Share News

రాప్తాడు బాలికను పరామర్శించిన మంత్రి నారా లోకేశ్

ABN , Publish Date - Nov 01 , 2026 | 05:25 PM

అనంతపురం జిల్లా రాప్తాడు జెడ్పీ పాఠశాలలో ఉన్మాది దాడిలో తీవ్రంగా గాయపడిన బాలికను ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ పరామర్శించారు. బెంగళూరులోని ఓల్డ్ ఎయిర్‌పోర్ట్ రోడ్డులో ఉన్న మణిపాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థిని ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.

రాప్తాడు బాలికను పరామర్శించిన మంత్రి నారా లోకేశ్
Minister Nara Lokesh

బెంగళూరు: అనంతపురం జిల్లా రాప్తాడు జెడ్పీ పాఠశాలలో ఉన్మాది దాడిలో తీవ్రంగా గాయపడిన బాలికను ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ పరామర్శించారు. బెంగళూరులోని ఓల్డ్ ఎయిర్‌పోర్ట్ రోడ్డులో ఉన్న మణిపాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థిని ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఈరోజు (ఆదివారం) మధ్యాహ్నం ఆస్పత్రికి చేరుకున్న మంత్రి.. బాధిత బాలిక ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆమెకు అందుతున్న వైద్య సేవలపై డాక్టర్లతో సుదీర్ఘంగా చర్చించారు.


ఈ సందర్భంగా బాలికకు అవసరమైన శస్త్రచికిత్సలను ఇప్పటికే విజయవంతంగా పూర్తి చేశామని, ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు మంత్రికి వివరించారు. అయితే రానున్న 48 గంటలు అత్యంత కీలకమని, ఈ సమయంలో విద్యార్థిని ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాల్సి ఉంటుందని తెలిపారు. మంత్రి నారా లోకేశ్ స్పందిస్తూ.. బాలికకు అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని కోరారు. ఆ చిన్నారిని తమ బిడ్డలా భావించి ప్రత్యేక శ్రద్ధతో చికిత్స అందించాలని విజ్ఞప్తి చేశారు. రానున్న 48 గంటల పాటు ఆమె ఆరోగ్య పరిస్థితిని ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తుందని భరోసా ఇచ్చారు. మరోవైపు, విద్యార్థిని ప్రాణాలను కాపాడేందుకు అంకితభావంతో కృషి చేస్తున్న మణిపాల్ వైద్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.


అనంతరం పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌కు వెళ్లి చికిత్స పొందుతున్న బాలికను మంత్రి లోకేశ్ పరామర్శించారు. అక్కడ అందుతున్న చికిత్స వివరాలపై ఆరా తీశారు. ఆ తర్వాత బాలిక తల్లిదండ్రులను కలిసి పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని, కుటుంబానికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు. అనంతరం ఘటన జరిగిన తీరును అక్కడే ఉన్న పాఠశాల ప్రిన్సిపాల్‌ను అడిగి తెలుసుకున్నారు. బాలికపై అమానుష దాడికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


ఈ మేరకు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలిక త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ఆయన ఆకాంక్షించారు. కాగా, లోకేశ్ వెంట ఎమ్మెల్యేలు పరిటాల సునీత, బండారు శ్రావణి, మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజ, విద్యాశాఖ కమిషనర్ తమీమ్ అన్సారియా ఉన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

పోలింగ్ కేంద్రాల్లో వైసీపీ ఏజెంట్లుగా రౌడీషీటర్లు.. మంత్రి టీజీ భరత్ వ్యాఖ్యలు

ఏపీలో పోలింగ్ జోరు.. మధ్యాహ్నం 3 గంటలకు 48 శాతం ఓటింగ్..

Updated Date - Nov 01 , 2026 | 05:31 PM