ఫుల్ జోష్‌లో స్టాక్ మార్కెట్.. 1000 పాయింట్లకు పైగా పెరిగిన సెన్సెక్స్..
ABN , Publish Date - Oct 15 , 2026 | 11:30 AM
భారత స్టాక్ మార్కెట్లు గురువారం భారీ లాభాలతో దూసుకెళ్తున్నాయి. గత సెషన్లో నష్టాలను చవిచూసిన సూచీలు తిరిగి పుంజుకున్నాయి. ఐటీ, బ్యాంకింగ్ షేర్లలో కొనుగోళ్లు, ముడిచమురు ధరల తగ్గుదల, రూపాయి బలపడటం మార్కెట్ ర్యాలీకి ప్రధాన కారణాలుగా నిలిచాయి.
ఇంటర్నెట్ డెస్క్: భారత స్టాక్ మార్కెట్లు గురువారం భారీ లాభాలతో దూసుకెళ్తున్నాయి. గత సెషన్లో నష్టాలను చవిచూసిన సూచీలు తిరిగి పుంజుకున్నాయి. ఐటీ, బ్యాంకింగ్ షేర్లలో కొనుగోళ్లు, ముడిచమురు ధరల తగ్గుదల, రూపాయి బలపడటం మార్కెట్ ర్యాలీకి ప్రధాన కారణాలుగా నిలిచాయి. ఉదయం 11.30 గంటల సమయంలో సెన్సెక్స్ 1000 పాయింట్లకు పైగా లాభంలో ఉంది. నిఫ్టీ 50 సూచీ 291 పాయింట్లు పెరిగి 22,950 స్థాయికి చేరువైంది (Sensex surges 1000 points).
ఐటీ రంగ షేర్లపై మదుపర్లు ఆసక్తి కనబరచడం సూచీల లాభాలకు ప్రధానం కారణం. హెచ్‌సీఎల్‌టెక్ త్రైమాసిక ఫలితాలు ఆశాజనకంగా ఉండటంతో ఐటీ రంగంపై పెట్టుబడిదారుల్లో ఆసక్తి పెరిగింది. టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్‌టెక్, టెక్ మహీంద్రా వంటి కంపెనీల షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. కంపెనీల ఆర్థిక ఫలితాలు, ఏఐ ఆధారిత సేవల ద్వారా ఆదాయం పెరిగే అవకాశాలపై పెట్టుబడిదారులు దృష్టి సారిస్తున్నారు. ఐటీ కంపెనీలతో పాటు బ్యాంకింగ్ రంగ షేర్లలోనూ కొనుగోళ్లు కనిపించాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ వంటి హెవీ వెయిట్ షేర్లు పెరగడం సూచీలకు అదనపు మద్దతునిచ్చింది (Indian stock market rally).
అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గడం భారత మార్కెట్లకు కొంత ఊరటనిచ్చింది (Stock market news). భారత్ తన చమురు అవసరాల్లో అధిక భాగాన్ని దిగుమతి చేసుకుంటుంది. ముడిచమురు ధరలు తగ్గితే దిగుమతి వ్యయం, ద్రవ్యోల్బణ ఒత్తిడి తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి బలపడటం కూడా మార్కెట్ సెంటిమెంట్‌కు మద్దతునిచ్చింది. ప్రస్తుతం డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 95.08గా ఉంది.
ఇవి కూడా చదవండి..
చైనా విడిభాగాలతో హూతీల క్షిపణులు.. ఇజ్రాయెల్, సౌదీ అరేబియాకు ముప్పు తప్పదా..
మరికొంచెం తగ్గిన ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..