Share News

డబ్ల్యూటీసీ చరిత్రలో దక్షిణాఫ్రికా సంచలనం.. ఆసీస్‌కు తొలిసారి ఫాలో ఆన్!

ABN , Publish Date - Oct 22 , 2026 | 07:37 AM

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో సౌతాఫ్రికా జట్టు చరిత్ర సృష్టించింది. డబ్ల్యూటీసీ చరిత్రలో ఆస్ట్రేలియాను ఫాలో ఆన్ ఆడించిన తొలి జట్టుగా ప్రొటీస్ నిలిచింది. ఇప్పటి వరకు ఏ జట్టు కంగారు జట్టును ఫాలోఆన్ ఆడించలేదు.

డబ్ల్యూటీసీ చరిత్రలో దక్షిణాఫ్రికా సంచలనం.. ఆసీస్‌కు తొలిసారి ఫాలో ఆన్!
Australia Follow On

స్పోర్ట్స్ డెస్క్: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ లో సౌతాఫ్రికా జట్టు చరిత్ర సృష్టించింది. డబ్ల్యూటీసీ చరిత్రలో ఆస్ట్రేలియాను ఫాలో ఆన్ ఆడించిన తొలి జట్టుగా ప్రొటీస్ నిలిచింది. ఇప్పటి వరకు ఏ జట్టు కంగారు జట్టును ఫాలో ఆన్ ఆడించలేదు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో దక్షిణాఫ్రికా జట్టు ఈ ఘనత సాధించింది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ ముగిసే సరికి 326 పరుగులు వెనుకజంలో ఉంది.


ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో సౌతాఫ్రికా జట్టు అదరగొడుతోంది. తొలుత ఆసీస్ బౌలర్ల ధాటికి ఒక దశలో పీకల్లోతు కష్టాల్లో పడిన ప్రొటీస్ జట్టు.. కెప్టెన్ టెంబా బావుమా అసాధారణ పోరాటం చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 110 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న బావుమా (179)అద్భుత శతకంతో ఆదుకున్నాడు. అతనికి తోడుగా ఆల్ రౌండర్ మార్కో జాన్సెన్ (85), సైమన్ హార్మర్ (82) రాణించారు. దీంతో సౌతాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్‌ను 425/9 పరుగుల భారీ స్కోరు వద్ద డిక్లేర్ చేసింది.


సౌతాఫ్రికా స్టార్ పేసర్ కగిసో రబాడ తన రీఎంట్రీతో ఆసీస్ బ్యాటింగ్ ఆర్డర్‌ను దెబ్బకొట్టాడు. నిక్ మాడిసన్‌ను త్వరగానే పెవిలియన్‌కు పంపి ఇన్నింగ్స్‌కు బలమైన ఆరంభాన్నిచ్చాడు. స్టీవ్ స్మిత్(28) మినహా మిగతా బ్యాటర్లంతా విఫలమయ్యారు. ఆసీస్ జట్టులో ఆరుగురు బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమవడం గమనార్హం. బ్యాట్‌తో రాణించిన మార్కో జాన్సెన్ బౌలింగ్‌లోనూ చెలరేగి 5 వికెట్ల ఘనత సాధించాడు. వియాన్ ముల్డర్, రబాడ తలో రెండు వికెట్లు పడగొట్టడంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 99 పరుగులకే కుప్పకూలింది. 326 పరుగుల ఆధిక్యం సాధించిన ప్రొటీస్ జట్టు.. ఆసీస్‌కు ఫాలో ఆన్ రుచి చూపించింది. డబ్ల్యూటీసీ చరిత్రలో ఆస్ట్రేలియా ఫాలో ఆన్ ఆడటం ఇదే తొలిసారి కావడం గమనార్హం.


ఇవి కూడా చదవండి:

అయ్యర్‌కు కివీస్‌ సవాల్‌

కివీస్‌ను భయపెడుతున్న వైభవ్.. శాంట్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి అమిత్ మిశ్రా.. గంగూలీ, యువీలతో పాటు..!

Updated Date - Oct 22 , 2026 | 08:14 AM