Share News

ఐపీఎల్ 2026: పంజాబ్ కింగ్స్ చెత్త రికార్డ్!

ABN , Publish Date - May 15 , 2026 | 10:37 AM

ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభంలో వరుస విజయాలతో దూసుకెళ్లిన పంజాబ్ కింగ్స్.. ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కుంటుంది. తొలి 7 మ్యాచ్‌ల్లో ఓటమెరుగని జట్టుగా నిలిచిన పంజాబ్ కింగ్స్.. ఐపీఎల్ చరిత్రలోనే ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా చరిత్రకెక్కింది.

ఐపీఎల్ 2026: పంజాబ్ కింగ్స్ చెత్త రికార్డ్!
Punjab Kings 2026

స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభంలో వరుస విజయాలతో దూసుకెళ్లిన పంజాబ్ కింగ్స్.. ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కుంటుంది. తొలి 7 మ్యాచ్‌ల్లో ఓటమెరుగని జట్టుగా నిలిచిన పంజాబ్ కింగ్స్.. ఐపీఎల్ చరిత్రలోనే ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా చరిత్రకెక్కింది. కానీ ఆ తర్వాత అనూహ్యంగా చతకిలపడి చెత్త రికార్డ్‌ను మూటగట్టుకుంది. నిన్న ముంబై మ్యాచ్‏తో పంజాబ్ కింగ్స్ వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది.


గురువారం ముంబై ఇండియన్స్‌‌తో ధర్మశాల వేదికగా ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్‌ ఓడింది. మరోసారి 200 లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధికసార్లు 200+ పరుగులు చేసినా ఓడిన జట్టుగా పంజాబ్ చెత్త రికార్డును నమోదు చేసింది. ఇప్పటి వరకు 10 సార్లు 200+ పరుగులు చేసి పంజాబ్ ఓడింది. 7 ఓటములతో ఆర్సీబీ, 6 ఓటములతో సీఎస్కే ఈ జాబితాలో తర్వాతి స్థానాల్లో నిలిచాయి. అలానే ఐపీఎల్‌లో వరుసగా 5 అంతకంటే ఎక్కువ మ్యాచ్‌ల్లో గెలిచి.. ఆ తర్వాత వరుసగా ఐదు మ్యాచ్‌లు ఓడిన రెండో జట్టుగా చెత్త రికార్డ్‌ను మూటగట్టుకుంది. ఐపీఎల్ 2022 సీజన్‌లో సన్‌ రైజర్స్ హైదరాబాద్ కూడా ఈ ఫీట్ నమోదు చేసింది.


వరుస ఓటముల కారణంగా ఈ టోర్నీలో ప్లే ఆఫ్స్ చేరాలంటే పంజాబ్ కింగ్స్ రెండు మ్యాచ్‌లకు రెండు గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలానే పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ఐపీఎల్‌లో అయ్యర్ సారథ్యంలో 200+ పరుగులు చేసిన పంజాబ్ కింగ్స్ 20 మ్యాచ్‌ల్లో 12 విజయాలు సాధించగా.. ఏడింటిలో ఓడింది. ఫలితం తేలని మ్యాచ్ ఒక్కటి ఉంది. ప్రపంచవ్యాప్తంగా T20ల్లో కేవలం ఫాఫ్ డు ప్లెసిస్ మాత్రమే ఇన్ని ఓటములను ఎదుర్కొన్నారు.

టీ20ల్లో 200+ ఛేజింగ్‌లో ఎదురైన అత్యధిక ఓటములు:

  • 10 - పంజాబ్ కింగ్స్

  • 8 - వెస్టిండీస్

  • 7 - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

  • 6 - చెన్నై సూపర్ కింగ్స్.


ఈ వార్తలు కూడా చదవండి

వీరేంద్ర సెహ్వాగ్‌పై మండిపడుతున్న బుమ్రా ఫ్యాన్స్

చెఫ్‌గా మారిన వైభవ్ సూర్యవంశీ.. వీడియో వైరల్

Updated Date - May 15 , 2026 | 10:56 AM