టీ20 ప్రపంచ కప్ 2026: పాకిస్థాన్‌ను ఓడించిన సౌతాఫ్రికా
ABN , Publish Date - Jun 18 , 2026 | 07:34 AM
మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో దక్షిణాఫ్రికా తొలి విజయం నమోదు చేసింది. తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి తర్వాత, పాకిస్థాన్‌తో జరిగిన ఉత్కంఠ సమరంలో 2 వికెట్ల తేడాతో గెలుపొందింది.
స్పోర్ట్స్ డెస్క్: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమిని చవిచూసిన సంగతి తెలిసిందే. నిన్న(బుధవారం) బర్మింగ్‌హామ్ వేదికగా జరిగిన మ్యాచ్ లో రెండు వికెట్ల తేడాతో ప్రొటీస్ జట్టు విజయం సాధించింది. గెలుపు కోసం చివరి వరకు పోరాడిన పాకిస్థాన్‌కు నిరాశే మిగిలింది. గత మ్యాచ్‌లో భారత్ చేతిలో ఘోరంగా ఓడిన పాకిస్థాన్.. ఈ మ్యాచ్‌లో గట్టి పోటీ ఇచ్చినప్పటికీ విజయం సాధించలేకపోయింది.
ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచిన పాకిస్థాన్ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి126 పరుగులు చేసింది. పాక్ కెప్టెన్ ఫాతిమా సనా(55 *) అర్ధ సెంచరీతో రాణించింది. తుబా హస్సన్ 23 పరుగులతో ఫర్వాలేదనిపించింది. వీరిద్దరూ తొమ్మిదో వికెట్‌కు 71 పరుగులు జోడించడంతో పాక్ మాత్రం స్కోరైనా చేయగలిగింది. సనా, తుబాతో పాటు ఇరామ్ జావెద్ (11), ఆలియా రియాజ్ (10) మాత్రమే రెండంకెల స్కోర్ సాధించారు. మిగతా ప్లేయర్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. సౌతాఫ్రికా బౌలర్లలో కాప్ 3, షబ్నిమ్ ఇస్మాయిల్, ఖాకా తలో వికెట్ తీశారు.
అనంతరం ఛేదనలో సౌతాఫ్రికా 16.5 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ప్రొటీస్ బ్యాటర్లలో డెర్క్‌సెన్ (52) మెరుపు అర్ద సెంచరీతో ఆ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. అలానే నదినే డి క్లెర్క్ (37) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడింది. పాక్ బౌలర్లలో ఫాతిమా సనా మూడు వికెట్లు తీసి.. సౌతాఫ్రికా శిబిరంలో టెన్షన్ పుట్టించింది. సనాకు సదియా ఇక్బాల్ (2 వికెట్లు), తుబా హస్సన్ (2వికెట్లు), నష్రా సంధు (ఒక వికెట్) కూడా తోడవ్వడంతో సౌతాఫ్రికా ఓ దశలో ఓటమి దిశగా సాగింది. ఒకానొక సమయంలో దక్షిణాఫ్రికా ఓడిపోతుందేమో అనే సందేహం ప్రేక్షకులకు కలిగింది. అయితే డెర్క్‌సెన్, క్లెర్క్.. పాక్ బౌలర్లను సమర్ధవంతగా ఎదురుకుంటూ సౌతాఫ్రికాను విజయతీరాలకు చేర్చారు. జూన్ 21న సౌతాఫ్రికా, భారత్ మధ్య మ్యాచ్ జరగనుంది.
ఇవి కూడా చదవండి: