Share News

జననాయగన్ విడుదలపై మూవీ యూనిట్‌ క్లారిటీ.. రిలీజ్ ఎప్పుడంటే..

ABN , Publish Date - Jun 18 , 2026 | 08:08 AM

తమిళనాడు ముఖ్యమంత్రి జోసఫ్ విజయ్ నటించిన ‘జననాయగన్’ సినిమా విడుదలపై మూవీ యూనిట్ క్లారిటీ ఇచ్చింది. సినిమా జూన్ 26వ తేదీన విడుదలయ్యే అవకాశం ఉందని వెల్లడించింది.

జననాయగన్ విడుదలపై మూవీ యూనిట్‌ క్లారిటీ.. రిలీజ్ ఎప్పుడంటే..
Jananayagan

చెన్నై, జూన్ 18: తమిళనాడు ముఖ్యమంత్రి జోసఫ్ విజయ్ నటించిన ‘జననాయగన్’ సినిమా విడుదలపై మూవీ యూనిట్ క్లారిటీ ఇచ్చింది. జూన్ 19వ తేదీ నాటికి సెన్సార్ సర్టిఫికేట్ లభించనుందని మూవీ యూనిట్‌ తెలిపింది. సినిమా జూన్ 26వ తేదీన విడుదలయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. కాగా, విజయ్ హీరోగా తెరకెక్కిన ‘జననాయగన్’ సినిమా 2026 జనవరి 9వ తేదీన సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండింది. సినిమా టీమ్ ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇలాంటి సమయంలో సెన్సార్ బోర్డు చిత్ర యూనిట్‌కు షాక్ ఇచ్చింది.


2025 డిసెంబర్ 18వ తేదీన ‘జననాయగన్’ సినిమా ఫస్ట్ కాపీని సెన్సార్ బోర్డు అనుమతి కోసం పంపారు. సినిమా చూసిన సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. ఈ మేరకు డిసెంబర్ 22వ తేదీన సినిమా టీమ్‌కు మెయిల్ పంపింది. కొన్ని మార్పులు కూడా సూచించింది. సినిమా టీమ్ మార్పులు చేసి మళ్లీ బోర్డుకు సినిమాను పంపింది. సెన్సార్ బోర్డు నుంచి అనుమతి రాలేదు. సినిమాపై ఫిర్యాదులు వచ్చాయని, దీన్ని రివైజింగ్ కమిటీకి రిఫర్ చేస్తున్నట్లు మెయిల్ వచ్చింది. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో టీమ్‌లో ఆందోళన మొదలైంది.


రివైజింగ్ కమిటీని సంప్రదించడానికి సమయం మించిపోవటం, అసలు ఫిర్యాదు చేసింది ఎవరో తెలియకపోవటంతో ‘జననాయగన్’ టీమ్ హైకోర్టును ఆశ్రయించింది. విచారణ జరిపిన కోర్టు సెన్సార్ పూర్తి చేయాలని బోర్డుకు ఆదేశాలు జారీ చేసింది. ఈ సమయంలోనే ఎన్నికలు రావటం, సినిమాలోని సీన్స్ లీక్ అవటం జరిగాయి. ‘జననాయగన్’ హీరో విజయ్ ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు. విజయ్ ముఖ్యమంత్రి అయినా సినిమా విడుదల ఆలస్యం అవుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో హీరో విజయ్ నిర్మాతలకు కీలక సూచనలు చేశారట.


డిస్ట్రిబ్యూటర్ల డబ్బులు తిరిగి ఇచ్చేయమని చెప్పారట. అంతేకాదు.. తన రెమ్యూనరేషన్ కూడా తిరిగి ఇచ్చేస్తానని అన్నారట. అయితే, సెన్సార్ సర్టిఫికేట్ రాగానే.. 26వ తేదీన సినిమా రిలీజ్ చేయాలని భావిస్తున్న నేపథ్యంలో డిస్ట్రిబ్యూటర్లకు డబ్బులు తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదని నిర్మాతలు భావిస్తున్నారు. ఒక వేళ సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ రాకపోతే.. జూన్ 22వ తేదీన డబ్బులు తిరిగి ఇవ్వాలని నిర్మాతలు డిసైడ్ అయ్యారు. నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లకు డబ్బులు తిరిగి ఇచ్చేస్తే.. విజయ్ తన రెమ్యూనరేషన్ మొత్తాన్ని నిర్మాతలకు తిరిగి ఇచ్చేయనున్నారు.


ఇవి కూడా చదవండి

కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరల వివరాలు..

టీ20 ప్రపంచ కప్ 2026: పాకిస్థాన్‌ను ఓడించిన సౌతాఫ్రికా

Updated Date - Jun 18 , 2026 | 08:32 AM