Share News

టీమిండియా మాజీ వికెట్ కీపర్ కేఎస్ భరత్ సంచలన నిర్ణయం!

ABN , Publish Date - Nov 11 , 2026 | 01:14 PM

టీమిండియా మాజీ వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ కేఎస్‌ భరత్‌ అంతర్జాతీయ క్రికెట్‌లోకి మళ్లీ అడుగుపెట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈసారి యూఏఈ జట్టు ద్వారా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తున్నట్లు సమాచారం.

టీమిండియా మాజీ వికెట్ కీపర్ కేఎస్ భరత్ సంచలన నిర్ణయం!
KS Bharat

స్పోర్ట్స్ డెస్క్: చాలా మంది అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత... అకస్మాత్తుగా తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారు. మరికొందరు మాత్రం ఒకదేశం తరఫున రిటైర్మెంట్ పలికి.. కొంతకాలం తర్వాత మరో దేశం తరఫున రీఎంట్రీ ఇస్తుంటారు. అలాంటి వారి జాబితాలో చేరేందుకు సిద్ధమయ్యాడు టీమిండియా మాజీ వికెట్ కీపర్, బ్యాటర్ కేఎస్ భరత్. 33 ఏళ్ల ఈ మాజీ ప్లేయర్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి మళ్లీ అడుగుపెట్టాలని భావిస్తున్నాడని సమాచారం. ఈసారి టీమిండియా తరఫున కాకుండా యూఏఈ జట్టు ద్వారా కమ్‌బ్యాక్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.


2023 నుంచి 2024 మధ్య భారత్ తరఫున ఏడు టెస్టులు ఆడిన కేఎస్ భరత్.. 20.09 సగటుతో 221 పరుగులు సాధించాడు. అతడి అత్యధిక స్కోరు 44గా ఉంది. ఈ ఏడాది జూన్‌లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఈ క్రమంలోనే వచ్చే ఏడాది ఫిబ్రవరిలో తిరిగి ఇంటర్నేషనల్ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. యూఏఈ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించడమే తన తదుపరి లక్ష్యమని భరత్ వెల్లడించినట్లు పలు కథనాలు పేర్కొన్నాయి.


సదరు కథనాల ప్రకారం.. 'భారత దేశం తరఫున టెస్ట్ క్రికెట్ ఆడటం అనేది గొప్ప అదృష్టం. దానికి మించినది ఏదీ ఉండదు. అయితే ఒక క్రికెటర్‌గా ఎప్పుడూ ఆటలో కొనసాగాలని, మంచి ప్రదర్శన చేయాలని కోరుకుంటాను. గత కొన్నేళ్లుగా దేశవాళీ టోర్నీల్లో నేను నిలకడగా రాణిస్తున్నాను. నాలో అంతర్జాతీయ స్థాయిలో ఆడే సత్తా ఉందని భావించాను. అందుకే రిటైర్మెంట్ అనే కఠిన నిర్ణయం తీసుకున్నాను' అని కేఎస్ పేర్కొన్నాడు.


ప్రస్తుతం దుబాయ్‌లో నివసిస్తున్న భరత్.. యూఏఈ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లోకి తిరిగి రావాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాడు. అయితే ఇందుకోసం అవసరమైన కూలింగ్ ఆఫ్ పీరియడ్(విరామ సమయం) పూర్తికావాల్సి ఉంది. ప్రస్తుతం తన విరామ సమయం పూర్తి చేయాల్సి ఉందని, ఫిబ్రవరిలో అది ముగుస్తుందని భరత్ తెలిపాడు. ఆ పిరియడ్ ముగిసిన తర్వాత తన భవిష్యత్ ప్రణాళికల గురించి మరింత స్పష్టంగా చెప్పగలనని పేర్కొన్నాడు. ప్రస్తుతం అతడు అబుదాబి టీ10 లీగ్‌లో ఎమిరేట్స్ ఈగిల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.


ఇవి కూడా చదవండి..

ఐపీఎల్ 2027లో భారీ ట్రేడ్ డీల్.. ముంబైకి అర్ష్‌దీప్, పంజాబ్‌కు పాండ్యా!

యుద్ధానికి ముగింపు పలకాలంటే.. అమెరికాకు ఇరాన్ ఏం చెప్పిందంటే..

స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే...

Updated Date - Nov 11 , 2026 | 01:51 PM