డీఎస్పీ పనిమనిషికే రూ.కోటి బంగ్లా
ABN , Publish Date - Apr 06 , 2026 | 04:38 AM
బిహార్‌లోని ఓ పోలీసు అధికారి అక్రమ సంపాదన దర్యాప్తు సంస్థలకే ఆశ్చర్యపడేలా చేసింది. ఆయన ఇంట్లో ఉండే పనిమనిషికే రూ.కోటి బంగ్లా, మహీంద్రా థార్ ఎస్‌వీయూ ఉండడం గమనార్హం.
రూ.45 లక్షల థార్ కారు
భార్య, గర్ల్ ఫ్రెండ్‌లవీ విలాసవంతమైన జీవితాలు
వెలుగులోకి బిహార్ అధికారి అక్రమాలు
పట్నా, ఏప్రిల్ 5: బిహార్‌లోని ఓ పోలీసు అధికారి అక్రమ సంపాదన దర్యాప్తు సంస్థలకే ఆశ్చర్యపడేలా చేసింది. ఆయన ఇంట్లో ఉండే పనిమనిషికే రూ.కోటి బంగ్లా, మహీంద్రా థార్ ఎస్‌వీయూ ఉండడం గమనార్హం. కిషన్‌గంజ్ సబ్ డివిజనల్ పోలీసు అధికారి (డీఎస్పీ)గా పనిచేస్తున్న గౌతం కుమార్ అధికారిక నివాసంపై ఎకనామిక్ అఫెన్సెస్ యూనిట్ (ఈఓయూ) దాడి చేసినప్పుడు ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మార్చి 31న సోదాలు చేయగా ఆయన బిహార్, పశ్చిమ బెంగాల్, నోయిడాల్లో ఆస్తులు గడించినట్టు తేలింది. మొత్తం 36 ఆస్తులు, ఖరీదైన నగలు, గడియారాలు కొనుగోలు చేసినట్టు గుర్తించారు. వీటి విలువ రూ.80 కోట్ల వరకు ఉంటుందని, 32 ఏళ్ల సర్వీసులో జీతంకన్నా కనీసం 60 శాతం అధికంగా సంపాదించినట్టు అధికారులు తొలుత అంచనా వేశారు. శనివారం ఆయన అధికారిక నివాసంలో పనిచేసే పారో అనే మహిళ ఇంట్లో సోదాలు చేసినప్పుడు మరిన్ని విస్తుపోయే అంశాలు తెలిశాయి. ఆ పనిమనిషిది పశ్చిమబెంగాల్‌లోని మాల్దా కాగా, అదే రాష్ట్రంలోని ఉత్తర దినాజ్‌పూర్‌లో ఆమెకు రూ.కోటి విలువ చేసే బంగ్లా ఉంది. రూ.35 లక్షలు విలువ చేసే థార్ వాహనంలో తిరుగుతుంటుంది. గౌతం కుమార్ ఆమెకు బుల్లెట్ మోటారు సైకిల్‌ను బహూకరించారు. సోదాల్లో రూ.6 లక్షలు విలువ చేసే నెక్లస్ లభించింది. ఆమె ఇన్‌స్టాగ్రాం వంటి సామాజిక మాధ్యమాల్లో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. గౌతం కుమార్‌కు పశ్చిమ బెంగాల్‌లోని పూర్ణియాలో విలాసవంతమైన నాలుగు అంతస్తుల భవనం, సిలుగుడిలో తేయాకు తోట, నోయిడా, గురుగ్రాంల్లో ప్లాట్లు ఉన్నాయి. ఆయన భార్య రుబీ కశ్యప్ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు కాగా, విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. గౌతం కుమార్ గర్ల్ ఫ్రెండ్ షగుఫ్తాది కూడా ఇలాంటి జీవనశైలే. రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తుండడంతో దర్యాప్తు సంక్లిష్టంగా మారింది. ఉన్నతాధికారులు గౌతం కుమార్‌ను సస్పెండ్ చేసి, ప్రస్తుతం ఆయన బ్యాంకు ఖాతాలపై దృష్టి పెట్టారు.