న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్.. బుమ్రాకి విశ్రాంతి?.. టెస్టుల కోసమేనా?
ABN , Publish Date - Oct 15 , 2026 | 07:52 PM
ప్రస్తుతం టీమిండియా వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌ను ఆడుతోంది. ఇది ముగిసిన తర్వాత.. భారత జట్టు న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనుంది. అక్కడ ఐదు టీ20లు, ఐదు వన్డేలు, రెండు టెస్టులను ఆడనుంది.
ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం భారత్ వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌ను ఆడుతోంది. ఇప్పటికే 2-2తో ఇరుజట్లు సమానంగా ఉన్నాయి. నిర్ణయాత్మకమైన చివరి మ్యాచ్ శనివారం జరగనుంది. ఈ సిరీస్ ముగిసిన వెంటనే టీమిండియా న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనుంది. అక్కడ ఐదు టీ20లు, ఐదు వన్డేలు, రెండు టెస్టులను ఆడనుంది. ఇప్పటికే టీ20 సిరీస్ కోసం స్క్వాడ్‌ను బీసీసీ ప్రకటించింది. త్వరలో వన్డే సిరీస్ కోసం జట్టును ప్రకటించే అవకాశం ఉంది. ఈ క్రమంలో జస్ప్రీత్ బుమ్రాకు వన్డే సిరీస్ నుంచి విశ్రాంతి ఇస్తారనే సమాచారం. టెస్టు సిరీస్ కోసమే ఈ నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి.
గత కొన్ని సిరీస్‌లలో స్పష్టంగా కనిపిస్తున్న విషయం ఏమిటంటే.. జస్ప్రీత్ బుమ్రా లేకపోవడంతో భారత బౌలింగ్ దళం బలహీనపడటం. అందుకే ఈ స్టార్ పేసర్‌ను చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. అతడి ప్రదర్శనలను నిర్దిష్ట మ్యాచులకు మాత్రమే పరిమితం చేశారు. ‘బుమ్రా పూర్తి స్థాయిలో ఫిట్‌గా ఉన్నాడు. కివీస్ పర్యటన సుదీర్ఘమైంది. టీ20, వన్డే సిరీస్ లతో పోలిస్తే టెస్టు సిరీస్ ముఖ్యమైంది. వన్డేల నుంచి రెడ్ బాల్ క్రికెట్‌పై వెంటనే ఫోకస్ చేయడం చాలా కష్టమవుతుంది. వచ్చే ఏడాది బోర్డర్ - గావస్కర్ ట్రోఫీ కూడా ఉంది. ద్వైపాక్షిక సిరీస్‌ల కోసం అతడితో పరిమిత ఓవర్ల క్రికెట్ ఎక్కువగా ఆడించకూడదు. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ చాలా ముఖ్యం. దానిని దృష్టిలో ఉంచుకొనే ప్రణాళికలు సిద్ధం చేస్తాం’ అని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి.
వెస్టిండీస్‌తో జరుగుతున్న వైట్ బాల్ సిరీస్‌లో భారత్ బౌలింగ్ సవాలును ఎదుర్కొంటున్న నేపథ్యంలో.. జస్ప్రీత్ బుమ్రా లాంటి బౌలర్ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని భారత వికెట్ కీపర్-బ్యాటర్ సంజు శాంసన్ అంగీకరించాడు. దీని బట్టే టీమిండియాలో బుమ్రా ఎంత కీలకమైన ప్లేయరో అర్థం చేసుకోవచ్చు. ఇక న్యూజిలాండ్ పర్యటన విషయానికి వస్తే.. టీ20 సిరీస్ అక్టోబర్ 22 నుంచి నవంబర్ 1 వరకు జరగనున్నాయి. వన్డేలు నవంబర్ 4 నుంచి మొదలై 15వ తేదీ వరకూ జరుగుతాయి. నవంబర్ 19న తొలి టెస్టు, నవంబర్ 27న రెండో టెస్టు ప్రారంభంకానున్నాయి.
ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (World Test Championship 2025-27) నాలుగో సీజన్లో భారత్ ఫైనల్‌కు చేరుకోవాలంటే రాబోయే ప్రతి మ్యాచూ కీలకమైందే. కివీస్‌ను తమ సొంత గడ్డపై ఎదుర్కోవడం ఏ జట్టుకైనా కష్టమే. ఇప్పుడు ఆ కఠిన పరీక్ష భారత్ ముందుంది. అందుకోసమే బుమ్రా వంటి కీలకమైన బౌలర్‌కు వన్డే సిరీస్ నుంచి విశ్రాంతి ఇచ్చి.. టెస్టుల్లోనే ఆడించాలనేదే మేనేజ్మెంట్ ప్రణాళికగా ఉంది.
Also Read:
గంగూలీకి అసిస్టెంట్‌గా యువీ.. 25 ఏళ్ల అనుబంధంపై కామెంట్!
జంతర్ మంతర్‌పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. కేంద్రానికి నోటీసులు
పతకాలు కేవలం అంకెలు కావు.. భారత శక్తికి ప్రతీకలు: ప్రధాని మోదీ