చెన్నై.. మూడో‘సారీ’
ABN , Publish Date - Apr 06 , 2026 | 02:27 AM
మాజీ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ వేదికలు మారినా.. తమ ఆటతీరు ఇంతే అన్నట్టుగా సాగుతోంది. పేలవ బౌలింగ్‌తో నిరాశపరుస్తూ హ్యాట్రిక్ ఓటములతో పట్టికలో అట్టడుగున...
నేటి మ్యాచ్
కోల్‌కతా X పంజాబ్
వేదిక కోల్‌కతా రా.7.30 నుంచి
43 రన్స్‌తో బెంగళూరు గెలుపు
చెలరేగిన డేవిడ్, దేవ్‌దత్
టిమ్ డేవిడ్ (25 బంతుల్లో 3 ఫోర్లు, 8 సిక్సర్లతో 70 నాటౌట్)
పడిక్కళ్ (50)
బెంగళూరు: మాజీ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ వేదికలు మారినా.. తమ ఆటతీరు ఇంతే అన్నట్టుగా సాగుతోంది. పేలవ బౌలింగ్‌తో నిరాశపరుస్తూ హ్యాట్రిక్ ఓటములతో పట్టికలో అట్టడుగున నిలిచింది. అటు డిఫెండింగ్ చాంపియన్ రాయల్స్ చాలెంజర్స్ బెంగళూరు మాత్రం తమ జోరును కొనసాగిస్తోంది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో బెంబేలెత్తించిన రజత్ సేన 43 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 3 వికెట్లకు 250 పరుగులు చేసింది. డేవిడ్ (25 బంతుల్లో 3 ఫోర్లు, 8 సిక్సర్లతో 70 నాటౌట్), దేవ్‌దత్ పడిక్కళ్ (29 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 50), రజత్ (19 బంతుల్లో 1 ఫోర్, 6 సిక్సర్లతో 48 నాటౌట్), సాల్ట్ (30 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 46) అదరగొట్టారు. ఆ తర్వాత ఛేదనలో చెన్నై 19.4 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌటైంది. సర్ఫరాజ్ (25 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 50), ప్రశాంత్ (29 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌తో 43), ఒవర్టన్ (16 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 37) మాత్రమే రాణించారు. భువనేశ్వర్‌కు మూడు.. క్రునాల్, అభినందన్, డఫీలకు రెండేసి వికెట్లు దక్కాయి. టిమ్ డేవిడ్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు.
సర్ఫరాజ్ ఒక్కడే..: సీఎ్‌సకే భారీ ఛేదనలో సర్ఫరాజ్ ఇన్నింగ్స్ మాత్రమే హైలైట్‌గా నిలిచింది. సీనియర్ ఓపెనర్లు శాంసన్ (9), రుతురాజ్ (7)లతో పాటు ఆయుష్ (1) తొలి మూడు ఓవర్లలోనే వెనుదిరిగారు. ఈ స్థితిలో సర్ఫరాజ్ ఎడాపెడా షాట్లతో ఆకట్టుకున్నాడు. అతడి జోరుకు పవర్‌ప్లేలో జట్టు 77/4 స్కోరుతో నిలిచింది. అలాగే తను 24 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కానీ అదే స్కోరుపై వెనుదిరగడంతో జట్టు జోరుకు బ్రేక్ పడింది. దూబే (18) కూడా విఫలం కాగా, యువ బ్యాటర్ ప్రశాంత్ మాత్రం ఆర్‌సీబీ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నాడు. ఒవర్టన్ కూడా వేగం కనబర్చడంతో ఏడో వికెట్‌కు 57 రన్స్ చేరాయి. స్వల్ప వ్యవధిలోనే వీరు వెనుదిరగడంతో చెన్నైకి దారులన్నీ మూసుకుపోయాయి.
బాదుడే బాదుడు: టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు ఇన్నింగ్స్ నెమ్మదిగా సాగి క్రమేపీ రాకెట్ వేగాన్ని అందుకుంది. డెత్ ఓవర్లలో టీమ్ డేవిడ్, రజత్ పటీదార్ విధ్వంసం కారణంగా ఐదు ఓవర్లలోనే 97 పరుగులు సమకూరడం విశేషం. తొలి మూడు ఓవర్లు చెన్నై బౌలర్లు నియంత్రించినా ఆ తర్వాత చేసేదేమీ లేకపోయింది. తొలి వికెట్‌కు 37 పరుగులు జత చేశాక ఓపెనర్ విరాట్ ఐదో ఓవర్‌లో వెనుదిరిగాడు. ఆ తర్వాత సాల్ట్‌తో జత కలిసిన దేవ్‌దత్ స్కోరులో వేగం పెంచాడు. ముఖ్యంగా పవర్‌ప్లే ముగిశాక బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. దీంతో రెండో వికెట్‌కు 37 బంతుల్లోనే 56 పరుగుల భాగస్వామ్యం ఏర్పడింది. 13వ ఓవర్‌లో రజత్ 6, దేవ్‌దత్ 6,4,4తో 23 పరుగులు లభించాయి. 28 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేశాక దేవ్‌దత్ వెనుదిరిగాడు. కానీ ఆ తర్వాత రజత్, డేవిడ్ బాదుడుకు స్కోరు దూసుకెళ్లింది. ఖలీల్ ఓవర్‌లో 6,4,6తో రజత్ 19 రన్స్ రాబట్టగా, ఇక 19వ ఓవర్‌లో 6,2,4,6,6,6తో డేవిడ్ 30 రన్స్ రాబట్టడంతో 21 బంతుల్లోనే ఫిఫ్టీ కూడా పూర్తయ్యింది.
స్కోరుబోర్డు
బెంగళూరు: సాల్ట్ (సి) నూర్ (బి) దూబే 46, విరాట్ (సి) దూబే (బి) అన్షుల్ 28, దేవ్‌దత్ (బి) ఒవర్టన్ 50, రజత్ పటీదార్ (నాటౌట్) 48, టిమ్ డేవిడ్ (నాటౌట్) 70, ఎక్స్‌ట్రాలు: 8; మొత్తం: 20 ఓవర్లలో 250/3; వికెట్ల పతనం: 1-37, 2-93, 3-151; బౌలింగ్: ఖలీల్ 4-0-37-0, హెన్రీ 3-0-36-0, అన్షుల్ 4-0-52-1, నూర్ 4-0-49-0, ఒవర్టన్ 3-0-42-1, దూబే 2-0-30-1.
చెన్నై: శాంసన్ (సి) దేవ్‌దత్ (బి) డఫీ 9, రుతురాజ్ (సి) దేవ్‌దత్ (బి) డఫీ 7, మాత్రే (సి) రజత్ (బి) భువనేశ్వర్ 1, సర్ఫరాజ్ (స్టంప్) జితేశ్ (బి) క్రునాల్ 50, కార్తీక్ (సి) అభినందన్ (బి) క్రునాల్ 6, దూబే (సి) జితేశ్ (బి) అభినందన్ 18, ప్రశాంత్ (సి) రజత్ (బి) భువనేశ్వర్ 43, ఒవర్టన్ (సి సబ్) బెథెల్ (బి) సుయాష్ 37, అన్షుల్ (నాటౌట్) 19, నూర్ (సి) విరాట్ (బి) భువనేశ్వర్ 8, హెన్రీ (సి) సాల్ట్ (బి) అభినందన్ 2; ఎక్స్‌ట్రాలు: 7; మొత్తం: 19.4 ఓవర్లలో 207 ఆలౌట్. వికెట్ల పతనం: 1-9, 2-10, 3-30, 4-77, 5-84, 6-108, 7-165, 8-178, 9-190, 10-207. బౌలింగ్: డఫీ 4-0-58-2, భువనేశ్వర్ 4-0-41-3, అభినందన్ 3.4-0-30-2, క్రునాల్ 3-0-36-2, సుయాష్ 4-0-21-1, షెఫర్డ్ 1-0-19-0.
1
సీఎ్‌సకేపై అత్యధిక స్కోరు (250) నమోదు చేసిన జట్టుగా ఆర్‌సీబీ