యుద్ధానికి ముగింపు పలకాలంటే.. అమెరికాకు ఇరాన్ ఏం చెప్పిందంటే..
ABN , Publish Date - Nov 11 , 2026 | 07:29 AM
అమెరికాతో గత ఎనిమిది నెలలుగా కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలికేందుకు ఇరాన్ మరోసారి దౌత్యపరమైన ప్రయత్నాలకు సిద్ధమైంది. అయితే, ఇందుకోసం అమెరికా తమ షరతులను అంగీకరించాలని స్పష్టం చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికాతో గత ఎనిమిది నెలలుగా కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలికేందుకు ఇరాన్ మరోసారి దౌత్యపరమైన ప్రయత్నాలకు సిద్ధమైంది. అయితే, ఇందుకోసం అమెరికా తమ షరతులను అంగీకరించాలని స్పష్టం చేసింది. సైనిక చర్యలతోనో, ఆంక్షలను మరింత కఠినతరం చేయడం ద్వారానో సమస్య పరిష్కారం కాదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ తేల్చిచెప్పారు. పరస్పర గౌరవంతో చర్చలు జరిపి, తమ డిమాండ్లను పరిష్కరించినప్పుడే యుద్ధానికి ముగింపు సాధ్యమని వెల్లడించారు (Iran Peace Deal).
హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరిచేందుకు ఇరాన్ రెండు రోజుల గడువుతో ఒక ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. అయితే, అందుకు అమెరికా తమ షరతులను అంగీకరించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అన్ని రంగాల్లో యుద్ధాన్ని పూర్తిగా నిలిపివేయాలని, విదేశాల్లో నిలిపివేసిన ఇరాన్ ఆస్తులను విడుదల చేయాలని, ఇరాన్‌పై విధించిన చమురు ఆంక్షలను ఎత్తివేయాలని, ఇరాన్ నౌకాశ్రయాలపై అమెరికా విధించిన సముద్ర దిగ్బంధనాన్ని ముగించాలని కోరింది. ఈ షరతులకు అమెరికా అంగీకరిస్తే రెండు రోజుల్లో హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరిచేందుకు ఇరాన్ సిద్ధంగా ఉందని ప్రకటించింది (Iran Sanctions).
ఇరాన్‌తో యుద్ధం దాదాపు ముగిసినట్టేనని, యుద్ధానికి ముగింపు పలికే దిశగా సానుకూల పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు (Donald Trump about war). యుద్ధం మళ్లీ తీవ్రరూపం దాల్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని సంకేతాలిచ్చారు. అయితే సైనిక మార్గాల ద్వారా లేదా ఆంక్షలను తీవ్రతరం చేయడం ద్వారా ఇరాన్‌తో ఉన్న వివాదాన్ని పరిష్కరించలేరని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ అన్నారు. తమ డిమాండ్లు, షరతులు ఇప్పటికే అమెరికా ముందుంచామని, అవి ఇప్పటికీ చర్చల కోసం అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
ఈ వార్తలనూ చదవండి:
విశాఖ ఎయిర్‌పోర్టులో ఇమ్మిగ్రేషన్ సేవల రద్దు
30 ఏళ్లు దాటినా రాజీవ్ గాంధీ భౌతికకాయం ఫొటో చూడని సోనియా!