భారత్, శ్రీలంక వివాదంపై స్పందించిన మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్
ABN , Publish Date - Jun 16 , 2026 | 10:45 AM
దంబుల్లా అంతర్జాతీయ స్టేడియం వేదికగా భారత్ 'ఎ', శ్రీలంక 'ఎ' జట్ల మధ్య జరిగిన త్రైపాక్షిక సిరీస్ మ్యాచ్ పెను వివాదానికి దారితీసింది. దీనిపై టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు. శ్రీలంక మైండ్ గేమ్ ఆడిందంటూ కామెంట్స్ చేశాడు.
స్పోర్ట్స్ డెస్క్: ముక్కోణపు సిరీస్‌లో భాగంగా దంబుల్లా వేదికగా నిన్న(సోమవారం) భారత్-ఏ, శ్రీలంక-ఏ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. తొలుత ఇరుజట్ల స్కోర్ సమం కాగా.. సూపర్ ఓవర్‌తో మ్యాచ్ ఫలితం తేలింది. సూపర్ ఓవర్లో శ్రీలంక విజయం సాధించింది. వెలుతురు లేమి, అంపైర్ల వివాదాస్పద నిర్ణయాలు, ఆటగాళ్ల మధ్య శృతిమించిన వాగ్వాదాలు ఈ మ్యాచ్‌లో చర్చనీయాంశంగా మారాయి. దీనిపై టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు. వారిది అద్భుతమైన నాటకం అంటూ శ్రీలంకను ఉద్దేశిస్తూ ట్వీట్ చేశాడు.
రవిచంద్రన్ అశ్విన్ 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ.. లంక జట్టు మైండ్ గేమ్స్ ఆడిందని, సూపర్ ఓవర్‌లో బ్యాటింగ్‌కు రావడానికి వారు కావాలనే ఆలస్యం చేసి భారత్‌ను అసహనానికి గురిచేశారని పేర్కొన్నాడు. ఐపీఎల్ తరహాలో ఇక్కడ ఎక్కువ కెమెరాలు లేకపోవడం వల్ల 'నో-బాల్' నిర్ణయం వివాదాస్పదంగా మిగిలిపోయిందని, భారత జట్టు చూపిన ఆగ్రహంలో న్యాయముందని అశ్విన్ సమర్థించాడు.
మొదట లంక జట్టు భారత్ స్కోరు (265)ను సమం చేయడంతో మ్యాచ్ టై అయింది. అయితే స్టేడియంలో వెలుతురు మందగించడంతో సూపర్ ఓవర్ నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. ఈ క్రమంలో భారత కెప్టెన్ తిలక్ వర్మ అంపైర్లతో తీవ్రంగా వాదించి, పట్టుబట్టి మరీ సూపర్ ఓవర్‌కు ఒప్పించారు. అయితే, సూపర్ ఓవర్ ఆఖరి బంతి వద్ద అసలు డ్రామా మొదలైంది. అర్షద్ ఖాన్ వేసిన నడుము ఎత్తు ఫుల్ టాస్ బంతిని అంపైర్లు 'నో-బాల్'గా ప్రకటించడం తీవ్ర వివాదానికి కారణమైంది. అప్పటికే ఆటగాళ్లు మైదానం వీడుతుండగా ఈ నిర్ణయం రావడంతో తిలక్ వర్మ అంపైర్లతో కాసేపు వాగ్వాదం చేశాడు.
ఈ గందరగోళం మధ్య లంక జట్టు విజయం సాధించింది. అనంతరం మ్యాచ్ ముగించుకుని వస్తోన్న భారత యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీని ఉద్దేశించి.. 'ఇక ఇంటికి వెళ్లిపో' అంటూ లంక ఆటగాడు విషేన్ హలంబగే హేళనగా కామెంట్స్ చేశాడు. దీంతో ఆవేశానికిలోనైనా వైభవ్.. ఆ లంక ఆటగాడిని నెట్టడం, దానికి ప్రతిగా లంక ప్లేయర్లు వైభవ్‌ను తోసేశాడు. ఈ ఘర్షణ దృశ్యాలన్ని టీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. త్వరలోనే ఐర్లాండ్ పర్యటన ద్వారా సీనియర్ జట్టులోకి అరంగేట్రం చేయనున్న సూర్యవంశీ.. ఇలా వివాదంలో చిక్కుకోవడం చర్చనీయాంశమైంది.
ఇవి కూడా చదవండి:
'ఇంటికి వెళ్లిపో'.. వైభవ్ సూర్యవంశీపై శ్రీలంక ప్లేయర్ వివాదాస్పద వ్యాఖ్య
ఉత్కంఠభరితంగా సాగిన బెల్జియం, ఈజిప్ట్‌ల మ్యాచ్