Share News

ఉత్కంఠభరితంగా సాగిన బెల్జియం, ఈజిప్ట్‌ల మ్యాచ్

ABN , Publish Date - Jun 16 , 2026 | 08:21 AM

ఫిఫా ప్రపంచకప్‌ 2026లో భాగంగా బెల్జియం, ఈజిప్ట్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌ 1-1తో డ్రాగా ముగిసింది. గ్రూప్‌- జీలో భాగంగా జరిగిన ఈ మ్యాచ్‌ ఎంతో ఉత్కంఠభరితంగా సాగింది.

ఉత్కంఠభరితంగా సాగిన బెల్జియం, ఈజిప్ట్‌ల మ్యాచ్
Belgium vs Egypt

స్పోర్ట్స్ డెస్క్‌: ఫిఫా ప్రపంచకప్‌ 2026లో భాగంగా బెల్జియం, ఈజిప్ట్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌ 1-1తో డ్రాగా ముగిసింది. గ్రూప్‌- జీలో భాగంగా జరిగిన ఈ మ్యాచ్‌ ఎంతో ఉత్కంఠభరితంగా సాగింది. ఆట ప్రారంభమైనప్పటి నుంచే గోల్ కోసం ఇరుజట్లు తీవ్రంగా ప్రయత్నించాయి. అయితే 20వ నిమిషం వద్ద ఈజిప్ట్ ఆటగాడు ఇమామ్‌ అషోర్‌ గోల్‌ కొట్టడంతో ఆ జట్టు ఆధిక్యంలోకి వెళ్లింది. ఇమామ్ కు ఇది తొలి అంతర్జాతీయ గోల్ కావడం విశేషం. తొలి అర్ధ భాగం ముగిసే వరకు కూడా ఈజిప్ట్ తమ ఆధిక్యాన్ని నిలుపుకుంది.


ఇక రెండో అర్ధ భాగంలో 66వ నిమిషం వద్ద బెల్జియం ఆటగాడు మహమ్మద్‌ హానీ కొట్టిన గోల్‌తో స్కోర్లు 1-1తో సమం అయ్యాయి. ఆ తర్వాత మరో గోల్‌ను ఏ జట్టూ సాధించకపోవడంతో మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్‌లో బెల్జియం 58 శాతం బంతిని తమ నియంత్రణలో ఉంచుకున్నప్పటికీ రెండో గోల్‌ను సాధించలేకపోయింది. గ్రూప్-జీలో బలమైన జట్టుగా ఉన్న బెల్జియం సులభంగా విజయం సాధిస్తుందని అంతా భావించారు. అయితే ఈజిప్ట్ గట్టి పోటీ ఇవ్వడంతో బెల్జియంకు విజయం దక్కలేదు.


2022 ఖతార్ ప్రపంచ కప్‌లో గ్రూప్ దశను దాటడంలో విఫలమైనప్పుడు కూడా బెల్జియంకు ఇదే పరిస్థితి ఎదురైంది. మరోవైపు సౌదీ అరేబియా, ఉరుగ్వే మధ్య మ్యాచ్‌ కూడా 1-1తో డ్రాగా ముగిసింది. అలానే ఇరాన్, న్యూజిలాండ్ మ్యాచ్ కూడా 2-2తో డ్రాగా ముగిసింది. మొత్తంగా మంగళవారం అర్ధ రాత్రి(జూన్ 16) నుంచి జరిగిన వరుస మూడు మ్యాచులు కూడా డ్రాగా ముగిశాయి.


ఇవి కూడా చదవండి:

ఇరాన్ అభిమానులకు షాకిచ్చిన అమెరికా కోర్టు

పసికూనల పంజా

Updated Date - Jun 16 , 2026 | 09:09 AM