Share News

సూపర్‌ ఓవర్‌లో ఝలక్‌

ABN , Publish Date - Jun 16 , 2026 | 04:44 AM

ఒక్క మ్యాచ్‌లో ఎన్ని మలుపులో! ఆద్యంతం హైడ్రామా నెలకొన్న భారత్‌ ‘ఎ’-శ్రీలంక ‘ఎ’ మ్యాచ్‌ అత్యంత ఆసక్తికరంగా ముగిసింది. మ్యాచ్‌ సూపర్‌ ఓవర్‌కు దారి తీయగా ఇందులో...

సూపర్‌ ఓవర్‌లో ఝలక్‌

భారత్‌ ‘ఎ’కు రెండో ఓటమి

శ్రీలంక ఉత్కంఠ విజయం

దంబుల్లా: ఒక్క మ్యాచ్‌లో ఎన్ని మలుపులో! ఆద్యంతం హైడ్రామా నెలకొన్న భారత్‌ ‘ఎ’-శ్రీలంక ‘ఎ’ మ్యాచ్‌ అత్యంత ఆసక్తికరంగా ముగిసింది. మ్యాచ్‌ సూపర్‌ ఓవర్‌కు దారి తీయగా ఇందులో శ్రీలంక గెలిచింది. దీంతో ఈ ముక్కోణపు సిరీస్‌లో భారత్‌కు రెండో ఓటమి ఎదురైంది. గత మ్యాచ్‌లో అఫ్ఘానిస్థాన్‌ చేతిలో ఓడిన సంగతి తెలిసిందే. ఇక, లంకతో పోరులో మొదట భారత్‌ 49.2 ఓవర్లలో 265 పరుగులకు ఆలౌటైంది. టాపార్డర్‌తో పాటు మిడిలార్డర్‌ విఫలమవడంతో జట్టు ఓ దశలో 143/7 స్కోరుతో నిలిచింది. ఈ స్థితిలో సూర్యాంశ్‌ (72), విప్రాజ్‌ (51) ఎనిమిదో వికెట్‌కు 104 రన్స్‌ జోడించడంతో భారత్‌ కోలుకుంది. విజయకాంత్‌, షిరాజ్‌కు మూడేసి వికెట్లు దక్కాయి. అయితే విప్రాజ్‌ రెండుసార్లు పిచ్‌ మధ్యలో నుంచి పరిగెత్తడంతో భారత్‌కు 10 రన్స్‌ పెనాల్టీ విధించడం తీవ్ర ప్రభావమే చూపింది. దీంతో లంక తమ ఛేదనను 10/0తో ఆరంభించింది. మొత్తంగా 50 ఓవర్లలో లంక కూడా 265/9 స్కోరే చేయడంతో మ్యాచ్‌ టైగా ముగిసింది. సమరవిక్రమ (93), డిక్‌వెల్లా (37) రాణించారు. బదోనికి 2 వికెట్లు దక్కాయి.

7-Sports.jpg

హైడ్రామా.. ఫైట్‌

సూపర్‌ ఓవర్‌కు ముందు మైదానంలో నాటకీయ పరిస్థితి నెలకొంది. ఓవైపు వెలుతురు మందగిస్తుండగా.. భారత్‌ కెప్టెన్‌ తిలక్‌ వర్మ సూపర్‌ ఓవర్‌ కోసం అంపైర్‌ను సంప్రదించాడు. కొంత సమయం తీసుకున్నాక ఇరుజట్ల కెప్టెన్ల అంగీకారంతో శ్రీలంక మొదట బ్యాటింగ్‌కు దిగింది. పేసర్‌ అర్షద్‌ ఓవర్‌లో లంక 6 బంతుల్లో 16 పరుగులు చేసింది. దీంట్లో చివరి బంతి నోబ్‌ కాగా.. థర్డ్‌ అంపైర్‌ నిర్ణయం రాకముందే భారత ఫీల్డర్లు మైదానం వీడి తమ బ్యాటింగ్‌ కోసం సిద్ధమయ్యారు. కానీ అటు ఫీల్డ్‌ అంపైర్‌ మాత్రం మరో బాల్‌ కోసం తిరిగి అందరినీ రమ్మనడంతో తిలక్‌ మరోసారి అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు. అనంతరం ఛేదనలో సూర్యాంశ్‌, వైభవ్‌ సూర్యవంశీ బరిలోకి దిగినా 9 పరుగులే చేసి ఓడింది. అయితే క్రీజును వీడుతున్న సమయంలో వైభవ్‌, శ్రీలంక ఆటగాడి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఓ దశలో వైభవ్‌ అతడిని తోసేయడంతో లంక ఆటగాళ్లు ఇద్దరినీ విడదీయడం కనిపించింది. డగౌట్‌ వైపు వెళుతున్న సమయంలోనూ వైభవ్‌ వెనక్కి చూస్తూ కోపంగా మాట్లాడడం కనిపించింది.

ఇవి కూడా చదవండి:

ముక్కోణపు సిరీస్: సూపర్ ఓవర్‌లో శ్రీలంక-ఎ విజయం

దోహా డైమండ్ లీగ్: కమ్‌బ్యాక్ ఇవ్వనున్న నీరజ్ చోప్రా

Updated Date - Jun 16 , 2026 | 04:44 AM