దోహా డైమండ్ లీగ్: కమ్‌బ్యాక్ ఇవ్వనున్న నీరజ్ చోప్రా
ABN , Publish Date - Jun 15 , 2026 | 05:41 PM
భారత జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా కమ్‌బ్యాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. వెన్ను గాయం కారణంగా చాలా కాలం పాటు ఆటకు దూరంగా ఉన్న నీరజ్.. జూన్ 19న ప్రారంభం కానున్న దోహా డైమండ్ లీగ్ 2026లో పాల్గొననున్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: భారత జావెలిన్ త్రో స్టార్, రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత నీరజ్ చోప్రా కమ్‌బ్యాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. వెన్ను గాయం కారణంగా చాలా కాలం పాటు ఆటకు దూరంగా ఉన్న నీరజ్.. జూన్ 19న ప్రారంభం కానున్న దోహా డైమండ్ లీగ్ 2026లో పాల్గొననున్నాడు. ఈ విషయాన్ని నీరజ్‌కు సంబంధించిన మేనేజ్‌మెంట్ సంస్థ ప్రకటించింది. ‘2026లో తొలి త్రో దోహాలోనే.. నీరజ్ చోప్రా జూన్ 19న తిరిగి బరిలోకి దిగనున్నాడు’ అని పేర్కొంది.
దోహా డైమ్ండ్ లీగ్‌కు సంబంధించి జూన్ 12న ప్రకటించిన తుది జాబితాలో నీరజ్ చోప్రా పేరు లేకపోవడం గమనార్హం. అయితే పూర్తి ఫిట్‌నెస్ సాధించడంతో చివరి నిమిషంలో అతడిని పోటీలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. దోహా వేదిక నీరజ్‌కు ప్రత్యేకమైనది. గతేడాది ఇదే మైదానంలో అతడు తన కెరీర్‌లో తొలిసారి 90 మీటర్ల మార్కును అధిగమించి చరిత్ర సృష్టించాడు. 90.23 మీటర్ల త్రో నమోదు చేసినప్పటికీ, జర్మనీకి చెందిన జులియన్ వెబర్ 91.06 మీటర్ల త్రోతో అగ్రస్థానంలో నిలవడంతో నీరజ్ రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు.
ఇక ఇటీవల ప్రకటించిన భారత అథ్లెటిక్స్ జట్టులో కూడా నీరజ్‌కు చోటు దక్కింది. అయితే అథ్లెటిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఏఎఫ్‌ఐ) నిర్దేశించిన 82.61 మీటర్ల అర్హత ప్రమాణాన్ని అందుకోవాల్సి ఉంటుంది. ఆ అర్హత సాధిస్తే రాబోయే కామన్వెల్త్ క్రీడల్లోనూ అతడు భారత్ తరఫున బరిలోకి దిగనున్నాడు. కాగా, దోహా డైమండ్ లీగ్ 2026 సీజన్ ఈ ఏడాది మే 8న ప్రారంభం కావాల్సి ఉంది. అయితే పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా పోటీలు వాయిదా పడ్డాయి. దీంతో జూన్ 19న ఈ సీజన్ ప్రారంభం కానుంది.
ఇవి కూడా చదవండి:
భారత్‌తో హ్యాండ్‌షేక్ వివాదం: పాకిస్థాన్ కోచ్ రియాక్షన్ ఇదే
అవును.. మైదానంలో మాత్రం కోహ్లీ అహంకారే: రవి శాస్త్రి