Share News

హార్దిక్-అర్ష్‌దీప్ ట్రేడ్.. ఎంఐ మరింత బలంగా మారింది: ఇర్ఫాన్ పఠాన్

ABN , Publish Date - Nov 11 , 2026 | 03:34 PM

ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన ట్రేడ్ డీల్ క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

హార్దిక్-అర్ష్‌దీప్ ట్రేడ్.. ఎంఐ మరింత బలంగా మారింది: ఇర్ఫాన్ పఠాన్
Irfan Pathan

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందే జట్లలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ముంబై ఇండియన్స్ (MI), పంజాబ్ కింగ్స్ (PBKS) మధ్య జరిగిన ట్రేడ్ క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య పంజాబ్ కింగ్స్‌కు వెళ్లగా.. యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ముంబై ఇండియన్స్ జట్టులో చేరాడు. ఈ ట్రేడ్‌పై భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అర్ష్‌దీప్ రాకతో ముంబై జట్టు మరింత బలంగా మారిందని అభిప్రాయపడ్డాడు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టాడు.


‘అర్ష్‌దీప్ సింగ్-హార్దిక్ పాండ్య ట్రేడ్‌లో ఎక్కువ లాభపడేది ముంబై ఇండియన్స్ జట్టే. ఈ ట్రేడ్ ఎంఐను మరింత బలమైన జట్టుగా మార్చింది. దీని ద్వారా జస్ప్రీత్ బుమ్రాను మరింత సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు. విదేశీ ఆటగాళ్ల ఎంపిక విషయంలోనూ ఇది సానుకూల ప్రభావం చూపుతుంది. ఈ ట్రేడ్ వల్ల ముంబై బౌలింగ్ విభాగం మరింత పటిష్టంగా మారింది. మరోవైపు హార్దిక్ రాకతో పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ లైనప్ బలపడింది. ఇప్పటికే ఆ జట్టులో పవర్ హిట్టర్లు ఉన్నారు. హార్దిక్ ట్రేడ్‌తో మిడిల్, లోయర్ ఆర్డర్ కూడా హిట్టర్లతో నిండిపోతుంది. కానీ అర్ష్‌దీప్ సింగ్‌ను వదులుకోవడం సరైన నిర్ణయం కాదని నా అభిప్రాయం. అర్ష్‌దీప్‌కు ప్రత్యామ్నాయాన్ని వెతుక్కోవడంతో పాటు ఒక స్పిన్నర్‌ను కూడా పంజాబ్ తమ జట్టులోకి తీసుకురావాల్సి ఉంటుంది’ అని ఇర్ఫాన్ పేర్కొన్నాడు.


అర్ష్‌దీప్ రాకతో ముంబై బౌలింగ్ విభాగం బలంగా కనిపిస్తోంది. ఇప్పటికే జట్టులో జస్ప్రీత్ బుమ్రా, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్ వంటి అనుభవజ్ఞులైన బౌలర్లు ఉన్నారు. వీరికి అర్ష్‌దీప్ తోడవడంతో పవర్‌ప్లేలో ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేసే అవకాశాలు పెరిగాయి. మరోవైపు యువ ఎడమచేతి వాటం పేసర్ అశ్వనీ కుమార్ కూడా మంచి ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. పది మ్యాచ్‌ల్లో 17 వికెట్లు పడగొట్టి తన సత్తా చాటాడు. ఇందులో రెండు సార్లు నాలుగు వికెట్ల ప్రదర్శన కూడా ఉంది. ముఖ్యంగా డెత్ ఓవర్లలో బుమ్రా, అర్ష్‌దీప్ ఇద్దరూ కీలక పాత్ర పోషించగలరు. దీంతో టీ20 మ్యాచ్‌లో అత్యంత కీలకమైన పవర్‌ప్లే, చివరి ఓవర్లలో ముంబైకి బౌలింగ్ పరంగా మంచి ప్రత్యామ్నాయాలు అందుబాటులోకి వచ్చాయి.


ఇవి కూడా చదవండి:

టీమిండియా మాజీ వికెట్ కీపర్ కేఎస్ భరత్ సంచలన నిర్ణయం!

ఐపీఎల్ 2027లో భారీ ట్రేడ్ డీల్.. ముంబైకి అర్ష్‌దీప్, పంజాబ్‌కు పాండ్యా!

Updated Date - Nov 11 , 2026 | 03:34 PM