రాజకీయాల్లో విమర్శలు విధానపరంగానే ఉండాలి: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
ABN , Publish Date - Jun 16 , 2026 | 11:29 AM
రాజకీయాల్లో విమర్శలు విధానపరంగానే ఉండాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. రాష్ట్ర హోంశాఖ మంత్రి అనితపై ఓ మాజీ మంత్రి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
అమరావతి, జూన్ 16: రాజకీయాల్లో విమర్శలు విధానపరంగానే ఉండాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. రాష్ట్ర హోంశాఖ మంత్రి అనితపై ఓ మాజీ మంత్రి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మహిళల కట్టూబొట్టుపై కామెంట్స్ చేసే స్థాయికి ఆ నాయకుడి పార్టీవారు దిగజారిపోయారంటూ వ్యాఖ్యానించారు. స్త్రీల గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఆ వ్యాఖ్యలు కేవలం హోం మంత్రిని అన్నట్టే కాదని.. సగటు మహిళలందరినీ కించపరచినట్లే అని పవన్ అన్నారు.
ప్రజా జీవితంలో ఉన్నవారి నోటి నుంచి వచ్చే ప్రతి మాటను పౌర సమాజం గమనిస్తోందనే విషయాన్ని మరచిపోవద్దని పవన్ అన్నారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు ఉంటాయని... అవి విధానపరంగానే ఉండాలన్నారు. ఒక పాలసీ నచ్చకపోతే ఆ పాలసీ విషయంపైనే విమర్శించాలన్నారు. వాచలత్వంతో ఇళ్లలోని స్త్రీలను కూడా కించపరచే నైజం ఉన్న పార్టీ చేసే కామెంట్స్‌లను బలంగా తిప్పికొట్టేటప్పుడు వాళ్లు చేస్తున్న వ్యాఖ్యల్లో ఎంతటి అభ్యంతరకరమైన విషయం ఉందో ప్రజలకు తెలియజెప్పాలని కూటమి నేతలకు సూచించారు. కూటమి నేతలందరూ పౌర సమాజం హర్షించే భాషలో మాట్లాడి బలంగా బదులివ్వాలన్నారు. అవతలి పార్టీవాళ్ల మాదిరి దిగజారుడు భాష, అర్థరహిత వ్యాఖ్యలు కూటమి నేతలకు అవసరం లేదని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి...
ఏపీ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది: ప్రహ్లాద్ జోషి
కృష్ణా నదీ తీరాన ‘యోగాంధ్ర’.. పాల్గొన్న మీడియా ప్రతినిధులు, విద్యార్థులు
Read Latest AP News And Telugu News