Share News

దుమ్మురేపిన అథ్లెట్లు

ABN , Publish Date - Oct 22 , 2026 | 06:32 AM

పారా ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్లు అదరగొడుతున్నారు. బుధవారంనాటి పోటీలలో ఐదు పసిడి పతకాలు కొల్లగొట్టారు. మూడు ఆసియాడ్‌ రికార్డులతో భళా అనిపించారు. మూడో రోజు పోటీల్లో మొత్తం 27 పతకాలతో...

దుమ్మురేపిన అథ్లెట్లు

పారా ఆసియా క్రీడలు

  • ఐదు స్వర్ణాలతో అదుర్స్‌

  • సిమ్రన్‌ స్ర్పింట్‌ డబుల్‌

  • మూడో రోజు 27 పతకాలు

నగోయ: పారా ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్లు అదరగొడుతున్నారు. బుధవారంనాటి పోటీలలో ఐదు పసిడి పతకాలు కొల్లగొట్టారు. మూడు ఆసియాడ్‌ రికార్డులతో భళా అనిపించారు. మూడో రోజు పోటీల్లో మొత్తం 27 పతకాలతో మన అథ్లెట్లు దుమ్ము రేపారు. ఇందులో ట్రాక్‌, ఫీల్డ్‌ విభాగంనుంచే 22 మెడల్స్‌ లభించడం విశేషం. ఇక..ఓవరాల్‌గా 62 పతకాలతో భారత్‌ ఐదో స్థానంలో నిలిచింది. స్ర్పింటర్‌ సిమ్రన్‌ శర్మ, హైజంపర్‌ ప్రవీణ్‌ కుమార్‌, షాట్‌పుటర్‌ సచిన్‌ ఖిలారీ పారా ఆసియాడ్‌ సరికొత్త రికార్డుతో స్వర్ణ పతకాలు సొంతం చేసుకున్నారు. ఆయుష్‌ వర్మ, దిలీప్‌ గవిట్‌ కూడా పసిడి పతకాలు దక్కించుకున్నారు. ఆర్చరీ, స్విమ్మింగ్‌, పవర్‌లిఫ్టింగ్‌లోనూ పతకాలు లభించాయి.

సిమ్రన్‌ డబుల్‌ గోల్డ్‌ : మహిళల స్టార్‌ స్ర్పింటర్‌ సిమ్రన్‌ 24 గంటల వ్యవధిలో 100, 200 మీ. పరుగులో.. అది కూడా రికార్డు టైమింగ్‌లతో స్వర్ణాలు చేజిక్కించుకొని డబుల్‌ ధమాకా సృష్టించింది. బుధవారం 100మీ. స్ర్పింట్‌ టీ12 విభాగంలో సిమ్రన్‌ శర్మ 12.02 సె. కొత్త ఆసియా క్రీడల టైమింగ్‌తో బంగారు పతకం అందుకుంది. ఇక.. మంగళవారం 200 మీ. పరుగులోనూ సిమ్రన్‌ రికార్డు ప్రదర్శనతో పసిడి పతకం గెలుపొందింది. పురుషుల హైజంప్‌ టీ44/64 విభాగంలో ప్రవీణ్‌ కుమార్‌ (2.05 మీ.) క్రీడల రికార్డుతో స్వర్ణం అందుకున్నాడు. భారత్‌కే చెందిన బంటి (1.92మీ.) వ్యక్తిగత అత్యుత్తమ దూరంతో రజతం గెలుపొందాడు.


షాట్‌పుట్‌లో క్లీన్‌స్వీప్: పురుషుల షాట్‌పుట్‌ ఎఫ్‌46లో సచిన్‌ ఖిలారీ (15.87మీ.) క్రీడల రికార్డుతో పసిడి పతకం అందుకున్నాడు. భారత్‌కే చెందిన మహ్మద్‌ యాసిర్‌ (15.06మీ.) రజతం, ప్రవీణ్‌ (14.94మీ.) కాంస్యం సొంతం చేసుకోవడంతో..మూడు పతకాలూ మనకే లభించాయి. పురుషుల 100 మీ. టీ 46/47 పరుగులో దిలీప్‌ గవిట్‌ (10.69సె.) స్వర్ణం గెలుపొందాడు. భారత్‌కే చెందిన మహ్మద్‌ బాసిల్‌ టీ 47 (10.72సె.) విభాగంలో రికార్డు టైమింగ్‌తో రజతం దక్కించుకున్నాడు. పురుషుల షాట్‌పుట్‌ ఎఫ్‌ 53 విభాగంలో ఆయుష్‌ వర్మ (8.16 మీ.) దూరంతో స్వర్ణం గెలిచాడు. మహిళల 100 మీ. టీ35 పరుగులో ప్రీతీపాల్‌ (13.98సె.) రజతం అందుకుంది. 26 ఏళ్ల ప్రీతి మంగళవారంనాడు మహిళల 200మీ. టీ35 పరుగులో (29.53 సె.)నూ రజత పతకం గెలుపొందింది. మహిళల షాట్‌పుట్‌ ఎఫ్‌34 కేటగిరీలో భాగ్యశ్రీ జాదవ్‌ (8.19మీ.) వ్యక్తిగత అత్యుత్తమ దూరం గుండును విసిరి రజతం దక్కించుకుంది. పురుషుల జావెలిన్‌ త్రో ఎఫ్‌13 విభాగంలో మంజీత్‌ వ్యాస్‌ (61.03మీ.) వ్యక్తిగత అత్యుత్తమ దూరంతో రజత పతకం తన ఖాతాలో వేసుకున్నాడు. పురుషుల 100 మీ. టీ35 పరుగులో అనుభవ్‌ చౌధరి (12.72సె.) వ్యక్తిగత అత్యుత్తమ టైమింగ్‌తో కాంస్యం నెగ్గాడు. పురుషుల 100 మీ. టీ37లో రాకేష్‌ భాయ్‌ (11.50సె.) వ్యక్తిగత అత్యుత్తమ సమయంతో కాంస్యం అందుకున్నాడు. పురుషుల 1500మీ.టీ12 రేసులో శరత్‌ మహంకాళి (4:11.01) రజత పతకం సాధించాడు. వాస్తవంగా..శరత్‌కు కాంస్యం లభించింది. ఫక్రుద్దీన్‌ (ఉజ్బెకిస్థాన్‌), నబీల్‌ (జోర్డాన్‌) స్వర్ణ, రజతాలు కైవసం చేసుకున్నారు. కానీ ఫక్రుద్దీన్‌ డిస్‌క్వాలిఫై కావడంతో నబీల్‌కు పసిడి పతకం దక్కింది. శరత్‌కు రజతం కేటాయించారు.

శీతల్‌, పాయల్‌ జోడీకి రజతం: ఆర్చరీ మహిళల కాంపౌండ్‌ డబుల్స్‌ విభాగం ఫైనల్లో శీతల్‌/పాయల్‌ జోడీ 141-150తో చైనా జంట చేతిలో ఓడి రజతంతో సరిపెట్టుకుంది. పురుషుల స్విమ్మింగ్‌ బ్రెస్ట్‌స్ట్రోక్‌ ఎస్‌బీ13 విభాగంలో హిమాన్షు నందల్‌ (1:10.10) కాంస్యం నెగ్గాడు. ఈ క్రీడల్లో 22 ఏళ్ల హిమాన్షుకిది రెండో కాంస్య పతకం. మంగళవారం అతడు 400 మీ. ఫ్రీస్టయిల్‌ ఎస్‌11కేటగిరీలో కాంస్యం సొంతం చేసుకున్నాడు. పవర్‌లిఫ్టింగ్‌ మహిళల 67కి. విభాగంలో కస్తూరీ రాజమణి (108కి.) రజతం సొంతం చేసుకుంది. కాగా..తొలి రోజు మొత్తం 11 పతకాలు సాధించిన భారత క్రీడాకారులు మంగళవారం మరో 24 మెడల్స్‌ సాధించారు. ఇక మూడోరోజు 27 పతకాలు సాధించిన పతకాల పంట పండించారు.


కార్తీక్‌ డబుల్‌ ధమాకా

ఆసియా పారా క్రీడల్లో మంగళ, బుధవారం జరిగిన పోటీల్లో తెలుగు క్రీడాకారులు నాలుగు పతకాలు సాఽధించారు. ఆంధ్రప్రదేశ్‌ స్విమ్మర్‌ బుడిగిన రవి కార్తీక్‌ (ఏలూరు) ఈ ఆసియా క్రీడల్లో రెండో పతకం సొంతం చేసుకొని సంచలనం సృష్టించాడు. ఎస్‌13 విభాగం 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో కార్తీక్‌ 1 నిమిషం 10.10 సెకన్లలో గమ్యాన్ని చేరి, ద్వితీయ స్థానంలో నిలిచాడు. అనకాపల్లికి చెందిన రంగోలి రవి కాంస్యంతో సత్తా చాటాడు. ఎఫ్‌40 విభాగం షాట్‌పుట్‌లో రవి 10.02 మీటర్ల దూరం ఇనుపగుండును విసిరి, తృతీయ స్థానం సాధించాడు. బానోతు అకీరానందన్‌ (మహబూబాబాద్‌ జిల్లా నర్సంపేట) రజతం కైవసం చేసుకున్నాడు. టీ38 విభాగం 400 మీ., పరుగును అకీర 51.25 సెకన్లలో పూర్తి చేసి, రెండో స్థానంలో నిలిచాడు. ఇక, మంగళవారం జరిగిన మహిళల టీ20 విభాగం 400 మీ., పరుగును జీవాంజి దీప్తి (వరంగల్‌) 56.36 సెకన్లలో పూర్తి చేసి, స్వర్ణంతో మెరిసింది.

ఈ వార్తలనూ చదవండి:

టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల.. భారత్ తొలి మ్యాచ్ ఎప్పుడంటే?

ఆర్‌ఎస్‌ఎస్‌పై రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు.. పిల్ల చేష్టలని కొట్టిపడేసిన బీజేపీ..

భారత్‌ను టార్గెట్ చేయాలనే ఉద్దేశం మాకు లేదు: అమెరికా విదేశాంగ మంత్రి

Updated Date - Oct 22 , 2026 | 06:47 AM