ఎస్బీఐ రుణగ్రహీతలకు షాక్.. పెరగనున్న ఈఎంఐల వడ్డీ రేట్లు
ABN , Publish Date - Oct 15 , 2026 | 02:33 PM
వినియోగదారులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) షాక్ ఇచ్చింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచిన నేపథ్యంలో ఎస్బీఐ వడ్డీ రేట్లను పెంచేసింది.
ఇంటర్నెడ్ డెస్క్: వినియోగదారులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) షాక్ ఇచ్చింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచిన నేపథ్యంలో వడ్డీ రేట్లను పెంచేసింది. దీంతో ఎంపిక చేసిన కాలపరిమితులకు సంబంధించిన రుణ వడ్డీ రేట్లు పెరిగాయి. ఈ మార్పుల ప్రభావంతో ఆయా వడ్డీ రేట్లకు అనుసంధానమైన ఈఎమ్ఐల రేట్లూ పెరగనున్నాయి.
ఎస్బీఐ ఎక్స్టర్నల్ బెంచ్మార్క్ లింక్డ్ లెండింగ్ రేట్ (ఈబీఎల్ఆర్), రెపో లింక్డ్ లెండింగ్ రేట్ (ఆర్ఎల్ఎల్ఆర్)లను పెంచింది. ఈబీఎల్ఆర్ను 7.90 శాతం నుంచి 8.15 శాతానికి, ఆర్ఎల్ఎల్ఆర్ను 7.50 శాతం నుంచి 7.75 శాతానికి పెంచింది. ఈ మార్పులు ప్రధానంగా సంబంధిత బెంచ్మార్క్లకు అనుసంధానమైన గృహ రుణాలు, ఇతర రుణాలపై ప్రభావం చూపవచ్చు. అయితే ప్రతి రుణగ్రహీత ఈఎంఐ ఒకే విధంగా పెరుగుతుందని చెప్పలేం. రుణ ఒప్పందంలోని నిబంధనలు, వడ్డీ రేటు రీసెట్ సమయం, మిగిలి ఉన్న రుణ మొత్తం, కాలపరిమితి ఆధారంగా వడ్డీ రేట్లు మారతాయి. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ (ఎంసీఎల్ఆర్)లోనూ ఎస్బీఐ మార్పులు చేసింది. అయితే ఓవర్నైట్, నెల రోజుల కాలపరిమితుల వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. మూడు నెలల నుంచి మూడేళ్ల వరకు ఎంపిక చేసిన కాలపరిమితులకు వడ్డీ రేట్లను 0.15 శాతం పెంచింది.
ఈ వార్తలూ చదవండి
ఫుల్ జోష్లో స్టాక్ మార్కెట్.. 1000 పాయింట్లకు పైగా పెరిగిన సెన్సెక్స్.
సిబిల్ స్కోర్ పడిపోయిందా..? ఆరు నెలల్లో పెంచుకోండిలా