కాంగ్రెస్ 3జీ వ్యూహం
ABN , Publish Date - Apr 06 , 2026 | 04:36 AM
అస్సాంలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ వేడి పెరుగుతోంది. భారతీయ జనతా పార్టీకి ముగ్గురు గొగోయ్ (3జీ)లకు మధ్య పోటీగా ఇది మారింది.
అస్సాంలో బీజేపీకి చెక్ పెట్టేందుకు ముగ్గురు గొగోయ్‌లు సిద్ధం
జట్టు కట్టిన గౌరవ్, అఖిల్, లురింజ్యోతి
ప్రాంతీయ శక్తులే కాంగ్రెస్ ఆయుధాలు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 5: అస్సాంలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ వేడి పెరుగుతోంది. భారతీయ జనతా పార్టీకి ముగ్గురు గొగోయ్ (3జీ)లకు మధ్య పోటీగా ఇది మారింది. ఒకానొక సమయంలో ఈ ఎన్నికలు బీజేపీకి పూలబాటే అనుకున్నారు. సీఎం హిమంత బిశ్వ శర్మ నేతృత్వంలో వరుసగా మూడోసారి బీజీపీ పగ్గాలు చేపడుతుందని భావించారు. అయితే కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష కూటమి కూడా గట్టి ఇవ్వడానికి సిద్ధమైంది. ప్రాంతీయ రాజకీయాలను ఆయుధంగా వాడుకునే వ్యూహాలు పన్నింది. ప్రాంతీయ శక్తులను, లెఫ్ట్ పార్టీలను ఏకతాటిపైకి తెచ్చి కమలం పార్టీకి గట్టి పోటీ ఇవ్వనుంది. ప్రతిపక్ష పార్టీలకు చెందిన ముగ్గురు గొగోయ్‌లు.. కాంగ్రెస్ నేత గౌరవ్ గొగోయ్, రాయ్‌జోర్ దళ్ నేత అఖిల్ గొగోయ్, అస్సాం జాతీయ పరిషత్(ఏజేపీ) నేత లురింజ్యోతి గొగోయ్‌లు బీజేపీని ఓడించడానికి సిద్ధమయ్యారు. కాంగ్రెస్ నేతృత్వంలో అసోం సోన్‌మిలిటో మోర్చా(ఏఎస్ఎం)గా కూటమి కట్టారు. గౌరవ్ గొగోయ్ వారసత్వంగా రాజకీయాల్లో ఎదిగారు. క్షేత్రస్థాయిలో సుదీర్ఘ పోరాటాల ద్వారా అఖిల్ పేరు తెచ్చుకున్నారు. పౌరసత్వ చట్టం (సీఏఏ) వ్యతిరేక ఉద్యమ సమయంలో లురింజ్యోతి కీలకంగా వ్యవహరించారు. వీరి ముగ్గురి ఇంటి పేర్లు ఒకటే కావడంతో వారు ఒక్కటే అంటూ హిమంత్ బిశ్వ శర్మ తరచూ విమర్శిస్తూ వస్తున్నారు. ఆ ముగ్గురినీ ఒకేగాటన కట్టి ‘మియాస్’ అంటూ ఆయన ఎన్నికల సభల్లో సంభోదిస్తున్నారు. ఈ పదాన్ని బెంగాల్ ముస్లింలు వాడుతూ ఉంటారు. బీజేపీ అధికారం కోల్పోతే రాష్ట్రాన్ని ఆ మియాస్ హస్తగతం చేసుకుంటారని ఆయన ప్రజలను హెచ్చరిస్తున్నారు. అస్సాం ప్రజల గుర్తింపు పరిరక్షణ కోసం తాము ఎన్నికల్లో పోరాడుతున్నామని చెబుతున్న బిశ్వ శర్మ, దానిని చెడగొట్టడానికి ప్రతిపక్షాలు ఏకమయ్యాయని ప్రజలను హెచ్చరిస్తున్నారు. హిమంత విమర్శలను ప్రతిపక్షాలు తిప్పికొడుతున్నాయి. పాలనలో లోపాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు చేసే ప్రయత్నమని మండిపడుతున్నాయి. .
గౌరవ్ వర్సెస్ హిమంత
ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ నేత గౌరవ్ గొగోయ్‌కు సీఎం హిమంతకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. గౌరవ్‌కు పాక్‌తో సంబంధాలు ఉన్నాయని, 2013లో ఆయన ఆ దేశానికి రహస్యంగా వెళ్లి వచ్చారని హిమంత విమర్శించడంతో వారి వైరం మరింత ముదిరింది. హిమంత ఆరోపణలను గౌరవ్ కొట్టిపడేశారు. అయితే తరుణ్ గొగోయ్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వంలో హిమంత కీలకపాత్ర పోషించారు. తరుణ్ కుమారుడు గౌరవ్ గొగోయ్‌ను ముఖ్యమంత్రిగా చిత్రీకరించడం ప్రారంభించడంతో 2015లో హిమంత కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. తర్వాత ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఇక అఖిల్ తొలి నుంచి బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో సర్బానంద్ సోనోవాల్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. ఆందోళనల కారణంగా జైల్లో ఉన్నా 2021లో శివసాగర్ సీటు గెలిచారు. ప్రాంతీయ సమస్యలను చక్కదిద్దడంలో కంటే బీజేపీకి మత రాజకీయాలే మక్కువని ఆయన విమర్శిస్తున్నారు. 126 అసెంబ్లీ స్థానాలున్న అస్సాంలో ఆయన పార్టీ రాయ్‌జోర్ దళ్ 16 స్థానాల్లో పోటీ చేస్తోంది. పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా పోరాడిన లురింజ్యోతి గొగోయ్ పార్టీ ఏజేపీ 10 సీట్లలో పోటీ చేస్తోంది.
ఎగువ అస్సాం కీలకం
జోర్హాట్, శివసాగర్, దిబ్రూగడ్ వంటి జిల్లాలు ఉన్న ఎగువ అస్సాం చాలా కీలకమైన ప్రాంతం. ఇక్కడ అహోమ్ జాతి ప్రజలు ఎక్కువగా ఉంటారు. తేయాకు తోటలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇది ఈప్రాంతానికి గొప్ప గుర్తింపు తీసుకొస్తోంది. ఇక్కడ పైచేయి సాధించి మూడో సారి అధికారం చేపట్టాలని కమలం పార్టీ భావిస్తోంది. అయితే, ఇక్కడ ముగ్గురు గొగోయ్‌లకు ఈ ప్రాంతంలో గట్టి పట్టు ఉంది. అస్సాంలో ఈనెల 9న పోలింగ్ జరగనుంది.
హిమంత దేశంలోనే అత్యంత అవినీతి సీఎం: రాహుల్
అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మకు జైలుకు పంపిస్తామని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ హెచ్చరించారు. అస్సాం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం బిశ్వనాథ్‌లో జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. ‘హిమంత దేశంలోనే అత్యంత అవినీతిపరుడైన ముఖ్యమంత్రి.. విద్వేషాలను వ్యాప్తిచేసే సీఎం.. మతతత్వ ముఖ్యమంత్రి’ అని ఆరోపించారు. తన అవినీతిలోకి కుటుంబ సభ్యులను కూడా ఇరికించారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఆరు కులాలకు ఎస్సీ/ఎస్టీ హోదా కల్పిస్తామని.. తేయాకు కార్మికులకు వేతనాలు రోజుకు రూ.450కి పెంచుతామని హామీ ఇచ్చారు.