శ్రీలంక ప్లేయర్‌ను తోసేసిన వైభవ్ సూర్యవంశీ.. వీడియో వైరల్
ABN , Publish Date - Jun 15 , 2026 | 08:42 PM
భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి మైదానంలో ఆవేశానికి గురయ్యాడు. దంబుల్లాలో ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా శ్రీలంక-ఎపై సూపర్ ఓవర్‌లో భారత్-ఎ ఓడిపోయింది. ఈ క్రమంలో ఆ ప్లేయర్లకు, వైభవ్ సూర్యవంశీకి వాగ్వాదం జరిగింది.
ఇంటర్నెట్ డెస్క్: భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి మైదానంలో ఆవేశానికి గురయ్యాడు. దంబుల్లాలో ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా శ్రీలంక-ఎపై సూపర్ ఓవర్‌లో భారత్-ఎ ఓడిపోయింది. సూపర్ ఓవర్లో చివరి మూడు బంతులకు స్ట్రైకింగ్‌లో ఉన్న వైభవ్.. ఆరు పరుగులే చేశాడు. మ్యాచ్ గెలిచాక శ్రీలంక ప్లేయర్లు సంబరాలు చేసుకున్నారు. ఈ క్రమంలో ఆ ప్లేయర్లకు, వైభవ్ సూర్యవంశీకి వాగ్వాదం జరిగింది. శ్రీలంక ప్లేయర్‌ను వైభవ్ తోసేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ టైగా ముగియడంతో ఫలితం కోసం సూపర్ ఓవర్ నిర్వహించారు. ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక-ఎ 16 పరుగులు చేయగా.. భారత్-ఎ 9 పరుగులకే పరిమితైంది. విజయం ఖరారైన వెంటనే మతులన్‌తో పాటు శ్రీలంక ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. ఇదే సమయంలో వైభవ్ అసహనానికి గురైనట్లు కనిపించింది. ఈ క్రమంలోనే భారత ఓపెనర్లను కొంతమంది శ్రీలంక ప్లేయర్లు ఏదో అన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన వైభవ్.. ఓ శ్రీలంక ప్లేయర్ ఛాతీపై చేయి వేసి నెట్టేశాడు. ఆ క్రికెటర్ కూడా ప్రతిఘటించడంతో వివాదం మరింత పెద్దది అయ్యేలా కనిపించింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో వికెట్ కీపర్ నిరోషన్ డిక్వెల్లా మధ్యలో జోక్యం చేసుకుని వైభవ్ సూర్యవంశీని అక్కడి నుంచి దూరంగా తీసుకెళ్లాడు. అనంతరం ఆటగాళ్లు పరస్పరం హ్యాండ్‌షేక్ చేసుకుంటున్న సమయంలో కూడా వైభవ్ ఆగ్రహం తగ్గలేదు. మైదానం వీడి వెళ్తున్నప్పటికీ అతడిని సహచర ఆటగాళ్లు శాంతింపజేయాల్సి వచ్చింది.
ఇక మ్యాచ్‌లో భారత్-ఎ కెప్టెన్ తిలక్ వర్మ కూడా పలుమార్లు అంపైర్లతో వాదనకు దిగడం గమనార్హం. సూపర్ ఓవర్ నిర్వహించేందుకు వెలుతురు సరిపోతుందని, అలాగే సూపర్ ఓవర్‌లో వేసిన ఓ బంతిని నో బాల్‌గా ప్రకటించాలంటూ అంపైర్లతో చర్చించాడు. బ్యాటింగ్ పరంగా కూడా వైభవ్‌కు ఇది నిరాశాజనక మ్యాచ్‌గానే నిలిచింది. అతడు కేవలం 14 బంతుల్లో 21 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. కాగా, ప్రత్యర్థి ఆటగాళ్లతో వైభవ్ ఘర్షణ పడటం ఇదే తొలిసారి కాదు. గత ఏడాది అండర్-19 ఆసియా కప్ ఫైనల్లో పాకిస్థాన్ యువ బౌలర్ అలీ రెజాతోనూ అతడు మైదానంలో వాగ్వాదానికి దిగాడు. దీంతో యువ ఆటగాడు తన ఆవేశాన్ని అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం ఉందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇవి కూడా చదవండి:
ముక్కోణపు సిరీస్: సూపర్ ఓవర్‌లో శ్రీలంక-ఎ విజయం
దోహా డైమండ్ లీగ్: కమ్‌బ్యాక్ ఇవ్వనున్న నీరజ్ చోప్రా