పసికూనల పంజా
ABN , Publish Date - Jun 16 , 2026 | 04:47 AM
కాబో వెర్డే.. ఈ పేరుతో ఓ దేశం ఉందనే విషయం కూడా చాలా మందికి తెలీదేమో. కానీ తమ అద్వితీయ ప్రదర్శనతో ఫిఫా వరల్డ్‌క్‌పలో అతిపెద్ద సంచలనం నమోదు చేసింది. ఈసారి...
ఫిఫా కప్ మ్యాచ్‌లు
ఫ్రాన్స్ Xసెనెగల్
(అర్ధరాత్రి 12.30)
ఇరాక్ X నార్వే
(బుధవారం తెల్లవారుజాము 3.30)
అర్జెంటీనా X అల్జీరియా
(బుధవారం ఉదయం 6.30)
అట్లాంటా: కాబో వెర్డే.. ఈ పేరుతో ఓ దేశం ఉందనే విషయం కూడా చాలా మందికి తెలీదేమో. కానీ తమ అద్వితీయ ప్రదర్శనతో ఫిఫా వరల్డ్‌క్‌పలో అతిపెద్ద సంచలనం నమోదు చేసింది. ఈసారి కచ్చితంగా టైటిల్ కొట్టగలదనే అంచనాలతో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన స్పెయిన్‌ను పసికూన కాబో వెర్డే ఒక్క గోల్ కూడా చేయకుండా అడ్డుకోగలిగింది. ఈ మెగా టోర్నీలో మొదటిసారి బరిలోకి దిగినప్పటికీ పటిష్ట డిఫెన్స్‌తో స్పెయిన్‌ను వణికించింది. ఇక తమ గోల్ పోస్ట్‌పై స్పెయిన్ ఆటగాళ్లు పదేపదే దాడులు చేసినా 40 ఏళ్ల కాబో వెర్డే గోల్ కీపర్ వోజిన్హా అడ్డుగోడలా నిలిచాడు. దీంతో సోమవారం జరిగిన ఈ గ్రూప్-హెచ్ మ్యాచ్ 0-0తో డ్రా అయ్యింది. 2010 తర్వాత ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లో స్పెయిన్ గోల్ చేయలేకపోవడం గమనార్హం. మ్యాచ్ ఆరంభంలోనే బాక్స్ బయట నుంచి పెడ్రి (స్పెయిన్) కుడి కాలితో కొట్టిన షాట్‌ను ప్రత్యర్థి గోల్‌కీపర్ వోజిన్హా వమ్ము చేశాడు. ఆ తర్వాత కూడా ఫాబియాన్ రూజ్ షాట్ గోల్ పోస్ట్ ఎడమ వైపునకు వెళ్లింది. అటు కాబో వెర్డే ఆటగాళ్లు కూడా పలుమార్లు గోల్ ప్రయత్నాలు చేసినా స్పెయిన్ డిఫెన్స్ సమర్థవంతంగా అడ్డుకుంది. 40వ నిమిషంలో కుకురెల్లా హెడ్ పాస్‌ను గోల్ పోస్ట్‌కు అతి సమీపంలో అందుకున్న ఫెర్రాన్ టోరెస్ సువర్ణావకాశాన్ని చేజార్చాడు. అతడి షాట్ బార్‌ను తాకుకుంటూ వెళ్లింది. ఇలా గోల్ కోసం స్పెయిన్ ఎన్ని దాడులు చేసినా కాబో వెర్డే కీపర్ అడ్డుకోగలిగాడు. దీంతో 2024 అక్టోబరు తర్వాత స్పెయిన్ తమ ఫస్ట్ హాఫ్‌ను గోల్ లేకుండానే ముగించింది. బ్రేక్ తర్వాత కూడా స్పెయిన్ పదేపదే ప్రత్యర్థి గోల్ పోస్ట్‌పై ఎదురుదాడికి దిగింది. స్వల్ప వ్యవధిలోనే మైకేల్, ఫాబియాన్ అతి సమీపం నుంచి చేసిన ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి. 89వ నిమిషంలో మిడ్‌ఫీల్డర్ కెవిన్ పినా (కాబో వెర్డే) అవుట్‌సైడ్ బాక్స్ నుంచి ఆడిన షాట్‌ను స్పెయిన్ నిలువరించింది. అదనపు సమయంలోనూ డినే బోర్గెస్ హెడర్‌ను స్పెయిన్ కీపర్ సైమన్ అడ్డుకున్నాడు. దీంతో నిర్ణీత సమయంలోగా ఒక్క గోల్ లేకుండానే మ్యాచ్ ముగిసింది.
నెదర్లాండ్స్‌ను నిలువరించిన జపాన్
ఆర్లింగ్టన్ (యూఎస్): ఓటమి తప్పదనుకొన్న తరుణంలో.. దైచీ కమడా లేటు గోల్‌తో.. బలమైన నెదర్లాండ్స్‌ను జపాన్ నిలువరించింది. గ్రూప్-ఎ్‌ఫలో సోమవారం నెదర్లాండ్స్-జపాన్ మధ్య హోరాహోరీగా సాగిన మ్యాచ్ 2-2తో డ్రాగా ముగిసింది. డచ్ తరఫున విర్గిల్ (50వ), విల్లే (64వ) చెరో గోల్ చేయగా.. జపాన్ ప్లేయర్లు కీటో నకమురా (57వ), దైచీ కమడా (88వ) గోల్స్ సాధించారు. వరల్డ్ నెం. 8 నెదర్లాండ్స్‌తో పోల్చితే జపాన్ బలహీన జట్టయినా.. అనూహ్య పోరాటంతో ఓటమిని తప్పించుకొంది.
యాసిన్ డబుల్ ధమాకా..
మాంటెర్రీ (మెక్సికో): యాసిన్ అయారి డబుల్ గోల్స్‌తో.. స్వీడన్ ఘనంగా బోణీ చేసింది. గ్రూప్-ఎ్‌ఫలో జరిగిన మ్యాచ్‌లో స్వీడన్ 5-1తో ట్యునీషియాను చిత్తు చేసింది. స్వీడన్ జట్టులో మిడ్‌ఫీల్డర్ యాసిన్ అయారి (7వ, 90+6వ నిమిషం) 2 గోల్స్‌తో విజృంభించగా, అలెగ్జాండర్ ఇసాక్ (30వ), విక్టర్ గయోకెరెస్ (59వ), మాథియాస్ స్వాన్‌బర్గ్ (84వ) తలో గోల్ చేశారు. ట్యునీషియా ఏకైక గోల్‌ను ఒమర్ రికిక్ (43వ) సాధించాడు.
ఆఖర్లో గోల్.. ఐవరీ కోస్ట్ అదుర్స్
ఫిలడెల్ఫియా (యూఎస్): ఆఖరి నిమిషంలో అమడ్ డయల్లో గోల్‌తో.. ఐవరీ కోస్ట్ గెలిచింది. గ్రూప్-ఈలో జరిగిన మ్యాచ్‌లో ఐవరీ కోస్ట్ 1-0తో ఈక్వెడార్‌పై నెగ్గింది. మ్యాచ్ గోల్‌లెస్ డ్రాగా సాగుతున్న తరుణంలో.. ప్రత్యర్థి పెనాల్టీ ఏరియాలో పాస్‌ను అందుకొన్న అమడ్ నేరుగా గోల్ చేసి తన జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు.
శభాష్.. జపాన్ ఫ్యాన్స్..
ఫిఫా ప్రపంచకప్‌లో నెదర్లాండ్స్‌తో జపాన్ మ్యాచ్ ముగిసిన తర్వాత స్టేడియంలో జపాన్ అభిమానులు వ్యవహరించిన తీరు అందరినీ ఆకట్టుకొంది. స్టాండ్స్‌లో వేసిన చెత్తను వారు శుభ్రం చేసి తమ ప్రత్యేకతను చాటారు. ఇందులో ఓ దివ్యాంగుడు కూడా పాల్గొనడం నెట్‌లో వైరల్ అయింది.
‘స్నికో’ వాడి..
క్రికెట్‌లో బంతిని బ్యాట్ ఎడ్జ్‌కు తాకిందా? లేదా? అని స్నికో మీటర్‌ను ఉపయోగించి నిర్ధారిస్తారు. ఇదే తరహాలోనే ట్యునీషియాతో మ్యాచ్‌లో స్వీడన్ గోల్‌ను రివ్యూ చేశారు. 84వ నిమిషంలో మాథియాస్ స్వాన్‌బర్గ్ గోల్ చేశాడు. కానీ, అసిస్టెంట్ రెఫరీ ఆఫ్‌సైడ్‌గా ప్రకటించడంతో.. స్వీడన్ నిరసన వ్యక్తం చేసింది. బంతి మరో ప్లేయర్ అలెగ్జాండర్ ఇసాక్‌కు తగిలి స్వాన్‌బర్గ్‌కు చేరుకొందని వాదించారు. దీంతో స్నికో తరహాలో పనిచేసే బాల్ కాంటాక్ట్ టెక్నాలజీతో రివ్యూ చేశారు. ఇసాక్‌ను దాటినప్పుడు స్పైక్స్ రావడంతో స్వీడన్‌కు గోల్ ఇచ్చారు.
‘విద్వేష సంజ్ఞ’ కలకలం
జర్మనీ-కురసావో మ్యాచ్‌సందర్భంగా ఓ వీడియో అనలిస్ట్ శ్వేత ఆధిపత్యవాద సంజ్ఞను ప్రదర్శించడం వివాదాస్పదమైంది. ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఈ మ్యాచ్‌కు ముందు వీడియో అనలిస్ట్ బృందాన్ని అధికారిక బ్రాడ్‌కాస్ట్ టీవీలో చూపించారు. ఆ సమయంలో ఆస్ట్రేలియాకు చెందిన ఓ వీడియో అనలిస్ట్ షాన్ ఇవాన్స్ తన కుడి చేతితో ‘ఓకే’ అనే సంకేతాన్ని చూపించాడు. ఇది విద్వేషాన్ని సూచించే సంకేతంగా వస్తుందన్న ఆరోపణతో అతడిపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ ఎక్కువైంది. దీంతో అతడిని బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్టు ఫిఫా తెలిపింది.
ఇవి కూడా చదవండి:
ముక్కోణపు సిరీస్: సూపర్ ఓవర్‌లో శ్రీలంక-ఎ విజయం
దోహా డైమండ్ లీగ్: కమ్‌బ్యాక్ ఇవ్వనున్న నీరజ్ చోప్రా