శ్రీలంక ఆటగాళ్లతో గొడవ.. వైభవ్‌పై ఐసీసీ చర్యలు తప్పదా?
ABN , Publish Date - Jun 16 , 2026 | 12:29 PM
ట్రై సిరీస్‌లో భాగంగా భారత్, శ్రీలంక ‘ఎ’ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇరుజట్ల ఆటగాళ్ల మధ్య వాగ్వాదం జరిగింది. టీమిండియా యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ లంక ప్లేయర్ తోసేయడానికి యత్నించాడు.
స్పోర్ట్స్ డెస్క్: ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా నిన్న(సోమవారం) భారత్-ఏ, శ్రీలంక-ఏ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇరుజట్ల ఆటగాళ్లు ఆగ్రహావేశాలకు లోనయ్యారు. ఓ దశలోనైతే ఒకరినొకరు నెట్టుకునేంత వరకు వెళ్లింది పరిస్థితి. సూపర్ ఓవర్‌లో శ్రీలంక ఏడు పరుగుల తేడాతో విజయం సాధించిన తర్వాత ఆ జట్టు సంబరాలు చేసుకుంది. ఓటమి బాధలో ఉన్న వైభవ్‌ను ఉద్దేశించి 'ఇంటికి వెళ్లిపో' అంటూ లంక ఆటగాడు హలంబాగే హేళన చేయడంతో చివర్లో పెద్ద గొడవ తప్పలేదు. వైభవ్ అతడి మీదికి దూసుకెళ్లగా.. అతనూ మీదికొచ్చాడు. హలంబాగే మాటలతో సూర్యవంశీ సహనాన్ని కోల్పోయి ప్రత్యర్థి జట్టు ఆటగాడిని ఛాతిపై చేయి వేసి తోసేయడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలోఅతడిపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) చర్యలు ఉంటాయా అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
వైభవ్ చేసిన తప్పులకు అతడికి శిక్ష తప్పేలా లేదు. ఒక అంతర్జాతీయ మ్యాచ్‌లో ఒక ఆటగాడు ఇలా గొడవ పడితే ఐసీసీ కఠిన చర్యలు తీసుకుంటుంది. అది భారీ జరిమానా నుంచి నిషేధం వరకు ఉంటుంది. అయితే వైభవ్, శ్రీలంక ఆటగాళ్ల మధ్య జరిగిన గొడవ అనధికారిక మ్యాచ్ కిందకు రావడంతో ఐసీసీ చర్యలు తీసుకునే అవకాశం తక్కువని క్రీడా నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. అంతకుముందు ఒక నోబాల్ విషయంలో కెప్టెన్ తిలక్ వర్మ అంపైర్లతో వాగ్వాదం చేస్తున్నప్పుడు.. సూర్యవంశీ కూడా జోక్యం చేసుకున్నాడు. అంపైర్లతో వాదనకు దిగాడు.
ఆ తర్వాత కోచ్ హృషికేష్ కనిత్కర్ అతన్ని పక్కకు తీసుకెళ్లాడు. మైదానంలో ఆటగాళ్లు, అంపైర్లతో వాగ్వాదానికి దిగడం ఫిజికల్‌గా ఘర్షణకు దిగితే ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్‌లోని ఆర్టికల్ 2.12 ఉల్లంఘన కిందికి వస్తుంది. వైభవ్ సూర్యవంశీది తప్పేనని మ్యాచ్ రిఫరీ నిర్ణయిస్తే మ్యాచు ఫీజులో 50 శాతం ఫైన్ విధించవచ్చు. అంతేకాక బీసీసీఐ కూడా వైభవ్ సూర్యవంశీని మందలించడం లేదా క్రమశిక్షణా చర్యలు తీసుకునే అవకాశం ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో ప్రస్తుత వివాదంతో సంబంధం ఉన్న ఆటగాళ్లపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం.
ఇవి కూడా చదవండి:
భారత్, శ్రీలంక వివాదంపై స్పందించిన మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్
'ఇంటికి వెళ్లిపో'.. వైభవ్ సూర్యవంశీపై శ్రీలంక ప్లేయర్ వివాదాస్పద వ్యాఖ్య