Share News

NEET రీ-ఎగ్జామ్‌.. టెలిగ్రామ్‌పై ఆంక్షలు

ABN , Publish Date - Jun 16 , 2026 | 11:00 AM

NEET (UG) 2026 రీ-ఎగ్జామ్ నేపథ్యంలో టెలిగ్రామ్ యాప్ యాక్సెస్‌పై కేంద్ర ప్రభుత్వం తాత్కాలిక ఆంక్షలు విధించింది. ఐటీ చట్టం సెక్షన్ 69A కింద జూన్ 22 వరకు దేశవ్యాప్తంగా టెలిగ్రామ్ వినియోగంపై నియంత్రణ ఉండనుంది.

NEET రీ-ఎగ్జామ్‌.. టెలిగ్రామ్‌పై ఆంక్షలు
NEET UG 2026 Cyber Crime Action

న్యూఢిల్లీ: NEET (UG) 2026 రీ-ఎగ్జామినేషన్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షను సురక్షితంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు టెలిగ్రామ్ యాప్ యాక్సెస్‌పై తాత్కాలిక ఆంక్షలు విధించినట్లు తెలుస్తోంది. ఐటీ చట్టం (IT Act) సెక్షన్ 69A కింద ఈ చర్యలు తీసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. జూన్ 22 వరకు భారతదేశంలో టెలిగ్రామ్ యాప్ యాక్సెస్‌పై నియంత్రణ ఉండనుంది. ఈనెల 21న దేశవ్యాప్తంగా NEET (UG) 2026 రీ-ఎగ్జామ్ నిర్వహించనున్న నేపథ్యంలో, పరీక్ష భద్రతను దృష్టిలో ఉంచుకుని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) సిఫార్సు మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.


అలాగే, టెలిగ్రామ్‌లో ఈనెల 30 వరకు మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్‌ను పూర్తిగా నిలిపివేయాలని ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ (MeitY) ఆదేశాలు జారీ చేసింది. పరీక్ష పూర్తైన తర్వాత పాత టైమ్‌స్టాంప్‌లతో నకిలీ 'పేపర్ లీక్' ఆధారాలు సృష్టిస్తున్న ముఠాలను అడ్డుకోవడానికే మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్‌పై నిషేధం విధించినట్లు తెలుస్తోంది. పేపర్ లీక్ పేరుతో విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న నకిలీ టెలిగ్రామ్ ఛానళ్లపై ఇప్పటికే సైబర్ క్రైమ్ విభాగాలు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. అహ్మదాబాద్‌లో 8 టెలిగ్రామ్ ఛానళ్లను నడుపుతూ రూ.1.5 కోట్ల మోసాలకు పాల్పడిన అంతర్రాష్ట్ర ముఠాను సైబర్ క్రైమ్ బ్రాంచ్ అరెస్ట్ చేసింది.


జూన్ 21న జరగనున్న NEET (UG) 2026 రీ-ఎగ్జామ్‌కు ముందు ప్రశ్నాపత్రం లీక్ అయ్యిందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలపై NTA స్పందించింది. అవన్నీ తప్పుడు ప్రచారాలేనని స్పష్టం చేస్తూ, విద్యార్థులు అధికారిక సమాచారం కోసం NTA అధికారిక వెబ్‌సైట్‌ను మాత్రమే అనుసరించాలని సూచించింది. ఎవరైనా మోసాలకు పాల్పడితే వెంటనే జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930కి ఫిర్యాదు చేయాలని కేంద్ర ప్రభుత్వం కోరింది.


Also Read:

ఎంబీయేల శకం ముగిసింది: ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్

UPSC నోటిఫికేషన్.. 400కు పైగా ఉద్యోగ ఖాళీలు

Updated Date - Jun 16 , 2026 | 12:19 PM