కివీస్‌ను భయపెడుతున్న వైభవ్.. శాంట్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు
ABN , Publish Date - Oct 22 , 2026 | 06:46 AM
న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా ఇవాళ్టి నుంచి భారత్, కివీస్ జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌కు ముందు భారత యువ బ్యాటర్, వైభవ్ సూర్యవంశీపై న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల వెస్టిండీస్, భారత్ మధ్య టీ20 సిరీస్ ముగిసింది. తాజాగా టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా ఇవాళ్టి(గురువారం)నుంచి ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ లో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో స్థానం దక్కలేదు. అయినప్పటికీ అతడిపై న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో అవకాశం దక్కితే అతడిని అడ్డుకోవడం తమ బౌలర్లకు పెద్ద సవాలు అని.. అందుకే వైభవ్ కోసం ప్రత్యేక వ్యూహాలు సిద్ధం చేశామని తెలిపాడు.
తొలి టీ20 మ్యాచ్‌కు ముందు మీడియా సమావేశంలో శాంట్నర్ మాట్లాడుతూ.. 'ఐపీఎల్‌లో వైభవ్ సూర్యవంశీ ఎంతటి విధ్వంసకర బ్యాటింగ్ చేశాడో అందరం చూశాం. అలానే వైభవ్ ఎంత డేంజర్ ఆటగాడో కూడా మాకు తెలుసు. ప్రస్తుతం టీమిండియాలో ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, సంజు శాంసన్ అద్భుతంగా రాణిస్తున్నారు. అయినా ఒకవేళ వైభవ్‌కు ఈ సిరీస్‌లో ఆడే అవకాశం లభిస్తే.. అతడి దూకుడును అడ్డుకోవడం కోసం ప్రత్యేక ప్రణాళికలను సిద్ధం చేశాం' అని శాంట్నర్ పేర్కొన్నాడు. భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో అవకాశం లభించడం కష్టమని చెప్పినప్పటికీ.. న్యూజిలాండ్ బోర్డు మాత్రం సూర్యవంశీపై దృష్టి సారించడం గమనార్హం.
ఇక న్యూజిలాండ్‌లోని మైదానాలు, అక్కడి వాతావరణంపై కూడా శాంట్నర్ పలు వ్యాఖ్యలు చేశాడు. వాతావరణ పరిస్థితుల ఆధారంగా ఈ సిరీస్‌లో బౌలర్ల ఆధిపత్యం పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాడు. ముఖ్యంగా మొదటి మ్యాచ్‌లో పిచ్, తేమ ప్రభావం బౌలర్లకు అనుకూలంగా మారుతుందని, అయితే తర్వాతి మ్యాచ్‌లకు పిచ్‌లు బ్యాటర్లకు కలిసిరావచ్చని శాంట్నర్ వివరించారు. ఇవాళ(గురువారం)క్రైస్ట్‌చర్చ్ వేదికగా ఇరు జట్ల మధ్య తొలి టీ20 జరగనుంది.
ఇవి కూడా చదవండి:
మూడు ఫార్మాట్లలో ఆడుతా.. నాపై ఆ ముద్ర వేయకండి: ప్రియాంశ్ ఆర్య
ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి అమిత్ మిశ్రా.. గంగూలీ, యువీలతో పాటు..!