Share News

భయమా.. అది నా డిక్షనరీలోనే లేదు: గంభీర్

ABN , Publish Date - Nov 02 , 2026 | 07:17 AM

న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు టీ20ల సిరీస్‌ను భారత్ కైవసం చేసుకోవడంపై ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ స్పందించాడు. చివరి రెండు మ్యాచ్‌లు ఓడిపోయినప్పటికీ.. టీమిండియా ప్రదర్శన సంతృప్తినిచ్చిందని వెల్లడించాడు.

భయమా.. అది నా డిక్షనరీలోనే లేదు: గంభీర్
Gautam Gambhir

ఇంటర్నెట్ డెస్క్: న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు టీ20ల సిరీస్‌ను భారత్ కైవసం చేసుకోవడంపై ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ స్పందించాడు. చివరి రెండు మ్యాచ్‌లు ఓడిపోయినప్పటికీ.. టీమిండియా ప్రదర్శన సంతృప్తినిచ్చిందని వెల్లడించాడు. న్యూజిలాండ్ గడ్డపై సిరీస్ సాధించడంలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కీలక పాత్ర పోషించాడని ప్రశంసించాడు. బౌలింగ్‌ విభాగంలో అనుభవజ్ఞులైన ప్లేయర్లు లేకపోయినా జట్టును అద్భుతంగా నడిపించాడని కొనియాడాడు.


‘శ్రేయస్ బాధ్యతలు చేపట్టినప్పుడు అతడికి ఎంతో విజయవంతమైన జట్టు అందింది. టీ20 ప్రపంచకప్ గెలిచిన జట్టుతో పాటు రెండేళ్లుగా టీ20 సిరీస్ ఓడిపోని టీమ్ అతడి చేతుల్లోకి వచ్చింది. ప్రపంచకప్ తర్వాత మాకు ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. ముఖ్యంగా ఇంగ్లండ్, న్యూజిలాండ్ వంటి దేశాల్లో పర్యటించినప్పుడు అనుభవం లేని ఆటగాళ్లతో ఆడటం అంత సులభం కాదు. ఆటగాళ్లందరూ గొప్పగా కృషి చేశారు. ప్రాక్టీస్‌కు ఒక్క రోజే సమయం దొరికింది. అందులోనూ కివీస్ తమ సొంతగడ్డపై ఎప్పుడూ ప్రమాదకారే. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో సిరీస్ గెలవడం ఆషామాషీ కాదు. ఒక కెప్టెన్ ప్రదర్శన అతడి బౌలర్లు, బ్యాటర్ల ఆటతీరుపై ఆధారపడి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో శ్రేయస్ అద్భుతంగా రాణించాడు’ అని గంభీర్ వివరించాడు.


అది నా డిక్షనరీలోనే లేదు..

కోచ్‌గా ఈ ప్రయాణంలో సవాళ్లును ఎదుర్కున్నారా? అనే ప్రశ్నకు గంభీర్ స్పందించాడు. ‘నేను ఏ విషయంలోనూ భయపడలేదు. భయం అనేది నా డిక్షనరీలోనే లేదు. మేమంతా ప్రొఫెషనల్స్, శాయశక్తులా ప్రయత్నించడం, దేశానికి విజయాలు అందించడమే మా పని. ఆకర్షణీయమైన నిర్ణయాల కంటే జట్టుకు అవసరమయ్యే వాటికే ప్రాధాన్యమిస్తా. ఆటగాళ్లలో అభద్రతాభావం రాకూడదంటే వారికి మరిన్ని అవకాశాలివ్వాలి. నేను అది మాత్రమే అనుసరిస్తున్నా. రెండున్నరేళ్లుగా మేము ఒకే తరహా క్రికెట్ ఆడుతున్నాం. హైరిస్క్.. హైరివార్డ్ అనేదే మా విధానం. ఈ క్రమంలో కొన్నిసార్లు మ్యాచ్‌లు ఓడిపోవచ్చు. భవిష్యత్తులోనూ భారీ తేడాతో ఓటములు ఎదురుకావచ్చు. కానీ మా ఆలోచనా విధానం, ఆటతీరు మాత్రం మారవు. గత రెండేళ్లలో మాకు విజయాలు అందించింది ఈ విధానమే’ అని గంభీర్ స్పష్టం చేశాడు.


ఇవి కూడా చదవండి:

రాప్తాడు బాలికను పరామర్శించిన మంత్రి నారా లోకేశ్

ఇరాన్‌‌లో మా టార్గెట్ ఇంకా పూర్తి కాలేదు: ట్రంప్

Updated Date - Nov 02 , 2026 | 07:18 AM