ఎంబీయేల శకం ముగిసింది: ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్
ABN , Publish Date - Jun 16 , 2026 | 09:29 AM
ఎంబీయేల శకం ముగిసిందని ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్ అన్నారు. సంప్రదాయ కెరీర్ మార్గాలపై యువత పునరాలోచించుకోవాలని సూచించారు.
ఇంటర్నెట్ డెస్క్: నేటి ఆర్థిక వ్యవస్థలో కేవలం డిగ్రీలే స్థిర ఉపాధి కల్పించలేవని ఆర్థిక సలహాదారు వి.అనంత నాగేశ్వరన్ యువతను అప్రమత్తం చేశారు. సంప్రదాయ కెరీర్ మార్గాలపై యువత పునరాలోచించుకోవాలని సూచించారు. ఏఎన్ఐ పాడ్‌కాస్ట్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికీ అనేక మంది విద్యార్థులు సంప్రదాయ విధానాల్లో తమ కెరీర్‌ను నిర్మించుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. డిగ్రీలు, పీజీలు, ఆపై యూపీఎస్‌సీ లాంటి పోటీ పరీక్షల మార్గంలో వెళుతున్నారని చెప్పారు. ఇది సుస్థిర ఉపాధికి దారి తీస్తుందా? లేదా? అన్న విషయాన్ని పట్టించుకోవట్లేదని చెప్పారు.
సంప్రదాయ కెరీర్ మార్గాల గురించి తాను తన పిల్లలను, తన స్నేహితుల పిల్లలను ఇలాగే అప్రమత్తం చేశానని అన్నారు. వెల్డింగ్, ప్లంబింగ్, కార్పెంటరీ, ఎలక్ట్రికల్ వర్క్ వంటి వొకేషనల్ కోర్సులపై భారత్‌లో కొన్ని దశాబ్దాలుగా ఆసక్తి కొరవడిందని అన్నారు. స్విట్జర్‌లాండ్, జపాన్, దక్షిణ కొరియా, చైనా వంటి దేశాల్లో ఈ వృత్తులకు ఎంతో గౌరవం లభిస్తుందని చెప్పారు. గ్లోబలైజేషన్ కారణంగా సాఫ్ట్‌వేర్, కంప్యూటర్ సైన్స్, ఎంబీయే కోర్సులు చేసిన వారికి అదనపు ప్రయోజనం లభించిన మాట వాస్తమేనని అన్నారు. అయితే, ఆ శకం ముగిసిపోయిందని చెప్పారు. వొకేషనల్ కోర్సులు, సాఫ్ట్ స్కిల్స్, మనుషుల నిర్ణయాత్మక సామర్థ్యాల అవసరమున్న రంగాలకే భవిష్యత్తులో ప్రాధాన్యం లభిస్తుందని స్పష్టం చేశారు.
జీవితంలో తన స్నేహితులకంటే వెనకబడిపోయాయని భావించిన ఒక యువ షెఫ్‌కు తాను ఇదే సలహా ఇచ్చానని చెప్పారు. సోషల్ మీడియాలో పోస్టులు కెరీర్‌లో విజయాలకు కొలమానాలు కావని అతడికి చెప్పానని అన్నారు. వంటలో అతడికి ఉన్న నైపుణ్యాలను ఏఐ భర్తీ చేయలేదని భరోసా ఇచ్చినట్టు చెప్పారు.
ఈ వార్తలనూ చదవండి:
UPSC నోటిఫికేషన్.. 400కు పైగా ఉద్యోగ ఖాళీలు
భవిష్యత్తును నిర్దేశించే ఇంజనీరింగ్ కోర్సులు