Share News

‘సర్‌’ ప్రారంభం

ABN , Publish Date - Jun 16 , 2026 | 04:39 AM

రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) ప్రక్రియ ప్రారంభమైందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వివేక్‌ యాదవ్‌ తెలిపారు.

‘సర్‌’ ప్రారంభం

  • రాష్ట్రంలో తొలి రోజు 4.12 లక్షల ఫామ్‌లు పంపిణీ

  • వీటిలో 4 వేల ఫామ్‌లు డిజిటలైజ్‌

  • జూలై 14 వరకు బీఎల్‌వోల ఇంటింటి సర్వే

  • ప్రతి ఇంటికీ మూడుసార్లు బీఎల్‌వోలు

  • ఫామ్‌లు ఇస్తారు.. నింపాక తీసుకుంటారు

  • విదేశాల్లో, ఇతర రాష్ట్రాల్లో ఉన్న వారు ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేయవచ్చు

అమరావతి, జూన్‌ 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) ప్రక్రియ ప్రారంభమైందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వివేక్‌ యాదవ్‌ తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 46,397 మంది బూత్‌లెవల్‌ అధికారులు (బీఎల్‌వోలు) 68,868 మంది బూత్‌ లెవల్‌ ఏజెంట్లు (బీఎల్‌ఏలు), 175 మంది ఈఆర్‌వోలు, 1,076 మంది ఏఈఆర్‌వోలు, 28 మంది డీఈవోలు సర్‌ విధుల్లో ఉన్నారని వెల్లడించారు. రాష్ట్రంలోని 28 జిల్లాల్లోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ ప్రక్రియ అమలు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో 4.16 కోట్ల మంది ఓటర్లను ఈ ప్రత్యేక సవరణ కార్యక్రమం పరిధిలోకి తీసుకొచ్చామని చెప్పారు. ఈ ఏడాది మే 25 నాటికి ఓటరు జాబితాలో ఉన్న ప్రతి ఓటరుకి బీఎల్‌వోలు ప్రత్యేక ఎన్యూమరేషన్‌ ఫామ్‌ (ఈఎఫ్‌) అందజేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఫారాల్లో ఓటర్లకు సంబంధించిన కొంత సమాచారం ముందుగానే ముద్రించి (ప్రీ ఫిల్డ్‌) ఉంటుందన్నారు. దాని తర్వాత ఉండే కాలమ్‌లో 2002 ఎలక్టోరల్‌ రోల్‌లో ఎక్కడ ఉంటే ఆ వివరాలు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. 2002 ఓటరు జాబితాలో పేరు లేకపోతే అమ్మ, నాన్న, తాత, ఇలా ఓటరు కుటుంబీకులకు సంబంధించిన వివరాలు రాయాల్సి ఉంటుందన్నారు. ఆవిధంగా నమోదు చేయలేని పక్షంలో ఈసీ నిర్ణయించిన 11 డాక్యుమెంట్లలో ఏదో ఒక డాక్యుమెంట్‌ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఇప్పటికే 100 శాతం ఫారాల ముద్రణ పూర్తి కాగా, రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పంపిణీ ప్రారంభమైందన్నారు. బీఎల్‌వోల ఇంటింటి సర్వే తొలిరోజైన సోమవారం 4,12,384 ఎన్యూమరేషన్‌ ఫామ్‌లను పంపిణీ చేశారని, వాటిలో 4,115 ఫామ్‌ల వివరాలను డిజిటలైజ్‌ చేశారని ఆయన తెలిపారు. బీఎల్‌వోల సర్వే ప్రక్రియ జూలై 14 వరకు కొనసాగుతుందన్నారు.


అనుమానాలు సులువుగా నివృత్తి చేసుకోవచ్చు

ఓటర్లు ఎవరికైనా ఎన్యూమరేషన్‌ ఫారాల్లో ఉన్న అనుమానాల నివృత్తికి తమ బీఎల్‌వోకి కాల్‌ చేయవచ్చని సీఈవో తెలిపారు. ‘ఈసీఐనెట్‌’ మొబైల్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని దానిలోని కాల్‌ యువర్‌ బీఎల్‌వో ఆప్షన్‌ ద్వారా కాల్‌ చేయవచ్చన్నారు. ఓటర్లు తమ బీఎల్‌వోకి కాల్‌ బుక్‌ చేసిన 48 గంటల్లోగా కచ్చితంగా ఆ బీఎల్‌వో తిరిగి కాల్‌ చేస్తారన్నారు. అదేవిధంగా బీఎల్‌వోలు ఇంటింటి సర్వేకి వచ్చినప్పుడు ఊళ్లో లేని వారు, ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారి ఇంట్లో కుటుంబ సభ్యులు వారి ఎన్యూమరేషన్‌ ఫామ్‌ తీసుకుని పూర్తి చేసి సంతకం చేసి బీఎల్‌వోలకు అందజేయవచ్చన్నారు. అదేవిధంగా ఇతర దేశాలు, రాష్ట్రాల్లో ఉన్న వారు వోటర్స్‌.ఈసీఐ.జీవోవీ.ఇన్‌ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఆన్‌లైన్‌లో కూడా ఎన్యూమరేషన్‌ ఫామ్‌ నింపొచ్చన్నారు. బీఎల్‌వోల ఇంటింటి సర్వే సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి డ్యాష్‌ బోర్డును కూడా ఏర్పాటు చేశామన్నారు. ఏ రోజు ఎన్ని ఎన్యూమరేషన్‌ ఫామ్‌లు ఓటర్లకు ఇచ్చారు, ఎన్ని డిజిటలైజ్‌ చేశారు, ఏఏ జిల్లాల్లో ఎలా ఇంటింటి సర్వే కొనసాగుతోందనే వివరాలు ప్రతి రోజు మీడియాకు జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో వెల్లడిస్తామన్నారు. 2002 నాటి ఓటర్ల జాబితా ప్రాతిపదికగా ప్రస్తుత ఓటర్ల జాబితాను మ్యాపింగ్‌ చేస్తున్నామని, ఈ మ్యాపింగ్‌ ప్రక్రియ ఇప్పటికే 76 శాతం పూర్తయిందని వివేక్‌ యాదవ్‌ తెలిపారు. ఇప్పుడు బీఎల్‌వోలు ఇంటింటి ఓటర్ల సర్వేకు వెళుతున్నారని, ఈ మ్యాపింగ్‌ 95 శాతానికిపైగా చేయడమే లక్ష్యమని తెలిపారు.

ఆందోళన అవసరం లేదు

సర్‌ ప్రక్రియలో పాల్గొంటున్న ఉద్యోగులు, అధికారులందరికీ ఇప్పటికే శిక్షణ ఇచ్చామని వివేక్‌ యాదవ్‌ తెలిపారు. ఎన్యూమరేషన్‌ ఫారాల పంపిణీ, సేకరణ కోసం ప్రతి బీఎల్‌వో ప్రతి ఇంటికి కచ్చితంగా మూడు సార్లు వెళ్తారని చెప్పారు. ఓటరుకు ముందే నింపిన ఎన్యూమరేషన్‌ ఫామ్‌ బీఎల్‌వోలు అందజేస్తారని, ఆ ఫామ్‌లో ఓటర్లు కచ్చితంగా 2002 ఎలక్టోరల్‌ రోల్‌లో వాళ్ల వివరాలు నింపి, ఒక కలర్‌ ఫోటో, సంతకం చేసి ఎన్యూమరేషన్‌ ఫామ్‌ను బీఎల్‌వోకి తిరిగి ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఓటర్లు ఇచ్చిన ఫారాలు బీఎల్‌వోలు డిజిటలైజ్‌ చేస్తారన్నారు. అదేవిధంగా ప్రతి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ ప్రతి పోలింగ్‌ స్టేషన్‌కు ఒక బీఎల్‌ఏను నియమించుకోవాలని సూచించామన్నారు. సర్‌పై ఓటర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అర్హత ఉన్న ప్రతి ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. డూప్లికేట్‌, డబుల్‌ ఎంట్రీ, మరణించిన వారి ఓట్లు జాబితాల నుంచి తొలగిపోతాయన్నారు.

Updated Date - Jun 16 , 2026 | 04:39 AM