Share News

స్మృతి మంధాన‌ను ఊరిస్తున్న అరుదైన ప్ర‌పంచ రికార్డు!

ABN , Publish Date - Oct 15 , 2026 | 04:00 PM

భార‌త మహిళా స్టార్ బ్యాట‌ర్‌ స్మృతి మంధాన కెప్టెన్‌గా తొలి ప‌రీక్ష‌ను ఎదుర్కోనుంది. రేప‌టి నుంచి భార‌త్‌, జింబాబ్వే మ‌ధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జ‌ర‌గ‌నుంది. ఈ నేపథ్యంలోనే ఆమెను ఓ ప్రపంచ రికార్డు ఊరిస్తుంది.

స్మృతి మంధాన‌ను ఊరిస్తున్న అరుదైన ప్ర‌పంచ రికార్డు!
Smriti Mandhana Record

స్పోర్ట్స్ డెస్క్: టీమిండియా మహిళా స్టార్ బ్యాట‌ర్‌ స్మృతి మంధాన కెప్టెన్‌గా ఇటీవల ఎంపికైన సంగతి తెలిసిందే. మాజీ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ఆ పదవి నుంచి తొలగినట్లు ప్రకటించడంతో కొత్త సారథిగా స్మృతి ఎంపికైంది. ఇక కెప్టెన్‌గా మంధాన తొలి అగ్నిప‌రీక్ష‌ను ఎదుర్కోనుంది. రేప‌టి నుంచి భార‌త్‌, జింబాబ్వే మ‌ధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జ‌ర‌గ‌నుంది. పూర్తిస్థాయి కెప్టెన్‌గా మంధాన‌కు ఇదే తొలి టీ20 సిరీస్ కానుంది. ఈ నేప‌థ్యంలో కెప్టెన్‌గా త‌న తొలి మ్యాచ్‌లోనే భార‌త్‌ను గెలిపించాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉంది.


కెప్టెన్ క‌మ్‌ బ్యాట‌ర్‌గా ఉన్న స్మృతి మంధాన ముందు ఒక ప్ర‌పంచ రికార్డు ఉంది. ఈ స్టార్ బ్యాటర్ మ‌రో 133 ప‌రుగులు సాధిస్తే అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో 5వేల ప‌రుగులు పూర్తవుతాయి. తద్వారా ఈ ఘ‌న‌త సాధించిన తొలి మ‌హిళా బ్యాట‌ర్‌గా మంధాన చరిత్ర సృష్టించనుంది. ఇప్ప‌టివ‌ర‌కు మంధాన 179 మ్యాచ్‌ల్లో 127.5 స్ట్రైక్‌రేట్‌తో 4,867 ప‌రుగులు చేసింది. ఆమె ఖాతాలో రెండు సెంచ‌రీలు, 37 అర్థ‌సెంచ‌రీలు ఉన్నాయి.


మ‌హిళ‌ల అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో మంధాన త‌ర్వాత అత్య‌ధిక ప‌రుగులు చేసిన క్రికెట‌ర్ల జాబితాలో న్యూజిలాండ్ బ్యాట‌ర్ సుజీ బేట్స్ (4,758 ప‌రుగులు*) రెండో స్థానంలో ఉండ‌గా, మాజీ కెప్టెన్‌ హ‌ర్మ‌న్‌ప్రీత్ కౌర్ (4,327 ప‌రుగులు*), శ్రీలంక కెప్టెన్ చ‌మేరి ఆట‌ప‌ట్టు (4,282 ప‌రుగులు*) మూడు, నాలుగు స్థానాల్లో కొన‌సాగుతున్నారు. మరోవైపు భారత్, జింబాబ్వే మ‌ధ్య మూడు టీ20 మ్యాచ్‌లు వ‌రుస‌గా అక్టోబ‌ర్ 16, 18, 20వ తేదీల్లో జ‌ర‌గ‌నున్నాయి. ఈ మ్యాచ్‌ల‌కు రాయ్‌పూర్ ఆతిథ్య‌మివ్వ‌నుంది.


ఇవీ చదవండి:

సెలెక్షన్‌ కమిటీ చైర్మన్‌గా ఓఝా?

మళ్లీ సన్‌రైజర్స్‌ గూటికి నటరాజన్‌

Updated Date - Oct 15 , 2026 | 04:06 PM