Share News

ప్రియాన్షు ట్రిపుల్ సెంచరీ.. 79 ఏళ్ల రికార్డు బద్దలు

ABN , Publish Date - Oct 27 , 2026 | 07:24 PM

రంజీ ట్రోఫీ 2026-27లో బరోడా యువ బ్యాటర్ ప్రియాన్షు మోలియా చరిత్ర సృష్టించాడు. ఎలైట్ గ్రూప్-ఏలో భాగంగా జమ్మూ కశ్మీర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 21 ఏళ్ల ఈ యువ బ్యాటర్ ట్రిపుల్‌ సెంచరీ (321)తో చెలరేగాడు.

 ప్రియాన్షు ట్రిపుల్ సెంచరీ.. 79 ఏళ్ల రికార్డు బద్దలు
Priyanshu Moliya Triple Century

స్పోర్ట్స్ డెస్క్: రంజీ ట్రోఫీ 2026-27లో బరోడా యువ బ్యాటర్ ప్రియాన్షు మోలియా చరిత్ర సృష్టించాడు. ఎలైట్ గ్రూప్-ఏలో భాగంగా జమ్మూ కశ్మీర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 21 ఏళ్ల ఈ యువ బ్యాటర్ ట్రిపుల్‌ సెంచరీ (321)తో చెలరేగాడు. ఈ క్రమంలోనే అతడు 79 ఏళ్ల రికార్డును బ్రేక్ చేశాడు. బరోడా తరఫున ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఆటగాడిగా నిలిచాడు.


1947లో గుల్ మహమ్మద్ బరోడా తరఫున ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 319 పరుగులు చేశాడు. ఇప్పటి వరకు ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోర్‌గా ఉండింది. ఈ రికార్డును ప్రియాన్షు తాజాగా అధిగమించాడు. అలానే ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన ఏడో అతి పిన్న భారత బ్యాటర్‌గా నిలిచాడు. 21 ఏళ్ల 132 రోజుల వయసులో ప్రియాన్షు ట్రిపుల్ సెంచరీ చేశాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు భారత బ్యాటర్‌గా వసీం​ జాఫర్‌ (18 ఏళ్ల 262 రోజులు) పేరిట ఉంది.


మ్యాచ్‌ విషయానికొస్తే.. టాస్ గెలిచిన బరోడా బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు ధ్రువ్ పటేల్(21), శివాలిక్ శర్మ(29) తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు. ఈ క్రమంలో ప్రియాంన్షు మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. 492 బంతుల్లో 36 ఫోర్లు, ఒక సిక్స్‌ సాయంతో 321 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మహేశ్ పిథియాతో కలిసి ఏడో వికెట్‌కు 232 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. పిథియా తన తొలి ఫస్ట్‌క్లాస్ సెంచరీ (102) సాధించాడు. ప్రియాంన్షు, పిథియా సత్తా చాటడంతో బరోడా తొలి ఇన్నింగ్స్‌లో 616 పరుగులకు ఆలౌటైంది. ఒకవైపు వికెట్లు పడుతున్నా.. మరోవైపు ప్రియాంన్షు నిలకడగా ఆడుతూ.. చివరి వరకు నిలపడ్డాడు.


అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన జమ్మూ కశ్మీర్‌ తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్‌ నష్టపోకుండా 6 పరుగులు చేసింది. కమ్రాన్‌ ఇక్బాల్‌ (0), షుభమ్‌ ఖజూరియా (2) క్రీజ్‌లో ఉన్నారు. జమ్మూ కశ్మీర్‌ బరోడా తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌కు ఇంకా 610 పరుగులు వెనుకపడి ఉంది. ఈ మ్యాచ్ వడోదరాలోని రిలయన్స్ స్టేడియంలో జరుగుతోంది.


ఇవి కూడా చదవండి:

12 బంతుల్లో 50 పరుగులు.. యువరాజ్‌కు అభిషేక్ శర్మ ఫన్నీ కౌంటర్..

షేక్ చేసిన అభిషేక్.. కోహ్లీ రికార్డు బద్దలు!

చైనా చొరబాటు అంటూ తప్పుడు ప్రచారం.. కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలి: కిరణ్ రిజిజు

ఖైదీలు పారిపోతుంటే ఏం చేస్తున్నారు?.. విజయ్‌ను నిలదీసిన స్టాలిన్

Updated Date - Oct 27 , 2026 | 07:26 PM