ఇరాన్‌లో మా టార్గెట్ ఇంకా పూర్తి కాలేదు: ట్రంప్
ABN , Publish Date - Nov 01 , 2026 | 10:39 AM
ఇరాన్‌లో తమ లక్ష్యం ఇంకా పూర్తికాలేదని, అక్కడ ఇంకా రెండు టార్గెట్లు ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. తాము అనుకుంటే పది నిమిషాల్లో ఆ పనిని ముగించి వేయగలమని ఆయన పేర్కొన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్‌లో తమ లక్ష్యం ఇంకా పూర్తికాలేదని, అక్కడ ఇంకా రెండు టార్గెట్లు ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. తాము అనుకుంటే పది నిమిషాల్లో ఆ పనిని ముగించి వేయగలమని ఆయన పేర్కొన్నారు. తమపై దాడి చేస్తే, తాము కూడా తీవ్రంగా ప్రతిదాడి చేస్తామని ట్రంప్‌ను ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ హెచ్చరించిన నేపథ్యంలో ట్రంప్ తాజాగా స్పందించారు. శనివారం ఫ్లోరిడాలోని తన నివాసంలో మీడియాతో ఆయన మాట్లాడారు. ‘ఇరాన్‌లోని ఇస్ఫహాన్ ప్రావిన్స్‌లో ఉన్న పిక్‌యాక్స్ పర్వతాన్ని మీరు చూసి ఉంటారు. ఆ పర్వతం గురించి ఇరాన్ పట్టించుకుంటే మంచిది. మేమనుకుంటే క్షణాల్లో ఆ పర్వతాన్ని నాశనం చేయగలం’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈవారం ఇరాన్‌పై మళ్లీ దాడులు ప్రారంభించే అవకాశం ఉందా అని మీడియా ప్రతినిధులు అడగగా.. అలాంటి మూర్ఖపు ప్రశ్న ఎందుకు అడుగుతారని ఆయన అసహనం వ్యక్తం చేశారు. కాగా.. శాంతిఒప్పందంపై ఇరాన్‌తో సంప్రదింపులు సజావుగా సాగుతున్నాయని ఆయన తెలిపారు. అయితే, ఇరాన్‌ను నమ్మలేమని పేర్కొన్నారు.
మధ్యంతర ఎన్నికల తర్వాత మళ్లీ దాడులు?
అమెరికాలో ఈనెలలో మధ్యంతర ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికలు ముగిసిన తర్వాత ఇరాన్‌పై మళ్లీ దాడులకు ట్రంప్ ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంది. ఇటీవలే ఆయన అలా వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇరాన్‌పై మరోసారి భీకర దాడి చేస్తాం అని గత వారం ట్రంప్ చెప్పారు. ఈనెల 3న అమెరికా మధ్యంతర ఎన్నికల తర్వాత ఇరాన్‌పై దాడులకు సిద్ధంగా ఉండాలని గల్ఫ్ అరబ్ దేశాలకు అమెరికా స్పష్టం చేసిందని, ఈ విషయాన్ని అధికార వర్గాలు తెలిపాయని ద వాల్ స్ట్రీట్ జర్నల్ గత నెల 28న వెల్లడించింది. తాము కోరుకుంటే ఇరాన్‌పై దాడి చేయగలమని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో కూడా వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి:
భారత క్రికెట్ భవిష్యత్తుకు వైభవ్ మంచి పెట్టుబడి: సనత్ జయసూర్య
పాక్ విజయంపై పోస్ట్.. ఇంత బిల్డప్ అవసరమా అంటూ ప్రధాని షరీఫ్‌పై ట్రోల్స్!