Share News

సీఎస్కే ప్లేయర్ అవమానించినా.. ధోనీ భరించాడు: ఆకాశ్ చోప్రా

ABN , Publish Date - Nov 18 , 2026 | 02:59 PM

సీఎస్కే జట్టులో ఒక ప్లేయర్ ధోనీని దూషించినా.. అతడు మాత్రం వ్యక్తిగత ప్రతిష్ఠకు పోకుండా జట్టు ప్రయోజనాలకే పెద్దపీట వేశాడట. 2023 ఐపీఎల్ సీజన్‌లో చోటుచేసుకున్న ఈ ఆసక్తికర ఘటనను టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా తాజాగా వెల్లడించాడు.

సీఎస్కే ప్లేయర్ అవమానించినా.. ధోనీ భరించాడు: ఆకాశ్ చోప్రా
Akash Chopra

ఇంటర్నెట్ డెస్క్: క్రికెట్‌లో కెప్టెన్‌గా వ్యవహరించేటప్పుడు ఆటగాళ్లపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం సహజం. అందులోనూ తనను అవమానించిన ఆటగాడిని జట్టులో కొనసాగించడం అంత సులభం కాదు. కానీ మహేంద్రసింగ్ ధోనీ మాత్రం అందుకు భిన్నంగా ఆలోచించాడట. సీఎస్కే జట్టులో ఒక ప్లేయర్ ధోనీని దూషించినా.. అతడు మాత్రం వ్యక్తిగత ప్రతిష్ఠకు పోకుండా జట్టు ప్రయోజనాలకే పెద్దపీట వేశాడట. 2023 ఐపీఎల్ సీజన్‌లో చోటుచేసుకున్న ఈ ఆసక్తికర ఘటనను టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా తాజాగా వెల్లడించాడు.


‘2023లో చెన్నై సూపర్ కింగ్స్ ఐదోసారి టైటిల్ గెలిచిన సమయంలో అందరినీ ఆశ్చర్యపరిచేలా ఒక ఘటన చోటు చేసుకుంది. జట్టులోని ఒక ప్లేయర్ ధోనీతో అనుచితంగా ప్రవర్తించడమే కాకుండా ఆయనను దూషించాడు. ఈ వ్యవహారంతో అసహనానికి గురైన ధోనీ సన్నిహితులు సదరు ఆటగాడిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. అతడు లేకపోయినా జట్టును పెద్దగా నష్టం లేదని చెప్పారు. కానీ ధోనీ మాత్రం అందుకు అంగీకరించలేదు. తనను అవమానించినా ఆ ప్లేయర్ ప్రతిభ జట్టుకు ఉపయోగపడుతుందని భావించాడు.


‘అతడు మూర్ఖుడిలా ప్రవర్తిస్తున్నాడు. కానీ నేను కెప్టెన్‌ను. నా అహంకారాన్ని అడ్డు పెట్టుకుంటే అతడి బ్యాగులు సర్దించి ఇంటికి పంపించేయగలను. కానీ అతడు జట్టుకు ఉపయోగపడతాడు. చెన్నై విజయానికి తోడ్పడతాడు. అందుకే నా ఆత్మగౌరవాన్ని, అహంకారాన్ని పక్కనపెట్టి అతడిని జట్టులో కొనసాగిస్తాను’ అని ధోనీ అన్నాడు. వ్యక్తిగత అవమానాన్ని పక్కనపెట్టి జట్టు ప్రయోజనాల కోసం ఆలోచించడం ధోనీలోని నాయకత్వ లక్షణాలకు నిదర్శనం. అదే ధోనీ గొప్పతనం’ అని ఆకాశ్ చోప్రా గుర్తుచేసుకున్నాడు. అయితే ఆ ఆటగాడు ఎవరన్న విషయాన్ని మాత్రం ఆకాశ్ చోప్రా వెల్లడించలేదు.


ఐపీఎల్‌కు ధోనీ ఓ ప్రత్యేక ఆకర్షణ..

‘ధోనీ గొప్పతనాన్ని కేవలం పరుగులు, వికెట్ల వెనుక ప్రదర్శనతోనే కొలవలేం. ఐపీఎల్‌ను ప్రపంచవ్యాప్తంగా ఓ పెద్ద క్రికెట్ వేడుకగా మార్చడంలో ధోనీ కీలక పాత్ర పోషించాడు. ధోనీ బ్యాటింగ్‌కు వచ్చిన ప్రతిసారీ ప్రేక్షకుల్లో కనిపించే ఉత్సాహం, ఆయనకున్న క్రేజ్ ప్రత్యేకం. అతడు క్రీజులోకి వచ్చే కొద్ది నిమిషాల కోసం కూడా కోట్లాది మంది అభిమానులు ఎదురుచూస్తారు. ధోనీ లేకపోతే ఐపీఎల్ కళ తప్పుతుంది’ అని ఆకాశ్ చోప్రా వ్యాఖ్యానించాడు.


ఇవి కూడా చదవండి:

ముద్దంటూ విదేశీయురాలిని వేధించిన వ్యక్తి.. కట్ చేస్తే జైల్లో..

అమితాబ్, అభిషేక్ బచ్చన్‌ల హత్యకు 200 మంది సిద్ధం.. గోల్డీ ధిల్లాన్ మరోసారి బెదిరింపులు..

Updated Date - Nov 18 , 2026 | 03:10 PM