకున్నా. అదృష్టవశాత్తూ అతడితో నాకు మంచి సంబంధం ఉంది. నా మాటను కూడా సానుకూలంగా తీసుకున్నాడు’ అని డస్కటే చెప్పుకొచ్చాడు.
ఇవీ చదవండి:
కోహ్లీ ఔటై గిల్‌ను కాపాడాడు.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన గావస్కర్!
ఇజ్రాయెల్‌లో నెతన్యాహుకు షాక్.. ఐసెన్కాట్కు ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం