Share News

చిన్నస్వామి స్టేడియంలో అనిల్ కుంబ్లే, ద్రవిడ్‌లకు అరుదైన గౌరవం

ABN , Publish Date - Apr 06 , 2026 | 07:45 AM

ఆదివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ సందర్భంగా భారత క్రికెట్‌ దిగ్గజాలు రాహుల్‌ ద్రవిడ్, అనిల్‌ కుంబ్లేలకు అరుదైన గౌరవం లభించింది.

చిన్నస్వామి స్టేడియంలో అనిల్ కుంబ్లే, ద్రవిడ్‌లకు అరుదైన గౌరవం
Dravid Kumble Chinnaswamy Stadium

స్పోర్ట్స్ డెస్క్: ఆదివారం చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు బ్యాటర్లు పరుగుల వరద పారించారు. చెన్నై బౌలర్లపై విరుచుకుపడుతూ.. బౌండరీల వర్షం కురిపించారు. ఫలితంగా 250 పరుగుల భారీ స్కోర్ చేసిన ఆర్సీబీ.. 43 పరుగుల తేడాతో సీఎస్కేపై విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు భారత క్రికెట్‌ దిగ్గజాలు రాహుల్‌ ద్రవిడ్, అనిల్‌ కుంబ్లేలకు అరుదైన గౌరవం లభించింది.


కర్ణాటక రాష్ట్ర క్రికెట్‌ సంఘం (కేఎస్‌సీఏ) బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలోని రెండు ఎండ్‌లకు ఈ ఇద్దరి పేర్లు పెట్టింది. నిన్న(ఆదివారం) రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, చెన్నై సూపర్‌ కింగ్స్‌ మ్యాచ్‌ ప్రారంభానికి ముందు కేఎస్‌సీఏ అధ్యక్షుడు వెంకటేశ్‌ ప్రసాద్‌ సమక్షంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. పాత బీఈఎంఎల్ ఎండ్‌కు ద్రవిడ్ పేరు పెట్టగా, పెవిలియన్ ఎండ్‌కు కుంబ్లే పేరు పెట్టారు. ఈ కార్యక్రమంలో కేఎస్‌సీఏ ప్రతినిధులతో పాటు ద్రవిడ్, కుంబ్లే కుటుంబ సభ్యులు హాజరయ్యారు.


ఈ సందర్భంగా ద్రవిడ్‌ మాట్లాడుతూ... ‘ఈ స్టేడియం నాకు రెండో ఇల్లు లాంటిది. ఈ రోజు ఈ స్థాయికి చేరుకున్నానంటే అంతా ఈ మైదానం వల్లే. కర్ణాటక క్రికెట్‌ సంఘానికి కృతజ్ఞతలు’ అని అన్నాడు. అలానే కుంబ్లే కూడా చిన్నస్వామి వేదికతో ఉన్న అనుబంధాన్ని కూడా పంచుకున్నారు. 'తొమ్మిదేళ్ల వయసులో తొలిసారి ఇక్కడకు వచ్చి ఒక మ్యాచ్ చూశాను. నేడు అదే స్టేడియంలో ఒక పెవిలియన్ పైన నా పేరును చూడటం చాలా సంతోషంగా ఉంది' అని తెలిపాడు.


సుదీర్ఘ కాలం పాటు భారత జట్టుకు సేవలందించిన ద్రవిడ్‌ అంతర్జాతీయ క్రికెట్‌లో 24177 పరుగులు చేయగా... కుంబ్లే ఓవరాల్‌గా 956 వికెట్లు పడగొట్టాడు. ద్రవిడ్, కుంబ్లే, భారత మాజీ క్రికెటర్ శాంత రంగస్వామిల పేర్ల మీద స్టాండ్‌లు/ఎండ్‌లను గౌరవిస్తున్నట్లు ఈ ఏడాది ఫిబ్రవరిలో కేఎస్‌సీఏ ప్రకటించిన సంగతి తెలిసిందే.


ఇవి కూడా చదవండి:

లఖ్‌నవూ బోణీ.. హైదరాబాద్‌పై ఘన విజయం

చరిత్ర సృష్టించిన రవి బిష్ణోయ్

Updated Date - Apr 06 , 2026 | 08:23 AM