Share News

భారీ విజయం వేళ భారత్‌కు షాక్.. స్టార్ స్పిన్నర్‌కు గాయం!

ABN , Publish Date - Jun 18 , 2026 | 08:26 AM

మహిళల టీ20 ప్రపంచకప్‌ 2026లో భారత జట్టు అద్భుతమైన ప్రదర్శనతో దూసుకుపోయింది. నిన్న నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 95 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. విజయానందంలో ఉన్న టీమిండియాకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది.

భారీ విజయం వేళ భారత్‌కు షాక్.. స్టార్ స్పిన్నర్‌కు గాయం!
Shreyanka Patil injury

స్పోర్ట్స్ డెస్క్: మహిళల టీ20 ప్రపంచకప్‌ 2026లో భారత జట్టు అద్భుతమైన ప్రదర్శనతో దూసుకుపోయింది. తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై సూపర్ విక్టరీ సాధించిన భారత్.. నిన్న (బుధవారం) నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా 95 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. మ్యాచ్ గెలిచిన ఆనందంలో ఉన్న హర్మన్ ప్రీత్ కౌర్ జట్టుకు ఓ విషయం ఆందోళన కలిగిస్తుంది. టీమిండియా స్టార్ స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ గాయపడింది.


ఈ మ్యాచ్‌లో భారత ఆఫ్ స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ ఫీల్డింగ్ చేస్తూ చీలమండ గాయంతో మైదానాన్ని వీడటం భారత్‌ను ఆందోళనకు గురిచేసింది. నెదర్లాండ్స్ ఇన్నింగ్స్‌లో ఆరో ఓవర్ మొదటి బంతికి ఫీబీ మోల్కెన్‌బోర్ బంతిని లెగ్ సైడ్ వైపు నెట్టింది. ఫీల్డింగ్‌లో ఉన్న శ్రేయాంక అదనపు పరుగులు ఇవ్వకుండా బంతిని అందుకునే క్రమంలో జారిపడి పడింది. దీంతో శ్రేయాంక కుడి చీలమండ గాయమైంది. ఆమె నొప్పితో కాసేపు అల్లాడిపోయింది. దీంతో సహచర క్రీడాకారులు, వైద్య సిబ్బంది మైదానంలోనే ఆమెకు చికిత్స అందించారు. అనంతరం కూడా ఆమె ఆటను కొనసాగించలేకపోయింది.


కుడి కాలుపై బరువు మోయలేకపోవడంతో, ఆమెను స్ట్రెచర్‌పై బగ్గీలో మైదానం నుంచి బయటకు తీసుకువెళ్లారు. శ్రేయాంక త్వరగా కోలుకోవాలని తాము ఆకాంక్షిస్తున్నామని, తదుపరి సమాచారం కోసం ఎదురుచూస్తున్నామని బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. శ్రేయాంక నిష్క్రమించిన తర్వాత షఫాలీ వర్మ ఆ ఓవర్‌ను పూర్తి చేయగా.. అప్పటికే ఏకపక్షంగా సాగుతున్న నెదర్లాండ్స్‌తో భారత్ తమ మ్యాచ్‌ను కొనసాగించింది. గతంలో ఆసియా కప్ సమయంలో శ్రేయాంక వేలు విరిగింది. టోర్నమెంట్‌లోని కీలక దశలో ఈ ఎదురుదెబ్బ తగలడంతో టీమిండియా అభిమానులు ఆందోళన చెందుతున్నారు. భారత్ తన తదుపరి మ్యాచుల్లో బలమైన దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాలతో తలపడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో శ్రేయాంక గాయపడటంతో టీమిండియా అభిమానులు ఆందోళన చెందుతున్నారు.


మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 209 పరుగుల భారీ స్కోరు చేసింది. మహిళల టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే భారత్‌కు ఇది అత్యధిక స్కోరు కావడం విశేషం. ఆ తర్వాత 210 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ 17.3 ఓవర్లలో 114 పరుగులకే కుప్పకూలింది. భారత్ తన తదుపరి మ్యాచ్‌లో జూన్ 21న మాంచెస్టర్‌లో సౌతాఫ్రికాతో తలపడనుంది.


ఇవి కూడా చదవండి:

టీ20 ప్రపంచ కప్ 2026: పాకిస్థాన్‌ను ఓడించిన సౌతాఫ్రికా

మెస్సీ.. మెస్సీ.. మెస్సీ అంతా తానై..

Updated Date - Jun 18 , 2026 | 08:29 AM