Share News

ఏపీ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది: ప్రహ్లాద్ జోషి

ABN , Publish Date - Jun 16 , 2026 | 08:51 AM

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పూర్తిస్థాయిలో సహకరిస్తోందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. అమరావతి నిర్మాణానికి భారీగా నిధులు కేటాయించామని, రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం కట్టుబడి ఉందని విజయవాడలో పేర్కొన్నారు.

ఏపీ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది: ప్రహ్లాద్ జోషి
Prahlad Joshi On Andhra Pradesh development

విజయవాడ: ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పూర్తిస్థాయిలో కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ దేశ అభివృద్ధి, అమరావతి నిర్మాణం, కేంద్రం అందిస్తున్న సహకారంపై పలు అంశాలను ప్రస్తావించారు.


జవహర్‌లాల్ నెహ్రూ కంటే..

ప్రధాని నరేంద్ర మోదీ అత్యధిక కాలం సేవలందించిన ప్రధానమంత్రులలో ఒకరిగా చరిత్ర సృష్టించారని ఆయన అన్నారు. మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ కంటే ఎక్కువ కాలం ప్రజలకు సేవలందించిన ప్రధానిగా మోదీ నిలిచారని పేర్కొన్నారు. 2014కు ముందు దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సవాళ్లను ఎదుర్కొన్నదని, ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదిగిందని జోషి తెలిపారు. ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ ఎనిమిది రెట్లు పెరిగిందని, రైల్వే విద్యుదీకరణలో భారత్ ప్రపంచంలో రెండో స్థానంలో నిలిచిందని చెప్పారు.


అమరావతి అభివృద్ధి కోసం..

అమరావతి రాజధాని అభివృద్ధి అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో పాటు ఇతర నేతలు ప్రధాని మోదీకి పూర్తి వివరాలు తెలియజేశారని వెల్లడించారు. అమరావతి అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం రూ.15 వేల కోట్లు మంజూరు చేసిందని, హడ్కో ద్వారా మరో రూ.11 వేల కోట్ల ఆర్థిక సహాయం అందించామని పేర్కొన్నారు.

తెలంగాణలో కూడా..

అమరావతిని అనుసంధానించే ప్రత్యేక రైల్వే లైన్ కోసం కూడా నిధులు కేటాయించినట్లు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం అన్ని విధాలుగా సహకరిస్తోందని స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ పవన్ కల్యాణ్, బీజేపీ నేత మాధవ్ సమన్వయంతో రాష్ట్ర అభివృద్ధి కోసం సమర్థంగా పనిచేస్తున్నారని జోషి ప్రశంసించారు. ఇదే అభివృద్ధి నమూనాను తెలంగాణలో కూడా అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.


Also Read:

వాళ్లు దేశమంతా తిరగొచ్చు నన్ను మాత్రం రానివ్వరా!?

‘సర్‌’ ప్రారంభం

Updated Date - Jun 16 , 2026 | 10:15 AM