వాళ్లు దేశమంతా తిరగొచ్చు నన్ను మాత్రం రానివ్వరా!?
ABN , Publish Date - Jun 16 , 2026 | 04:42 AM
భారత్ జోడో యాత్ర పేరుతో కాంగ్రెస్ నాయకులు దేశమంతటా తిరిగి అందరినీ కలుస్తారు. కానీ, నేను తెలంగాణలో తిరుగుతానంటే మాత్రం అనుమతి ఇవ్వరు.
యువతను బలిచేసి గద్దెనెక్కారు
తెలంగాణ బలిదానాలు కదిలించాయి
నివాళులర్పిద్దామంటే అనుమతివ్వలేదు
తెలంగాణ అభివృద్ధికి జనసేన పనిచేస్తుంది
కాంగ్రెస్ పార్టీది ద్వంద్వ సిద్ధాంత ధోరణి
దేశాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులతో పోరాడతాం
ఢిల్లీ మెడలు వంచుతామని ప్రగల్భాలు
కానీ, ఇక్కడకొచ్చి తమ తలలే వంచుకుంటారు
దేశానికి బలమైన నాయకుడిగా ప్రధాని మోదీ
దేశ సమగ్రత.. సమైక్యతే జనసేన పార్టీ ఆత్మ
‘జాతీయ సమైక్యత కోసం.. సేన ప్రస్థానం’
పేరుతో హస్తినలో నిర్వహించిన భేటీలో పవన్
ఇది.. కాంగ్రెస్ పార్టీ హిపోక్రసీకి నిదర్శనం
న్యూఢిల్లీ, జూన్ 15(ఆంధ్రజ్యోతి): ‘‘భారత్ జోడో’ యాత్ర పేరుతో కాంగ్రెస్ నాయకులు దేశమంతటా తిరిగి అందరినీ కలుస్తారు. కానీ, నేను తెలంగాణలో తిరుగుతానంటే మాత్రం అనుమతి ఇవ్వరు. కాంగ్రెస్ పార్టీ హిపోక్రసీ రాజకీయాలు ఆపేయాలి. నాకు తెలంగాణ యువత పోరాటాల మీద గౌరవం ఉంది.’’ అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో యువతను బలిచేసి నాయకులు గద్దెనెక్కారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో 1200 మంది అమరులైతే వాళ్లను గుర్తించడానికి 12 సంవత్సరాలు కూడా ఇంకా సరిపోవడం లేదా? అని ప్రశ్నించారు. ఈ రోజు అందరూ ‘జెన్-జీ’ గురించి మాట్లాడుతున్నారని, అయితే, తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన 1200 మంది యువతకు ఏం దక్కిందని ఆవేదన వ్యక్తం చేశారు. వారంతా కాలేజీల్లో, పాఠశాలల్లో చదువుకునే పిల్లలని, యువతను బలి చేసి నాయకులు గద్దెనెక్కారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జెన్-జీ కంటే ముందుతరం తెలంగాణ ఉద్యమ యువత ఉద్వేగంతో వేర్పాటువాద భావజాలాలవైపు వెళ్లి ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ బలిదానాలు తనను కదిలించాయన్నారు. 1200 మందికి నివాళులర్పిద్దామని తాను వెళితే తెలంగాణ ప్రభుత్వం అనుమతివ్వలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగ విలువలను గౌరవించడం లేదని, జనసేనకార్యక్రమాలకు అనుమతులు నిరాకరించడం ద్వారా రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేసిందని విమర్శించారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ఢిల్లీలోని అశోకా హోటల్‌లో నిర్వహించిన ‘జాతీయ సమైక్యత కోసం.. సేన ప్రస్థానం’ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సమావేశం ప్రారంభంలోను.. ముగింపులోను పవన్‌కల్యాణ్ మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..

మోదీ.. దేశానికి గొప్పదనం!
యూపీఏ(కాంగ్రెస్) హయాంలో ముంబైలో 72 గంటలు జరిగిన మారణ హోమంపై నేను కలత చెందా. దేశానికి ఉగ్రవాదం పీడ తప్పించే బలమైన నాయకత్వం ఇవ్వాలని కాశీ విశ్వేశ్వరుడిని వేడుకున్నా. దేశాన్ని ముందుకు నడిపించే, ఐక్యంగా ఉంచే నిస్వార్థ నేత ప్రధాని మోదీ. దేశానికి ఉన్న గొప్పదనం ఏమిటంటే క్లిష్ట పరిస్థితులు ఎదురైన ప్రతిసారీ ఓ బలమైన నాయకుడిని తయారు చేసుకుంటుంది. దేశంలో మనం భద్రంగా ఉన్నామంటే సరిహద్దుల్లో కాపాలా కాసే సైనికుల పుణ్యమేం. వారికి ప్రాంతీయ భావన ఉండదు.
గందరగోళంలో జెన్-జీ
జెన్-జీని గందరగోళపరచే శక్తులున్నాయి. ప్రతి తరంలోనూ సమాజంలో జరిగే కొన్ని విషయాల పట్ల కోపం, కసి, వేదన, బాధ ఉంటాయి. సామాజిక, రాజకీయ పరిస్థితులను బట్టి అవి యువతరంలో వివిధ దశల్లో ఉండటం సహజం. నేటి తరం ఏ విషయాన్ని అయినా చదవండి... తెలుసుకోండి... పరిశోధించండి.. పరిశీలించండి.. ఆ తర్వాతే దానిపై స్థిరమైన భావాన్ని ఏర్పరచుకోండి. అప్పుడే మనకు దేశానికి మేలు చేేస సానుకూల ఆలోచనలు పుడతాయి. కేవలం ఫ్యాషన్‌గా ఉండే పేర్లకు, మెదడును గందరగోళపరిచే అంశాలకు ‘జెన్-జీ’ దూరంగా ఉండటం మేలు. నేటి జెన్-జీ తరం అయినా, ఏ తరం అయినా దేశ సమగ్రత, సమైక్యత, సార్వభౌమాధికారం, సచ్ఛీలతను కాపాడేలా ఆలోచించాలి.
ప్రాంతంతో పనేముంది?
భారతదేశం వంటి గొప్ప దేశం మరొకటి ఉండదు. కేరళకు చెందిన వర్గీస్ కురియన్ శ్వేత విప్లవాన్ని తీసుకొచ్చి గుజరాత్‌ను రోల్ మోడల్ చేశారు. శ్రీధరన్ కేరళలో పుట్టి ఢిల్లీలో అత్యద్భుత మెట్రోకు రూపకల్పన చేశారు. కర్ణాటకకు చెందిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య హైదరాబాద్ మూసి నది వరదల నివారణకు కృషి చేసిన మహానుభావుడు. దేశం నీ ఇల్లు అయితే.. రాష్ట్రమనే ఏ గదిలో నువ్వున్నా ఇల్లంతా నీదే అవుతుంది. భారతీయుడికి రాష్ట్రంతో పనేముంది. మనకు దేశమే తొలి ప్రాధాన్యం కావాలి. అయితే కొన్ని దశాబ్థాల నుంచి ఈ స్ఫూర్తి మెల్లగా తగ్గుతోంది. ఇది ప్రమాదకరం. మనమంతా ఒకటే దేశం. మనదంతా భారతదేశం. మనసంతా భారతీయం అనే భావన ప్రతి ఒక్కరిలో కలగాలి. దేశ సమగ్రత, సమైక్యతకు ఏ ఆటంకం వచ్చినా జనసేన పార్టీ ముందుండి పోరాడుతుంది. దేశమే ముందు.. మిగతావన్నీ తర్వాతే అనేది మా పార్టీ విధానం. విభజన వాదాలు, ప్రాంతీయ విద్వేషాలు, ప్రజల్లో విబేధాలు సృష్టించే శక్తులపై జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పోరాడుతారు. ఎన్నో చారిత్రక పోరాటాలకు నెలవైన ఢిల్లీ నేల నుంచి జనసేన పార్టీ దేశమంతటికీ వినిపించేలా చెప్పేదొక్కటే.. దేశానికి ప్రమాదకరంగా, దేశ విచ్ఛిన్నానికి కుట్రలు పన్నే ఏ శక్తితో అయినా మేం బలంగా పోరాడుతాం. జనసేన పార్టీ ఢిల్లీ వేదికగా అధికారం కోసమో, పదవుల కోసమో, ప్రాపకం కోసమో, నిరసనల కోసమో రాలేదు. దేశభక్తితో, జాతి సమగ్రతకు నిలబడాలనే విశాలమైన దృక్పథంతో ముందుకు వచ్చింది.
విభజనకు కాదు.. విభజన తీరుకే..
జనసేన పార్టీ మొదటి నుంచి తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించలేదు. తెలంగాణ ఏర్పాటుకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించిన తీరునే విమర్శించాం. ఉన్నతంగా, గౌరవంగా ఇవ్వాల్సిన రాష్ట్రాన్ని అసంబద్ధ్దంగా ఇచ్చారు. దీంతోనే ఇప్పటికీ విభజన సమస్యలు, ఆస్తుల పంపకం సమస్యలుగా ఉన్నాయి. ప్రజల మధ్య విద్వేషాలను ప్రతిసారీ రెచ్చగొట్టడానికి ఇదే కారణం అవుతోంది. రాష్ట్రాన్ని సక్రమంగా ఇవ్వలేదని తెలంగాణ ప్రజలు ఇప్పటికీ భావిస్తున్నారు. దీంతోనే అశాంతి, అసంతృప్తి ఉన్నాయి. విభజన చేసిన తీరు ఈనాటికీ మానని గాయంగా ఉంది. అప్పట్లో సక్రమంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించని తీరునే నేను పదేపదే ప్రస్తావిస్తాను.
కాక్రోచ్ పార్టీపై..
ఈ మధ్య కాక్రోచ్ జనతా పార్టీ ఎలా పుట్టుకొచ్చిందో చూస్తున్నాం. ఈ పార్టీని చూస్తే.. చలిచీమల పద్యం(సుమతీ శతకం) గుర్తుకు వచ్చింది. కొన్ని కళ్ల ముందు జరిగే విషయాలను చిన్నవిగా చూస్తాం. ఏమవుతుందిలే అని వదిలేస్తాం. చలి చీమలు కూడా పాముని చంపేస్తాయనే మాటను పెద్దలు చెబుతుంటారు. అయితే.. ‘చెడు చీమలు’ అన్ని కలిసి జాతిని, దేశాన్నీ నాశనం చేసేందుకు ప్రయత్నాలు చేస్తే వాటిని జనసేన పార్టీ బలంగా అడ్డుకుంటుంది. దేశానికి, జాతి సమగ్రతకు ద్రోహం చేసే ఎవరినైనా జనసేన వ్యతిరేకిస్తుంది. విభజన వాదాన్ని ప్రోత్సహించే వారిని జనసేన ఉపేక్షించదు. అలాంటి వారి పట్ల పార్టీ గళం బలంగా ఉంటుంది. అని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.
‘‘నేను ఆంధ్రాలో పుట్టినప్పటికీ, తమ నేల గురించి ఎన్ని త్యాగాలు చేయడానికి అయినా సిద్థపడే తెలంగాణ యువత ఆకాంక్షల మీద గౌరవం ఉంది. తెలంగాణ అభివృద్ధికి నేను కట్టుబడి ఉన్నా. తెలంగాణలో నాకు ఏ పదవీ వద్దు. తెలంగాణ యువత ఆశయాల కోసం జనసేన తన వంతు కృషి చేస్తుంది. ఒక సిద్థాంతాన్ని నమ్మితే దానికోసం సర్వం కోల్పోవడానికి సిద్థమయ్యే మనస్తత్వం నాది. పోరాటం.. కొట్లాట జనసేన పార్టీకి ఊపిరి.’’
- పవన్ కల్యాణ్
‘‘జాతీయ పార్టీ అంటే కేవలం ఎన్ని రాష్ట్రాల్లో పోటీ చేస్తుందనే అంశంపై ఆదారపడదు. ప్రతి రాష్ట్రంలోనూ ఒకే విధమైన రాజ్యాంగ విలువలను పాటిస్తుందా? లేదా? అనే దానిపై ఆధారపడి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ.. దేశానికి ఒక సిద్ధాంతం.. తాను పాలిస్తున్న రాష్ట్రాలకు మరో సిద్ధాంతం పాటించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్థం.’’
- పవన్ కల్యాణ్