‘థ్యాంక్యూ హెడీ’.. హెడ్ వీడ్కోలుపై అభిషేక్ శర్మ భావోద్వేగ పోస్ట్
ABN , Publish Date - Nov 18 , 2026 | 07:51 AM
వచ్చే నెలలో ఐపీఎల్ వేలం నేపథ్యంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ .. తమ స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్‌ను వదులుకుంది. ఎస్ఆర్హెచ్ నుంచి హెడ్ వైదొలగడంపై మరో ఓపెనర్ అభిషేక్ శర్మ స్పందించాడు. హెడ్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు
స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత విధ్వంసక ఓపెనింగ్ జోడీల్లో ఒకటైన 'ట్రావిషేక్' (ట్రావిస్ హెడ్ – అభిషేక్ శర్మ) ప్రస్థానానికి తెరపడింది. 2027 ఐపీఎల్ సీజన్ నుంచి తప్పుకుంటున్నట్లు ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు, తన కుటుంబానికి తగిన సమయం కేటాయించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు హెడ్ స్పష్టం చేశాడు. ఈ నేపథ్యంలో మంగళవారం (నవంబర్ 17) విడుదల చేసిన రిటెన్షన్ జాబితాలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) హెడ్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.
హెడ్ నిష్క్రమణపై అతని ఓపెనింగ్ భాగస్వామి టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ భావోద్వేగానికి గురయ్యాడు. తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో 'ప్రతిదానికీ ధన్యవాదాలు హెడీ' అంటూ అభిషేక్ శర్మ ఆత్మీయ వీడ్కోలు పలికాడు.హెడ్‌తో కలిసి బ్యాటింగ్ చేస్తూ అభిషేక్ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. మరోవైపు, సన్‌రైజర్స్‌తో మూడేళ్ల ప్రయాణం ఎప్పటికీ మరపురానిదని హెడ్ పేర్కొన్నాడు. తనకు అన్నివేళల మద్దతుగా నిలిచిన ఎస్ఆర్హెచ్ కుటుంబానికి హెడ్ కృతజ్ఞతలు తెలిపాడు.
గత మూడు సీజన్లలో (2024–26) వీరిద్దరూ సన్‌రైజర్స్ హైదరబాద్ తరఫున 42 ఇన్నింగ్స్‌ల్లో 46.14 సగటుతో 1,892 పరుగులు జోడించారు. ఇందులో 6 సెంచరీ, 9 అర్ధ సెంచరీల భాగస్వామ్యాలు ఉన్నాయి. శిఖర్ ధావన్ – డేవిడ్ వార్నర్ తర్వాత సన్‌రైజర్స్ తరఫున అత్యధిక పరుగులు చేసిన రెండో ఓపెనింగ్ జోడీగా వీరు నిలిచారు. అంతేకాకుండా, ఐపీఎల్ చరిత్రలో వెయ్యికి పైగా పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన జోడీల్లో ఓవర్‌కు 12.46 రన్‌రేట్‌తో వీరు అగ్రస్థానంలో నిలవడం విశేషం.
హెడ్‌ను రూ.14 కోట్లకు రిటైన్ చేసుకున్న సన్‌రైజర్స్, ఇప్పుడు అతని నిష్క్రమణతో ఆ మొత్తాన్ని తిరిగి తన ఖాతాలో జమ చేసుకుంది. మొత్తంగా రూ.40.15 కోట్ల పర్స్ విలువతో డిసెంబర్ 16న గోవాలో జరగనున్న ఐపీఎల్ 2027 మినీ వేలంలోకి సన్‌రైజర్స్ అడుగుపెట్టనుంది. వేలంలో అభిషేక్ శర్మకు సరైన విదేశీ ఓపెనింగ్ జోడీని వెతకడం ఇప్పుడు హైదరాబాద్ ఫ్రాంచైజీ ముందున్న అతిపెద్ద సవాలు.
ఈ వార్తలనూ చదవండి:
వీఐపీల కోసం సింహాన్ని బైక్‌లతో తరిమిన పార్క్ సిబ్బంది.. వీడియో వైరల్
జంగిల్ సఫారీలో పర్యాటకులకు షాక్.. దూసుకొచ్చిన పెద్దపులి!