సింగపూర్‌లో ‘CBN@361 Degrees - Polymath’ పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Jun 16 , 2026 | 11:53 AM
సింగపూర్‌లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. కాకతీయ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరైన సీఎం.. ‘CBN@361 Degrees - Polymath’ పుస్తకాన్ని ఆవిష్కరించారు.
అమరావతి, జూన్ 16: సింగపూర్‌లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. కాకతీయ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా ‘CBN@361 Degrees - Polymath’ పుస్తకాన్ని సీఎం ఆవిష్కరించారు. పుస్తకం తొలి ప్రతులను భారత హైకమిషనర్ శిల్పక్ అంబులేకు అందజేశారు. అనంతరం మంత్రి పి. నారాయణ, అసోసియేషన్ ప్రతినిధులకు పుస్తక ప్రతులను అందజేశారు. ఈ పుస్తకాన్ని ‘రేపటికోసం’ చీఫ్ ఎడిటర్ శాఖమూరు శ్రీనివాస ప్రసాద్ రచించగా.. విశ్రాంత ఐఏఎస్ అధికారి కేవీ సత్యనారాయణ ఆంగ్లంలో అనువాదించారు. దార్శనిక నేతగా చంద్రబాబు నిర్ణయాలను విశ్లేషిస్తూ పుస్తకాన్ని రచించారు.
ఏపీ అభివృద్ధి విజన్, అమరావతి నిర్మాణంపై చంద్రబాబు దూరదృష్టిని ప్రతిబింబించేలా పుస్తకాన్ని రచించారు. లీ క్వాన్ యూ, జసిందా ఆర్డెర్న్ తరహా నాయకత్వంతో చంద్రబాబు ముందుకు వెళ్తున్నారని రచయిత వ్యాఖ్యానించారు. బాహ్య ప్రపంచానికి తెలియని పలు అంశాలను పుస్తకంలో పొందుపరిచినట్లు నిర్వాహకులు వెల్లడించారు. లీ క్వాన్ యూ శతజయంతి వెండి నాణేన్ని చంద్రబాబుకు కాకతీయ కల్చరల్ అసోసియేషన్ బహూకరించింది. త్వరలో తెలుగు, హిందీ సహా ఇతర భారతీయ భాషల్లో పుస్తకాన్ని విడుదల చేయనున్నారు.
గతంలో విడుదలైన ‘Chandrababu X.0’ పుస్తకం 80 లక్షల డౌన్‌లోడ్లు సాధించిందని అసోషియేషన్ వెల్లడించింది. రాజకీయ పరిశోధకులు, మేనేజ్‌మెంట్ విద్యార్థులకు ఈ పుస్తకం ఉపయోగకరమని నిర్వాహకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రామనాథ్, కేవీ సత్యనారాయణ, శంకర ప్రసాద్, సింగపూర్ తెలుగు ప్రముఖులు హాజరయ్యారు.
ఇవి కూడా చదవండి...
కృష్ణా నదీ తీరాన ‘యోగాంధ్ర’.. పాల్గొన్న మీడియా ప్రతినిధులు, విద్యార్థులు
రాజకీయాల్లో విమర్శలు విధానపరంగానే ఉండాలి: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
Read Latest AP News And Telugu News