Share News

పోటీ బయటి ప్రపంచానిదే.. మేమంతా ఒకే జట్టు: సంజూ

ABN , Publish Date - Sep 16 , 2026 | 01:50 PM

అఫ్గానిస్థాన్‌తో జరిగిన రెండో టీ20లో అదరగొట్టిన భారత వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ సంజూ శాంసన్‌.. తనపై, వైభవ్‌ సూర్యవంశీపై జరుగుతున్న చర్చకు తెరదించాడు. మ్యాచ్‌ అనంతరం మీడియా సమావేశంలో పాల్గొన్న సంజూ.. సోషల్ మీడియాలో జరిగే చర్చలను తాను పెద్దగా పట్టించుకోనన్నాడు.

పోటీ బయటి ప్రపంచానిదే.. మేమంతా ఒకే జట్టు: సంజూ

ఇంటర్నెట్ డెస్క్: అఫ్గానిస్థాన్‌తో జరిగిన రెండో టీ20లో అదరగొట్టిన భారత వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ సంజూ శాంసన్‌.. తనపై, వైభవ్‌ సూర్యవంశీపై జరుగుతున్న చర్చకు తెరదించాడు. 160 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కేవలం 22 బంతుల్లోనే 57 పరుగులు చేసి సంజూ తన ఫామ్‌ను చాటుకున్నాడు. అభిషేక్‌ శర్మతో కలిసి తొలి వికెట్‌కు 88 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి భారత్‌కు శుభారంభాన్నందించి, మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చిన సంగతి తెలిసిందే.


మ్యాచ్‌ అనంతరం.. మీడియా సమావేశంలో ఓపెనింగ్‌ స్థానాల కోసం తనకు, అభిషేక్‌‌కు, వైభవ్‌కు మధ్య పోటీపై సంజూకు ఓ ప్రశ్న ఎదురైంది. దీనికి అతడు స్పందిస్తూ.. 'వైభవ్‌, అభిషేక్‌ నా పోటీదారులనేది బయటి ప్రపంచం మాట. మేమంతా ఒక టీమ్. దేశం కోసం ఆడుతున్నాం. ముందు మ్యాచ్‌లో గెలవడమే మా లక్ష్యం. ఒకరికి అవకాశం రాకపోతే మరొకరికి ఎందుకు ఇచ్చారంటూ బాధపడటం, ప్రతికూల ఆలోచనల్లో ఉండటం జట్టులో పనిచేయదు' అని సమాధానమిచ్చాడు.


భారత క్రికెటర్లపై సోషల్ మీడియాలో జరిగే చర్చలను తాను పెద్దగా పట్టించుకోనని సంజూ చెప్పాడు. అయితే.. కొన్నిసార్లు మాజీ క్రికెటర్ల వ్యాఖ్యలు తన దృష్టికి వస్తుంటాయన్నాడు. 'నేను వై-ఫై ఆఫ్‌ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటాను. కానీ కొన్నిసార్లు అది ఆన్‌ అవుతుంది. అప్పుడప్పుడూ సీనియర్‌ ఆటగాళ్లు ఏదో కామెంట్ చేయడం కనిపిస్తుంది. ఇది సహజమే' అని పేర్కొన్నాడు. టీమ్ఇండియా ఆటగాళ్లపై బయటి ఒత్తిడి కూడా ప్రభావం చూపుతుందనే విషయాన్ని సంజూ అంగీకరించాడు. అయితే ఆటగాడు తన లక్ష్యం, సన్నద్ధత, మైదానంలో అనుసరించాల్సిన మానసిక స్థితిపై స్పష్టతతో ఉండాలని సూచించాడు. బయటి విమర్శలు గతంలో తనను బాధించాయన్న సంజూ.. అనుభవం పెరిగేకొద్దీ వాటిని ఎలా ఎదుర్కోవాలో నేర్చుకున్నానన్నాడు.


ఇవీ చదవండి:

ఆటను, అనారోగ్యాన్ని జయించి..

వర్షిణి..ఇక మహిళా జీఎం

Updated Date - Sep 16 , 2026 | 01:53 PM